మీ నాన్న లేని జీవితం మనకొద్దమ్మా
► భర్త ఆత్మహత్య తాళలేక ...
► తన ఇద్దరు కుమార్తెలపై కిరోసిన్ పోసి...ఓ తల్లి అఘాయిత్యం
► చామరాజనగర్ జిల్లాలో
► రైతు కుటుంబంలో విషాదం
► ఉసురు తీసిన అప్పులు
తరచూ సరదాగా గడచిపోయే ఆదివారమే వారి జీవితాల్లో చివరి రోజు అని భావించి ఉండరు. తన ఇద్దరి పిల్లలకు ఉదయమే పాలు తాపి రాత్రి పొలం కాపలాకు వెళ్లిన భర్తకు టీ తీసుకుని బయలుదేరిన ఆ మహిళకు భర్త నిర్జీవంగా కనిపించడంతో తీవ్ర మనస్థాపం చెందిన ఆ ఇల్లాలు ఇంటికి చేరుకుని తన ఇద్దరి చిన్నారులపై కిరోసిన్ పోసి తాను పోసుకుని ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
బెంగళూరు (బనశంకరి) : అన్నదాత ఆత్మహత్యలు కన్నడ నాట సర్వసాధారణమైపోతున్నాయి. కరువు పరిస్థితుల నేపథ్యంలో పంటలు పండక, అప్పులు ఎలా తీర్చాలో తెలియక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా అప్పుల బాధతో ఓ రైతు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చామరాజనగర జిల్లాలోని హొన్నళ్లిలో చోటుచేసుకుంది. వివరాలు... హొన్నళ్లి గ్రామానికి చెందిన సిద్దప్ప కుమారుడు రైతు శివనప్ప (38) శనివారం రాత్రి తన వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం ఉదయం భర్త కోసం పొలం వద్దకు టీ తీసుకు వచ్చిన శివనప్ప భార్య కన్యా (35) భర్త ఉరి వేసుకుని ఉండటం చూసి నిర్ఘంతపోయింది. ఆ షాక్ నుంచి తేరుకున్న ఆమె ఇంటికి చేరుకుని కిరోసిన్ తీసుకుని తన ఇద్దరు పిల్లలు ప్రీతి (6), ప్రియ (4)పై పోసి అనంతరం తనపై కూడా పోసుకుని నిప్పంటించుకుంది.
దీంతో ముగ్గురు అక్కడికక్కడే కాలిపోయారు. మృతుడు శివనప్ప సహకార బ్యాంక్‌లో రుణంతో పాటు ప్రైవేటు వ్యక్తుల నుంచి అప్పులు చేసినట్లు తెలిసింది. అంతేగాక ఇటీవల పొలంలో బోరు వేసిన నీరు లభించకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్నాడు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక, కుటుంబ బాధ్యతలు తలుచుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఈ సంఘటనలో గ్రామంలో విషాదం నెలకొంది. బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. గ్రామీణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.