వాడివేడిగా.. | zp meeting general of the opposition in the ruling | Sakshi
Sakshi News home page

వాడివేడిగా..

Published Sun, Dec 28 2014 2:26 AM | Last Updated on Sat, Sep 2 2017 6:50 PM

వాడివేడిగా..

వాడివేడిగా..

జెడ్పీ సర్వసభ్య సమావేశంలో పాలకవర్గాన్ని నిలదీసిన ప్రతిపక్షం
 
ఉక్కిరిబిక్కిరైన అధికార పక్షం
రుణమాఫీపై నీళ్లు నమిలిన వైనం
పంచాయతీల విద్యుత్ బిల్లులపై రగడ
ఇసుక ధర తగ్గించాలని డిమాండ్
రూ.260 కోట్లతో జెడ్పీ వార్షిక బడ్జెట్ ఆమోదం
అజెండా పూర్తి కాకుండానే ముగింపు

 
కర్నూలు(జిల్లా పరిషత్):  రైతు రుణమాఫీ, జిల్లాలో కరువు పరిస్థితులు, అధిక ధరకు ఇసుక విక్రయం, రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా కేంద్ర నిధులు వాడుకోవాలంటూ చెప్పడం వంటి అంశాలతో శనివారం జరిగిన జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం వాడివేడిగా జరిగింది. కర్నూలు వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ బుట్టా రేణుకతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు సంధించిన ప్రశ్నలకు ఒక దశలో పాలక వర్గం సమాధానం చెప్పలేకపోయింది. కీలకమైన జెడ్పీ వార్షిక బడ్జెట్‌ను కూడా పూర్తిగా చదవకుండా మధ్యలోనే ముగించి ఆమోదం పొందిందనిపించారు. అజెండా పూర్తి చేయకుండానే మొక్కుబడిగా మూడు గంటల్లో సమావేశాన్ని ముగించి మమ అనిపించారు. మళ్లీ వచ్చే ఫిబ్రవరిలో సమావేశం ఏర్పాటు చేసుకుందామంటూ పాలక వర్గం సభకు ముగింపు పలికింది. కర్నూలు జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్‌గౌడ్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. ప్రశ్నోత్తరాల సమయంలో ఇసుక రీచ్‌లలో క్యూబిక్ మీటర్‌కు రూ.500గా విక్రయిస్తున్నారని, ఇది భారంగా ఉందని కర్నూలు ఎంపీపీ రాజావిష్ణువర్దన్‌రెడ్డి సభ దృష్టికి తీసుకువచ్చారు. ఇదే విషయమై ఎమ్మెల్యేలు, పలువురు జెడ్పీటీసీ సభ్యులు కూడా పట్టుబట్టడంతో జాయింట్ కలెక్టర్ కన్నబాబు కల్పించుకుని రాష్ట్రమంతా ఒకే రేటు ఉందని చెప్పబోయారు. చిత్తూరులో తక్కువ ధరకు ఇస్తున్నారు కదా అని సభ్యులు ప్రశ్నించడంతో, ధర తగ్గించాలని తీర్మానం చేస్తే ప్రభుత్వానికి పంపిస్తామని అధికారులు ముగించారు. అనంతరం రూ.260 కోట్లతో ప్రవేశపెట్టిన జెడ్పీ వార్షిక బడ్జెట్‌ను ఏవో భాస్కరనాయుడు సభ ముందుంచారు. జెడ్పీకి వచ్చే ఆదాయ, వ్యయాల గురించి చదివి వినిపించారు.

విద్యుత్ బిల్లులు ప్రభుత్వమే చెల్లించాలి

ఆలూరు జెడ్పీటీసీ సభ్యుడు రాంభీంనాయుడు మాట్లాడుతూ జెడ్పీటీసీ సభ్యులకు నిధులు కేటాయించకపోవడం వల్ల గ్రామాల్లో తలెత్తుకు తిరగలేకపోతున్నామని అన్నారు. ఈ విషయమై ఇతర సభ్యులు కూడా మద్దతు పలకడంతో జెడ్పీ చైర్మన్ స్పందించి ఒక్కో జెడ్పీటీసీ సభ్యుడికి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు కేటాయిస్తామని చెప్పారు. 13వ ఆర్థిక సంఘం నిధుల నుంచి విద్యుత్ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వం సూచించే అంశంపై సభ్యులు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు. జెడ్పీ చైర్మన్ స్పందిస్తూ 13వ ఆర్థిక సంఘం నిధుల కింద జెడ్పీకి రూ.17 కోట్లు వచ్చాయని, అందులో కరెంటు బిల్లులకే రూ.12 కోట్లు పోతాయని, మిగిలిన రూ.5 కోట్లను జెడ్పీటీసీ సభ్యులకు కేటాయిస్తామన్నారు. కరెంటు బిల్లులు పంచాయతీలే చెల్లించాలని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి చెప్పారు. దీనిపై డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్పందిస్తూ గ్రామాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వకుండా కేంద్రం ఇచ్చే నిధులను వాడుకోవాలని చెప్పడం సరికాదన్నారు.

పాఠశాలల్లో మౌళిక సదుపాయాలకు దిక్కులేదు

నందికొట్కూరు నియోజకవర్గంలోని అల్లూరు, శాతానికోట, కోళ్లబాపురం గ్రామాల్లోని పాఠశాలల్లో అవసరం లేకున్నా అదనపు తరగతి గదులు నిర్మించాలని ఎవరు చెప్పారని ఎస్‌ఎస్‌ఏ పీవోను నందికొట్కూరు ఎంపీపీ ప్రసాద్‌రెడ్డి ప్రశ్నించారు. స్థానిక ప్రజాప్రతినిదుల ప్రమేయం లేకుండా పనులు చేపడితే ఊరుకోమన్నారు. బేతంచర్లలో స్థానిక ఎంఈవో పెత్తనం చేస్తున్నారని, అభివృద్ధి పనులకు అడ్డుపడుతున్నారని డోన్ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఆర్‌ఎస్ రంగాపురంలో హెచ్‌ఎంగా పనిచేస్తున్నారని, ఆయన రెండేళ్లుగా పాఠశాలకే వెళ్లకున్నా అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు, కాంపౌండ్ వాల్‌లు లేకున్నా.. అవసరం లేకున్నా అదనపు తరగతి గదులు నిర్మిస్తున్నారని నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య మండిపడ్డారు. కోడుమూరు నియోజకవర్గంలో నిర్మించిన  కేజీబీవీ స్కూల్‌కు వర్షం వస్తే వెళ్లలేని పరిస్థితి నెలకొందని ఎమ్మెల్యే మణిగాంధి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులుండి కూడా పాఠశాలల్లో మరుగుదొడ్లు, కాంపౌండ్ వాల్స్ నిర్మించకపోవడం దారుణమని ఎంపీ బుట్టా రేణుక అన్నారు. రహదారులు బాగా లేకపోవడం వల్ల పిల్లలు పాఠశాలలకు వెళ్లలేకపోతున్నారని చెప్పారు. ఎస్‌ఎస్‌ఏ ఇచ్చిన నిధులు కేవలం అదనపు తరగతి గదులకే కేటాయించాలని, కిటికిలు, వాకిళ్లకు కాదని కలెక్టర్ విజయమోహన్ అన్నారు. నిధులు మళ్లించే అధికారం తనకు లేదని, ఈ విషయమై ప్రభుత్వానికి నివేదిస్తానని చెప్పారు.

నిధుల వినియోగంలో జిల్లా కలెక్టర్లకు విస్తృత అధికారాలు ఇవ్వాలని, అప్పుడే పాఠశాలల్లో మౌళిక సదుపాయాలు సమకూరుతాయని శాసనమండలి చైర్మన్ చక్రపాణి యాదవ్ అభిప్రాయపడ్డారు. మరుగుదొడ్లు నిర్మిస్తారు సరే.. వాటిని ఎవరు శుభ్రం చేస్తారని ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు ప్రశ్నించారు. ఇందుకోసం ప్రతి పాఠశాలకు నిధులు కేటాయించామని కలెక్టర్ సమాధానమిచ్చారు. బాత్‌రూములు లేకపోవడం వల్ల చాలా మంది బాలికలు చదువు మానేస్తున్నారని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అభిప్రాయపడ్డారు. పాడుబడిన స్కూళ్ల స్థానంలో కొత్త భవనాలు నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

