
ఉరుముతున్న కరువు!
మెతుకుసీమ రైతన్న విలవిల
►ఐదేళ్ల తర్వాత జిల్లాలో అత్యల్ప వర్షపాతం
►29 మండలాల్లో 60 శాతం వర్షాభావం
►ఎండుతున్న పంటలతో ఆందోళన
►లక్ష హెక్టార్లకు పైగా తగ్గిన సాగు
సాక్షి, సంగారెడ్డి: జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు రైతులను ఊపిరాడనివ్వటంలేదు. వర్షాభావం వల్ల ఖరీఫ్‌పై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఐదేళ్ల తర్వాత జిల్లాలో వర్షాభావం 60 శాతానికి చేరుకుంది. ప్రస్తుత సీజన్‌లో లక్ష హెక్టార్లకుపైగా సాగు విస్తీర్ణం తగ్గింది. ఉన్న పంటలు కూడా ఎండుముఖం పట్టడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఈ నెలాఖరులోగా వర్షాలు కురవని పక్షంలో దిగుబడిపైనా ప్రభావం పడనుంది.
ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే జిల్లాలో కరువు తప్పదని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక ఆశించినస్థాయిలో ఫలితాలు ఇవ్వటంలేదు. వర్షాభావం.. ఉద్యాన పంటల సాగుపైనా ప్రభావం చూపుతోంది. సకాలంలో వర్షాలు కురవకపోవటంతో జిల్లాలో పదివేల హెక్టార్లలో రైతులు ఉద్యాన పంటలను వేయలేకపోయారు. దీంతో కూరగాయల ధరలు పెరిగే అవకాశాలున్నాయి.
199 మిల్లీమీటర్ల వర్షపాతం
ఖరీఫ్ సీజన్ ప్రారంభం నాటినుంచి ఇప్పటివరకు జిల్లాలో 489 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం 199 మి.మీ. వర్షపాతం మాత్రమే నమోదైంది. జిల్లాలో 60 శాతం వర్షాభావం నెలకొంది. 2009-10లో జిల్లాలో 60 శాతానికిపైగా వర్షాభావం నమోదైంది. ఆ తర్వాత ఇప్పుడు.. వర్షాభావం తీవ్రస్థాయికి చేరుకుంది. 29 మండలాల్లో 60 శాతం, మరో 13 మండలాలు 50 శాతానికి పైగా వర్షాభావం ఉంది. దీంతో ఆయా మండలాల్లో సాగు విస్తీర్ణం తగ్గి.. కరువు ఛాయలు కమ్ముకుంటున్నాయి.
భారీగా తగ్గిన సాగు..
వర్షాభావం కారణంగా ఖరీఫ్‌లో పంటల సాగు భారీగా తగ్గింది. ఖరీఫ్‌లో 4.40 లక్షల హెక్టార్లలో పంటలు సాగు కావాల్సి ఉండగా ఇప్పటివరకు 3 లక్షల హెక్టార్లలో పంటలు సాగు అయ్యాయి. లక్ష హెక్టార్ల మేర పంట విస్తీర్ణం తగ్గింది. 81 వేల హెక్టార్లలో వరి సాగు కావాల్సి ఉండగా ఇప్పటివరకు 36 వేల హెక్టార్లలో సాగయ్యింది. వర్షాభావానికి తోడు కరెంటు కోతలు తోడయ్యాయి. కోతల వల్ల ఉన్న పంటలు కూడా ఎండుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఖరీఫ్‌లో మొక్కజొన్న 1.10 లక్షల హెక్టార్లకుగాను 81 వేల హెక్టార్లు, పెసర 38 వేల హెక్టార్లకుగాను 23 వేల హెక్టార్లు, 18 వేల హెక్టార్లలో మినుముకు సాగు చేయాల్సి ఉండగా 11 వేల హెక్టార్లలోనే సాగు చేశారు. పత్తి 97 వేల హెక్టార్ల సాధారణ విస్తీర్ణంగా ఉండగా 91 వేల హెక్టార్లలో పత్తి వేశారు. గత ఏడాది ఖరీఫ్‌తో పోలిస్తే ఆరుతడిపంటల సాగు లక్ష హెక్టార్ల మేర తగ్గింది. వర్షాభావం కారణంగా ప్రస్తుతం మొక్కజొన్న, జొన్న, పత్తిపంటలు ఎండిపోతున్నాయి. పంటలు ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెలాఖరు వరకు వర్షాలు కురవని పక్షంలో దిగబడి తగ్గే అవకావం ఉందని అధికారులు చెబుతున్నారు.