కరువును ఎదుర్కోవడంలో సర్కార్ విఫలం
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, మాజీ సీఎం యడ్యూరప్ప
తుమకూరు : రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితులను ఎదుర్కొనడంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, మాజీ సీఎం యడ్యూరప్ప ఆరోపించారు. కరువును అధ్యయనం చేయడంలో భాగంగా ఆదివారం ఆయన తుమకూరు జిల్లాలో పర్యటించారు. రాష్ట్ర సరి హద్దు ప్రాంతమైన గౌడగెరె గ్రామాన్ని సందర్శించిన బీఎస్‌వై అక్కడి రైతులను, గ్రామస్తులను కలిసి వారి సమస్యలను అడిగి తెలసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ప్రజలకు తాగేందుకు నీళ్లు లేని పరిస్థితులు నెలకొన్నాయని, గ్రాసం లేక పశువులు బక్కచిక్కిపోతున్నాయన్నారు.
అయినప్పటికీ సీఎం సిద్దరామయ్య కరువు సమస్యను పట్టించుకోకుండ కేవలం కేంద్రాన్ని తిట్టడంలోనే కాలం గడుపుతున్నారని మండిపడ్డారు. కరువు నివారణ చర్యలకు కేంద్రం రాష్ట్రానికి రూ. 2575 కోట్లు కేటాయించిందన్నారు. అయితే ఆ నిధులు ప్రజలకు చేరవేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కార్యక్రమంలో మాజీ మంత్రి సొగడు శివణ్ణ, ఎమ్మెల్యే సురేష్‌గౌడ పాల్గొన్నారు.