మొక్కుబడి భోజనం!
► విద్యార్థుల కోసంఏజెన్సీల నిరీక్షణ
► తొలిరోజు 1,01,082 మంది మాత్రమే..
► చాలాచోట్ల కనిపించని పర్యవేక్షకులు
► ఉపాధ్యాయులు చొరవచూపితేనే సత్ఫలితం
మహబూబ్‌నగర్ విద్యావిభాగం: కరువు పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో వేసవి సెలవుల్లో గురువారం ప్రారంభమైన మధ్యాహ్న భోజనానికి విద్యార్థుల నుంచి స్పందన అంతంత మాత్రంగానే కనిపించింది. జిల్లాలో 4.37లక్షమంది విద్యార్థులకు గానూ వేసవి సెలవుల్లో కనీసం 2.31లక్షల మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేసేందుకు హాజరవుతారని ఎంఈఓల రిపోర్టు ప్రకారం జిల్లా ఉన్నతాధికారులు అంచనావేశారు. కానీ తొలిరోజు 1.01లక్షల మంది విద్యార్థులు మాత్రమే వచ్చారు. జిల్లా కేంద్రంలోని పలుపాఠశాలలను పరిశీలించగా చాలా వాటిలో విద్యార్థులు కనిపించలేదు. వంట ఏజెన్సీల మహిళలు వారికోసం వేచిచూడడం కనిపించింది. పర్యవేక్షించాల్సిన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు కూడా పాఠశాలలకు రాలేదు.
బేసిక్ ప్రాక్టిసింగ్ ఉన్నత పాఠశాలలో వంట ఏజెన్సీ వారు వచ్చినప్పటికీ విద్యార్థులు ఒక్కరు కూడా రాకపోవడంతో వారు ఎదురుచూసి వెళ్లిపోయారు. ఉపాధ్యాయులు కూడా అక్కడికి రాలేదు. స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో ఆరుగురు విద్యార్థినులు రావడంతో వారికి భోజనాలు పెట్టించి పంపించారు. పోలీస్‌లైన్ ప్రాథమిక, ఉన్నతపాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నిర్వహణ కనిపించలేదు. ఇలా జిల్లావ్యాప్తంగా ఉన్నత సంకల్పంతో ప్రారంభించిన మధ్యాహ్న భోజనంపై కొంత నిరాసక్తి చూపినట్లు కనిపించింది. గ్రామాల్లో చిన్నారులను ఉపాధ్యాయులు, గ్రామస్తులు, యువకులు పంపించాల్సిన అవసరం ఉంది. అలాగే పర్యవేక్షణ బాధ్యతలు తీసుకున్న ఉపాధ్యాయులు సైతం బాధ్యతాయుతంగా పనిచేస్తేనే భోజనానికి సార్థకత చేకూరుతుందని పలువురు కోరుతున్నారు.
పారదర్శకంగా మధ్యాహ్న భోజనం
మహబూబ్‌నగర్ న్యూటౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం అమలుచేస్తున్న వేసవిలో మధ్యాహ్న భోజనం పథకాన్ని జిల్లాలో మరింత పారదర్శకంగా అమలుచేయాలని కలెక్టర్ టీకే శ్రీదేవి విద్యాశాఖ అధికారులను గురువారం ఒక ప్రకటనలో ఆదేశించారు. కరువు పరిస్థితుల నేపథ్యంలో ఈ వేసవిలో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఈనెల 21 నుంచి మధ్యాహ్న భోజన పథకాన్ని అమలుచేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినట్లు పేర్కొన్నారు. పథకం అమలుతీరును హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు పర్యవేక్షించాలని సూచించారు. పాఠశాలలను ఉదయం 8.30 నుంచి 10.30 వరకు నిర్వహించాలని, భోజనం చేసిన తరువాతే వారికి ఇంటికి పంపించాలని కోరారు.
మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు పాఠశాల విద్యాకమిటీలు, సర్పంచ్‌లు, వార్డుసభ్యులు, ఇతర శాఖల సిబ్బంది భాగస్వాములు కావాలని సూచించారు. వేసవి సెలవుల్లో వంట ఏజెన్సీలను నియమించాలని, విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టేందుకు డీఈఓకు పంపినట్లు ఆమె తెలిపారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల వరకు పాఠశాలలకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్యను ఎస్‌ఎంఎస్ ద్వారా డీఈఓకు పంపాలని సూచించారు. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన స్టాక్ రిజిస్టర్, ఇష్యూ రిజిస్టర్, విద్యార్థుల హాజరురిజిస్టర్లను నిర్వహించడమే కాకుండా కమిటీ సభ్యులు, ఇతర పెద్దలు పాఠశాలలు సందర్శించిన సమయాల్లో సంతకాలను తీసుకోవాలని ఆదేశించారు.