నీటి సమస్య రానివ్వొద్దు
► ఎన్ని నిధులైనా ఖర్చుచేసేందుకు ప్రభుత్వం సిద్ధం
► పెండింగ్ తాగునీటి పథకాల ప్రతిపాదనలు రెండు రోజుల్లో సమర్పించాలి
► అధికారులతో సమీక్షించిన మంత్రి జూపల్లి కృష్ణారావు
మహబూబ్‌నగర్ న్యూటౌన్: తీవ్ర కరువు పరిస్థితుల దృష్ట్యా తాగునీటి సమస్య నివారణకు ప్రభుత్వం జిల్లాకు ఎన్ని నిధులైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని, తాగునీటి పథకాలకు సంబంధించిన పెండింగ్ ప్రతిపాదనలు రెండురోజుల్లో సమర్పించాలని రాష్ట్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన రెవెన్యూ సమావేశ మందిరంలో తాగునీరు, ఉపాధిహామీ, పశుగ్రాసం, హరితహారం తదితర అంశాలపై జిల్లా అధికారులతో సమీక్షించారు. తాగునీటి కొరత లేకుండా నివారించేందుకు ప్రభుత్వం సీఆర్‌ఎఫ్ గ్రాంటు కింద రూ.6.6 కోట్ల పరిపాలన అనుమతులు మంజూరుచేసిందన్నారు.
నాన్ సీఆర్‌ఎఫ్ కింద రూ.47.8కోట్లు మంజూరుచేయగా ఇప్పటివరకు రూ.15.9 కోట్లు మాత్రమే ఖర్చుచేయడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తంచేశారు. రెండురోజుల్లో ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల బృందం గ్రామాల్లో పర్యటించి ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. గ్రామాల్లో అవసరాన్ని బట్టి ట్యాంకర్ల ధరలు రీషెడ్యూల్ చేయాలని, రవాణా ద్వారా ఎక్కువ నీటిని సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, సరఫరా చేసిన ట్రిప్పుల వివరాలు సంబంధిత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులకు మెసేజ్ పంపించాలన్నారు. అన్ని మున్సిపాలిటీలు రామన్‌పాడు తాగునీటిపై ఆధారపడి ఉన్నాయని, త్వరితగతిన నీటిని తరలించే చర్యలు వేగవంతం చేయాలని జేసీని కోరారు. ఉపాధి పనిదినాలను పూర్తిచేయాలని డ్వామా పీడీని ఆదేశించారు.
జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ మాట్లాడుతూ జములమ్మ రిజర్వాయర్ ద్వారా గద్వాలకు తాగునీటిని నిరంతరం సరఫరా చేయాలని కోరారు. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ తాగునీటి సమస్య ఎక్కువగా ఉన్న గ్రామాల్లో ట్యాంకర్ల సంఖ్యను పెంచాలని, ట్యాంకర్లకు ఇచ్చే ధరలను పెంచాలన్నారు. నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ తాగునీటికోసం మంజూరైన నిధులను ఈ వేసవిలో ఖర్చుచేస్తే ఉపయోగకరంగా ఉంటుందన్నారు. షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మాట్లాడుతూ తన నియోజకవర్గంలో తాగునీటి వనరులు లేనందున ఎక్కువ గ్రామాల్లో సరఫరా చేయాలని కోరారు. సమావేశంలో జేసీ రాంకిషన్, గువ్వల బాల్‌రాజ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, జెడ్పీ సీఈఓ లక్ష్మినారాయణ, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ పద్మనాభం, డ్వామా పీడీ దామోదర్‌రెడ్డి, పశుసంవర్ధక శాఖ జేడీ సుధాకర్ పాల్గొన్నారు.