ఆస్పత్రికి తరలింపు
స్థిరంగా విద్యార్థుల ఆరోగ్యం
ఏలూరు జిల్లా చాట్రాయిలో ఘటన
చాట్రాయి: మధ్యాహ్న భోజనం తిని తొమ్మిదిమంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఏలూరు జిల్లా, చాట్రాయి మండలంలోని కోటపాడు యూపీ స్కూల్లో బుధవారం మధ్యాహ్నం 39 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేశారు. మెనూ ప్రకారం దుంప కుర్మా వారికి వడ్డించారు.
భోజనం తిన్న అర గంట తర్వాత ఎన్.కల్పన, టి.క్రాంతి మేఘన, ఉమా యశ్వంత్, ఎం.దుర్గామనీష్, ఎన్.అమృత, ఎన్.లాస్య, టి.సిరి స్పందన, ఎన్.ఉదయకుమార్, టి.వర్షిణి కడుపు నొప్పితో బాధపడ్డారు. విషయం తెలిసిన చాట్రాయి పీహెచ్‌సీ వైద్యాధికారి విజయలక్ష్మి పాఠశాలకు వెళ్లి వారికి వైద్యం అందించారు.
మళ్లీ గురువారం చనుబండ పీహెచ్‌సీ వైద్యాధికారి దుర్గాప్రసాద్ వెళ్లి విద్యార్థులకు వైద్యం చేసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. గురువారం మధ్యాహ్నం భోజనం చేయగానే వీరిలో ఒకరికి కడుపు నొప్పి, మరొకరికి వాంతులు అవడంతో ఎంఈవో బ్రహ్మచారి 9 మంది విద్యార్థులను మెరుగైన వైద్యం కోసం నూజివీడు ఏరియా ఆస్పత్రికి తరలించారు.
బుధవారం మెనూలో దుంప కుర్మా కూరలో రాగి పిండి కలిపి భోజనం పెట్టారని, విద్యార్థుల్లో అరుగుదల లేకపోవడం వలన గ్యాస్ కారణంగా కడుపు నొప్పి వచ్చిందని చాట్రాయి పీహెచ్‌సీ డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment