రాష్ట్రాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ మొత్తాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ నాగేశ్వర్ అన్నారు. సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పీపుల్స్ ఫోరం ఫర్ ఇన్‌ఫర్మేషన్(పిఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో ‘కరువు-నీరుపై’ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేశ్వర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 459 మండలాలకుగాను 232 మండలాలను మాత్రమే కరువు ప్రాంతాలుగా ప్రకటించడం దారుణమన్నారు.
వాస్తవానికి జిల్లా కలెక్టర్లు ఇచ్చిన నివేదిక ప్రకారం 368 మండలాలు కరువుకాటుతో అల్లాడుతున్నాయన్నారు. ప్రభుత్వం అన్ని చేస్తున్నుట్లుగా ప్రకటిస్తుందే తప్ప ఏమీ చేయటం లేదని, కరువు భారిన పడిన ప్రజలను ఆదుకునేందుకు కనీస చర్యలు చేపట్టడం లేదన్నారు. రైతు సంఘం నాయకులు సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ 1972 తర్వాత ఇంతటి కరువు చూడలేదని, ఆదాయ మార్గాలు లేక గ్రామీణ ప్రాంతాల ప్రజలు పట్టణాలకు వలస వెళ్లుతున్నార న్నారు. కరువు నివారణ చర్యలు తీసుకోకుండా ప్రజలు జీవించే హక్కును దెబ్బతీస్తున్నారని ఆరోపించారు.
నీటి సమస్యను పరిష్కరించటంలో ప్రభుత్వం విఫలమైందని, ప్రతి గ్రామానికి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని, అక్రమ నీటి వ్యాపారాన్ని అరికట్టాలని, పశుగ్రాసాన్ని పంపిణీ చేయాలని, ఉపాధి హామీ పనులను ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహించాలన్నారు. వలసలను నిరోధించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, వడదెబ్బతో మరణించిన కుటుంబానికి రూ. 5 లక్షలు ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలని, మండల, గ్రామ స్థాయిల్లో కరువు సహాయక కమిటీలు వేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీఎఫ్‌ఐ అధ్యక్షులు వి.యాదయ్య, ఉపాధ్యక్షులు జె.వెంకటేష్, ప్రధాన కార్యదర్శి పార్ధపారథి, మాజీ ఎమ్మెల్యే నంధ్యాల నర్సింహారెడ్డి, డిజి.నర్సింహారావు, ప్రొఫెసర్ అరిబండి ప్రసాదరావు ,ఎం.శ్రీనివాస్, జి.నరేష్ తదితరులు పాల్గొన్నారు.