కరువుపై కన్నెర్ర
► వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు
► ఖాళీ బిందెలతో ప్రదర్శనలు, ధర్నాలు
► ప్రభుత్వ వైఫల్యంపై ఆగ్రహం
సాక్షి, విజయవాడ/ విజయవాడ (గాంధీనగర్) : కేవలం రెండేళ్లలో అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైన ప్రభుత్వం చంద్రబాబుదేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో సోమవారం ప్రదర్శన, ధర్నా చేపట్టారు. విజయవాడలోని పార్టీ జిల్లా కార్యాలయం నుంచి న్యూఇండియా హోటల్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. న్యూఇండియా హోటల్ సెంటర్‌లో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఖాళీ బిందెలతో మహిళలు పెద్ద సంఖ్యలో ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సారథి మాట్లాడుతూ పోలవరం, ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. కరువు నివారణ చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి కొరవడిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఫిరాయింపు చేయడంలో ఉన్న శ్రద్ధ కరువు సమస్యల నుంచి ప్రజలను బయటవేయడంలో లేదన్నారు. కరువు వల్ల డెల్టాలో దాదాపు 40 శాతం సాగు జరగలేదన్నారు. కరువు, వరదలకు సంబంధించి ప్రభుత్వం నిర్ధారించిన ఇన్‌పుట్ సబ్సిడీ మొత్తాలు కూడా రైతులకు చేరవేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కేంద్రం నుంచి హక్కులు సాధించుకోవడంలోనూ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని సారథి విమర్శించారు.
సిగ్గులేని ప్రభుత్వం...
పోలవరం విషయంలో సాక్షాత్తూ ప్రజా ప్రభుత్వం ఇచ్చిన లెక్కల్ని.. ‘మేం నమ్మం. దీనిలో అవినీతి జరిగింది. మీరిచ్చిన లెక్కల్ని మేం స్క్రూట్నీ చేయాలి’ అని కేంద్ర ప్రభుత్వం పక్కన పడేసిందంటే.. అంతకంటే సిగ్గుచేటైన విషయం ప్రజాస్వామ్య దేశంలో ఇంకొకటి ఉండదని సారథి ఎద్దేవా చేశారు.
ప్రాజెక్టులను అడ్డుకోవడం లేదు...
కృష్ణానదిపై పక్క రాష్ట్రమైన తెలంగాణ అనుమతులు లేకుండా అనేక ప్రాజెక్టులు కడుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు కనీసం మాట కూడా మాట్లాడటం లేదన్నారు. దీనివల్ల కృష్ణా డెల్టా ఎడారిగా మారే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరచి తన విలాసాలు, ఆర్భాటాలు, బూటకపు ప్రచారాలు మాని, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని కోరారు. డెప్యూటీ తహసీల్దార్‌కు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో వైఎస్సార్ ట్రేడ్‌యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కాజా రాజ్‌కుమార్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు కాలే పుల్లారావు, తంగిరాల రామిరెడ్డి, జానారెడ్డి, అవుతు శ్రీనివాసరెడ్డి, ట్రేడ్ యూనియన్ జిల్లా, నగర అధ్యక్షులు మాదు శివరామకృష్ణ, విశ్వనాథ రవి, వాణిజ్య విభాగం పట్టణ అధ్యక్షుడు రమేష్, కార్పొరేటర్లు ఆసీఫ్, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా అంతటా వెల్లువెత్తిన నిరసనలు
►పామర్రులో ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన నేతృత్వంలో ఖాళీ బిందెలతో నిరసన ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపి తహసీల్దారుకు వినతిపత్రం అందజేశారు. తోట్లవల్లూరు, పెదపారుపూడి, పమిడిముక్కల, మొవ్వ మండలాల్లోనూ నిరసనలు జరిగాయి.
►నూజివీడులో ఎమ్మెల్యే మేకా ప్రతాప్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టాయి. కార్యక్రమంలో నూజివీడు మున్సిపల్ చైర్‌పర్సన్ బసవా రేవతి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
►గుడివాడ పట్టణంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే కొడాలి నాని పాల్గొన్నారు. నియోజకవర్గంలోని నందివాడ, గుడ్లవల్లేరు మండలాల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయి.
► తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి నేతృత్వంలో విస్సన్నపేట మండలంలో నిరసన ర్యాలీ, ధర్నా నిర్వహించారు. నియోజకవర్గంలోని గంపలగూడెం, తిరువూరు, ఎ.కొండూరు మండలాల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయి.
► జగ్గయ్యపేటలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు, సమన్వయకర్త సామినేని ఉదయభాను నేతృత్వంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాల్లో పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు కొనసాగించారు.
► ఇబ్రహీంపట్నంలో పార్టీ సమన్వయకర్త జోగి రమేష్ నేతృత్వంలో భారీ నిరసన కార్యక్రమం జరిగింది. జి.కొండూరు, రెడ్డిగూడెం, మైలవరంలో ధర్నాలు నిర్వహించారు.
► అవనిగడ్డ నియోజకవర్గంలోని అవనిగడ్డ, కోడూరు, మోపిదేవి మండలాల్లో జరిగిన నిరసన ర్యాలీలు, ధర్నాల్లో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు, పార్టీ నేత కడవకొల్లు నరసింహారావు తదితరలు పాల్గొన్నారు. కైకలూరు నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు నేతృత్వంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేసి మట్టి కుండలను ధ్వంసం చేశారు. మంత్రి కామినేని నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు.
► పెడన నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్ నేతృత్వంలో నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. పెడన, బంటుమిల్లి, గూడూరు మండలాల్లో ఆందోళనలు జరిగాయి.
► గన్నవరం నియోజకవర్గంలో సమన్వయకర్త డాక్టర్ దుట్టా రామచంద్రరావు నేతృత్వంలో గన్నవరం, బాపులపాడు, విజయవాడ రూరల్ మండలాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు జ్ఞానమణి పాల్గొన్నారు.
► మచిలీపట్నంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు సలార్ దాదా నేతృత్వంలో ఎంపీడీవో కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.
► కంచికచర్లలో జరిగిన నిరసన కార్యక్రమంలో పార్టీ సమన్వయకర్త మొండితోక జగన్‌మోహన్‌రావు, నందిగామ పట్టణంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి మొండితోక ఆరుణ్‌కుమార్ పాల్గొన్నారు.
► పెనమలూరులో పార్టీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి నేతృత్వంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. జెడ్పీ ఫ్లోర్ లీడర్ తాతినేని పద్మావతి, పార్టీ నాయకులు వంగవీటి శ్రీనివాస ప్రసాద్ పాల్గొన్నారు.
పేదల కష్టాలు పట్టని ప్రభుత్వం : జోగి రమేష్
ఇబ్రహీంపట్నం : రాష్ట్రంలో కరువుకాటకాలు రాజ్యమేలుతుంటే ప్రభుత్వ పాలకులు ధనార్జనే ధ్యేయంగా పరిపాలన సాగిస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ విమర్శించారు. పేదల ఓట్లతో పదవులు అనుభవిస్తున్న నేతలకు వారి కష్టాలు మాత్రం పట్టడం లేదని మండిపడ్డారు. ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన నిరసన ర్యాలీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజాసమస్యలను గాలికొదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.