ఆసుపత్రుల్లో కనిపించని డాక్టర్లు

మిడుతూరు మండలం తలముడిపి పీహెచ్‌సీ సంవత్సరం క్రితం నిర్మాణం పూర్తయినా ఇప్పటికీ ప్రారంభం కాలేదని నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య చెప్పారు. కడుమూరు పీహెచ్‌సీకి ఫర్నిచర్ ఇవ్వలేదని మిడుతూరు జడ్పీటీసీ సభ్యుడు యుగంధర్‌రెడ్డి అన్నారు. ఎన్‌టీఆర్ ఆరోగ్యసేవ పథకంపై గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించాలని పలువురు సభ్యులు కోరారు. ఆదోని ఆసుపత్రిలో సిటి స్కాన్ పరికరం ఏర్పాటు చేయాలని, 50 నుంచి 100 పడకల ఆసుపత్రిగా మార్చాలని కోరారు. పగిడిరాయి పీహెచ్‌సీల్లో రెగ్యులర్ డాక్టర్‌ను నియమించాలని సభ్యులు కోరారు. ఉలిందకొండ పీహెచ్‌సీలో పడకలు లేకపోవడం వల్ల కాన్పు అయిన వారు నేలపైనే పడుకుంటున్నారని సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నియోజకవర్గానికొక సదరం క్యాంపు ఏర్పాటు చేస్తామని డీఎంహెచ్‌వో డాక్టర్ నిరుపమ చెప్పారు. డాక్టర్ల కొరత ఉన్నందున రెండు పీహెచ్‌సీలకు ఒక డాక్టర్ ఉన్నారని ఆమె చెప్పారు. డాక్టర్లను ఎందుకు నియమించడం లేదని ఎంపీ బుట్టా రేణుక ప్రశ్నించారు. ప్రతి పీహెచ్‌సీకి ఇద్దరు డాక్టర్లను నియమించాలని సూచించారు. పింఛన్లు ఇచ్చేందుకు బయోమెట్రిక్ పెడుతున్నారని, డాక్టర్ల హాజరు కోసం కూడా ఆ పరికరాన్ని  ఉపయోగించాలని చెప్పారు. ఇప్పటికే కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో బయోమెట్రిక్ పరికరం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని, జిల్లా వ్యాప్తంగా త్వరలో అమలు చేస్తామని కలెక్టర్ సమాదానమిచ్చారు.

 ఒక్క రైతుకు రుణమిస్తే ఒట్టు

రూ.50 వేల రుణాన్ని కూడా ఐదు విడతలుగా మాఫీ చేస్తున్నారని డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. 10 శాతం వడ్డీని చెల్లిస్తామని ప్రభుత్వం చెబుతోందని, మిగిలిన 4 శాతం ఎవరు చెల్లిస్తారని ఆయన ప్రశ్నించారు. పాములపాడులో కోత మిషన్ ఏర్పాటు చేయాలని నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య కోరారు. జిల్లాలో కరువు తాండవిస్తుంటే ప్రభుత్వం కేవలం 12 మండలాలను మాత్రమే కరువు ప్రాంతాలుగా ప్రకటించిందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత విమర్శించారు. ఏ ఒక్క రైతుకూ బ్యాంకులు రుణాలు ఇవ్వని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది మన రాష్ట్రమేనని ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు ఎద్దేవా చేశారు. తన నియోజకవర్గంలో కేటగిరి-3 కింద రూ.1.50 కోట్ల దోపిడి జరిగిందని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి అన్నారు. దీనిపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పునరుద్ఘాటించారు. రుణమాఫీపై అనుమానాలుంటే నివృత్తి చేసేందుకు కమిటీలు వేశామని కలెక్టర్ చెప్పారు.

 పంటలెండిపోతున్నాయి.. నీళ్లు వదలండి..

ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ఎప్పుడు పూర్తవుతుందని నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల రాయలసీమ ప్రజలు ఒక్క పంటనూ పండించుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. కులకుర్తికి నీటిని వదలాలని కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధి డిమాండ్ చేశారు. ఫిబ్రవరి నెలాఖరు వరకు కేసీకి నీళ్లిచ్చి మిరప రైతులను ఆదుకోవాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత కోరారు. కేసీకి రెండు రోజుల వరకు 2,530 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని, ఇప్పుడు 1,700 క్యూసెక్కుల నీటిని కొనసాగిస్తున్నామని ఇరిగేషన్ ఎస్‌ఈ చెప్పారు. గురురాఘవేంద్ర ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభిస్తారని ఆ ప్రాంత జెడ్పీటీసీ సభ్యులు కోరగా సంక్రాంతి తర్వాత ప్రారంభిస్తామని కలెక్టర్ సమాదానమిచ్చారు. నీటికోసం ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దీనివల్ల రానున్న 48 గంటల్లో రాయలసీమలో విస్తారంగా వర్షాలు కరుస్తాయని వాతావరణ కేంద్రం చెప్పిందని కలెక్టర్ ముక్తాయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement