కరువు కాటు!
- రబీలో భారీగా తగ్గిన పంటల సాగు
- వేసిన పంటలూ చేతికొచ్చేది అనుమానమే
- జిల్లాలో పడిపోయిన భూగర్భజలాలు
- బోర్లలో అడుగంటిన జలాలు
- ఎండిపోతున్న పంటలు
- కష్టాల ఊబిలోకి అన్నదాతలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: కరువు పరిస్థితులు రైతాంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గత సీజన్‌లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో జిల్లాలోని చెరువులు, కుంటలు ఎండుముఖం పట్టగా.. భూగర్భజలాలు భారీగా పతనమయ్యాయి. దీంతో తాజాగా సాగుచేస్తున్న పంటలు కరువుదాటికి గట్టెక్కుతాయా.. లేదా అని రైతులు సందిగ్ధంలో పడ్డారు. ప్రస్తుత రబీ సీజన్‌లో జిల్లా సాధారణ సాగు విస్తీర్ణం 43,100 హెక్టార్లుగా వ్యవసాయ శాఖ నిర్ధారించింది. వాస్తవానికి ఈ పాటికే సాధారణ విస్తీర్ణంకంటే ఎక్కువ స్థాయిలో పంటలు సాగవ్వాల్సి ఉంది. కానీ వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కేవలం 32,725 హెక్టార్లలో మాత్రమే వివిధ పంటలు సాగయ్యాయి.
సాధారణం కంటే తక్కువగా..
రబీ సీజన్‌లో జిల్లాలో ప్రధానంగా వరి పంటను ఎక్కువగా సాగు చేస్తారు. కానీ కరెంటు సమస్యతోపాటు భూగర్భజలాలు సైతం పతనమవుతున్న నేపథ్యంలో ఈ ఏడాది వరిని తగ్గించి ప్రత్యామ్నాయ పంటలు వేయాల్సిందిగా వ్యవసాయ శాఖ రైతులకు సూచించింది. ఈ క్రమంలో ప్రస్తుతసీజన్‌లో 16,269 హెక్టార్లలో వరి సాగవుతుందని అధికారులు ప్రణాళిక తయారు చేశారు. క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులతో జిల్లాలో వరిసాగు ముందుకు కదలలేదు. దీంతో కేవలం సాగు 12,312 హెక్టార్లకే పరిమితమైంది. నిర్దేశించిన విస్తీర్ణంలో 25 శాతం తగ్గడం గమనార్హం. అదేవిధంగా జొన్న, మొక్కజొన్న, వేరుశనగ పంటలు సైతం సాధారణ విస్తీర్ణం కంటే తక్కువగా సాగయ్యాయి.
గట్టెక్కేదెలా..!
జిల్లాలో సాగుకు కీలకమైన భూగర్భజలాలు ఈ ఏడు భారీగా పతనమయ్యాయి. గతేడాది జనవరిలో జిల్లాలో భూగర్భజల సగటు నీటిమట్టం 9.41 మీటర్లుగా ఉంది. ఈ ఏడాది జనవరికి నీటి మట్టంలో భారీ తగ్గుదల నమోదైంది. ప్రస్తుతం జిల్లాలో 13.30 మీటర్లకు పడిపోయినట్లు భూగర్భ జలవనరుల శాఖ నివే దికలు చెబుతున్నాయి. నీటి మట్టంతగ్గడంతో ఈ ప్రభావం పంటల సాగుపై చూపనుంది. ప్రస్తుతం జిల్లాలో 12,312 హెక్టార్లలో వరి సాగవుతుండగా.. ఈ పంట పూర్తిగా భూగర్భజలాలతోనే సాగవుతోంది.
తాజాగా నీటి మట్టం పతనమవడంతోపాటు కరెంటు కోతలు సైతం మొదలవ్వడంతో వరిసాగు రైతులకు కష్టంగా మారింది. రెండువిడతలుగా ఆరుగంటలపాటు కరెంటు సరఫరా చేస్తున్నామని ట్రాన్స్‌కో చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో నాలుగు గంటలకు మించి కరెంటు అందడం లేదు. సరఫరాలో సమస్యతో పలుమార్లు ఆటంకాలు తలెత్తుతున్నాయని యాచారం మండలం మెండిగౌరెల్లి గ్రామ రైతు నారయ్య ఆవేదన వ్యక్తం చేశారు.