బెట్టను తరిమేద్దామిలా.. | Drought conditions to crops | Sakshi
Sakshi News home page

బెట్టను తరిమేద్దామిలా..

Published Fri, Aug 22 2014 2:36 AM | Last Updated on Sat, Sep 2 2017 12:14 PM

ఈ ఏడాది ఖరీఫ్‌లో వర్షాధారం కింద నాలుగు లక్షలకు పైగా హెక్టార్లలో పంటలు వేశారు.

ఈ ఏడాది ఖరీఫ్‌లో వర్షాధారం కింద నాలుగు లక్షలకు పైగా హెక్టార్లలో పంటలు వేశారు. ఇందులో ప్రధానమైనవి పత్తి, వేరుశనగ, కంది, ఆముదం, ఉల్లి, మొక్కజొన్న. జూన్, జూలై నెలల్లో అప్పుడప్పుడు వర్షాలు కురిసినా ఆగస్టు నెలలో మొండికేశాయి. గత 20 రోజులగా చినుకుజాడ కరువైంది. దీంతో పైర్లన్నీ ఎండిపోతున్నాయి.  అయితే కొద్దిపాటి శ్రమ తీసుకుంటే బెట్ట నుంచి వీటిని వారం నుంచి పది రోజుల వరకు కాపాడుకోవచ్చని డాట్ సెంటర్ ముఖ్యశాస్త్రవేత్త డాక్టర్ సరళమ్మ తెలిపారు. ఆలోపు వర్షాలు పడితే తిరిగి కోలుకుంటాయని చెప్పారు. తక్కువ ఖర్చుతో బెట్ట నుంచి పైర్లకు ఉప శమనం కలిగించవచ్చని వివరించారు.

 నెర్రెలను పూడ్చాలి..
 వర్షాభావ పరిస్థితులు కొనసాగుతుండటంతో సాగు భూముల్లో నెర్రెలు(పగుళ్లు) వస్తున్నాయి. ఇవి వస్తే భూమిలోని తేమ ఆవిరి రూపంలో బయటికి వెళుతుంది. ఉన్న తేమ కూడా బయటికి పోతే పంటలకు మరింత ప్రమాదకరం. నెర్రెలు వచ్చినప్పుడు రైతులు అంతర కృషి చేయాలి. దీంతో తేమ బయటికి వెళ్లకుండా జాగ్రత్త పడవచ్చు. అంతర కృషి అంటే సాళ్ల మధ్య గొర్రుతో దున్నాలి. లేదా నాగలితో దున్నవచ్చు. ఇలా చేయడం వల్ల నైలను పూడ్చినట్లు అవుతుంది. ఆవిరి రూపంలో తేమ బయటికి వెళ్లదు. దీంతో పంటలను కొద్ది రోజుల పాటు బెట్ట నుంచి కాపాడుకోవచ్చు.

 పై పాటుగా రసాయన ఎరువులు పిచికారీ చేయాలి..
 ఖరీఫ్‌లో వర్షాధారం కింద వేసిన పంటలన్నీ ప్రస్తుతం 30 నుంచి 60 రోజుల దశలో ఉన్నాయి. ఇప్పటికే మొక్కజొన్న పూర్తిగా ఎండిపోయింది. కోలుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ రైతులు ప్రయత్నించాలి. రసాయన ఎరువులైన 19:19:19 లేదా 17:17:17 లేదా డీఏపీ పది గ్రాములు లీటరు నీటికి కలిపి ఎకరాకు 200 లీటర్ల ద్రావణాన్ని పిచికారీ చేయాలి. వర్షాలు పడేంత వరకు వారం నుంచి పది రోజులకు ఒకసారి పిచికారీ చేసుకోవాలి. బెట్ట నుంచి పంటలకు ఉపశమనం కల్పించుకోవడానికి ఇది ఉత్తమమైన మార్గం. పిచికారీ కూడా ఉదయం, సాయంత్రం వేళల్లో చేసుకోవడం మంచిది.

 చీడ, పీడలను ఇలా నివారించుకోవాలి...
 బెట్ట పరిస్థితుల కారణంగా పంటలకు చీడపీడల బెడద కూడా ఎక్కువగా ఉంది. వీటిని కూడా నివారించుకోవాలి.
డోన్, పత్తికొండ, దేవనకొండ తదితర ప్రాంతాల్లో వేరుశనగ పంటల్లో బెట్ట కారణంగా ఆకుముడుత తెగులు ఎక్కువగా కనిపిస్తోంది. దీనిని నివారణకు క్లోరో ఫైరిపాస్ 2 ఎంఎల్, నువాన్ ఒక ఎంఎల్, లేదా ఎసిపేట్ 1.5 గ్రాములు, నువాన్ 1 ఎంఎల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.

ప్రత్తి, ఆముదం పంటల్లో ఆకు తొలిచే పురుగు కనిపిస్తోంది. దీని నివారణకు క్వినాల్ పాస్ లేదా మోనోక్రోటోఫాస్ 2 ఎంఎల్ లేదా ఎసిపేట్ 1.5 గ్రాములు, వేపనూనె 5 ఎంఎల్ లీటరు నీటికి కలిపి ఎకరాకు 200 ద్రావణాన్ని పిచికారీ చేయాలి

బెట్టకారణంగా టమాటలో పూత, పిందె రాలుతోంది. దీని నివారణకు ఫ్లోనోఫిక్స్ 1ఎంఎల్ 4ః5 లీటర్ల నీటికి కలిపి ఐదు రోజులకోసారి పిచికారీ చేయాలి

పత్తిలో పిండినల్లి అనే తెగులు కనిపిస్తోంది. వర్షాభావ పరిస్థితుల్లో ఇది వస్తోంది. దీని నివారణకు 2 ఎంఎల్ ప్రొఫినోపాస్, 5 ఎంఎల్ వేపనూనె లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement