యాచారం: ఆలస్యంగా కురిసిన వర్షాల కారణంగా రైతులు పంట మార్పిడిపై దృష్టి సారించారు. అదునలో వర్షాలు కురిస్తే పత్తి పంట సాగు చేద్దామనుకున్న రైతులు.. దిగుబడి తగ్గుతుందేమోనని ఇతర పంటల సాగుపై అసక్తి చూపుతున్నారు. మండలంలో ఈ ఏడాది 1,500 హెక్టార్ల విస్తీర్ణంలో పత్తి పంట సాగు చేయడానికి రైతులు పొలాలను సిద్ధం చేసుకున్నారు. కానీ అదనులో వర్షాలు కురవకపోవడంతో పంట మార్పిడి వైపు మళ్లారు. ఈసారి పత్తి 400 హెక్టార్ల వరకు కూడ సాగు చేయలేదు.
రెండు రోజుల క్రితం ఓ మోస్తరు వర్షాలతో మండలంలోని పలు గ్రామాల్లో రైతులు విత్తనాలు విత్తే పనిలో నిమగ్నమయ్యారు. ఈ రెండు రోజుల్లోనే 700 ఎకరాల విస్తీర్ణంలో మొక్కజొన్న విత్తుకోవడం గమనార్హం. వర్షాలు సకాలంలో కురిసే అవకాశం లేని విషయం పసిగట్టిన వ్యవసాయాధికారులు అవసరమైన మొక్కజొన్న విత్తనాలు నిల్వలు సిద్ధంగా ఉంచారు. మండలంలో ఇప్పటివరకు 13.3 టన్నుల మొక్కజొన్న విత్తనాలు విక్రయించారు. అదనులో కురవని వర్షాల కారణంగా రైతులు మొక్కజొన్న సాగుపై దృష్టి సారిస్తున్న దృష్ట్యా మళ్లీ మూడు టన్నుల విత్తనాలు సిద్ధంగా ఉంచారు.
100 రోజుల్లోనే పంట చేతికి..
ప్రస్తుతం మొక్కజొన్న సాగు చేస్తే వంద రోజుల్లో పంట చేతికొచ్చే అవకాశం ఉంది. దీంతో అప్పుడప్పుడు కురిసే వర్షాలతోనైనా మొక్కజొన్న పంట పండే అవకాశముంది. కానీ పత్తి పంట ఆలస్యంగా విత్తితే పెట్టుబడులు పెరిగిపోవడమే కాకుండా.. పంటపై చీడపీడలు సోకడంతో పాటు దిగుబడి కూడా గణనీయంగా తగ్గుతుందని రైతుల్లో భయం నెలకొంది.
ఈ నేపథ్యంలో వారు మొదట మొక్కజొన్న, రెండో దశలో ఆముదం, కందులు తదితర పంటలపై దృష్టి పెట్టారు. మండలంలో ఇప్పటికే 900 ఎకరాల వరకు మొక్కజొన్న సాగు అయింది. పంటమార్పిడితో రైతులు సాగు విస్తీర్ణం పెంచితే మొక్కజొన్న రెండు వేల ఎకరాలకు పైగా దాటే అవకాశం ఉందని వ్యవసాయాధికారులు అంటున్నారు. ఆయా గ్రామాల్లో 400 హెక్టార్లలో ఆముదం, కంది పంటలు సాగు చేశారు. 200 ఎకరాలకు పైగా వరి పంట సాగులో ఉంది. బీపీటీ తూకాలు పోసిన రైతులు సంమృద్ధిగా వర్షాలు కురిస్తే తప్ప కరిగెట్లు దున్ని నాట్లేయలేమని అంటున్నారు. కొన్ని గ్రామాల్లో పత్తి విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉంచుకున్న రైతులు దిగుబడి తగ్గుతుందని తెలిసినా పత్తినే సాగు చేస్తున్నారు. ఈసారి అత్యధికంగా మొక్కజొన్న సాగయ్యే అవకాశం ఉన్న దృష్ట్యా బీమా సౌకర్యాం కల్పించే విధంగా అధికారులు కృషి చేయాలని కోరుతున్నారు.
పంట మార్పిడిపై రైతుల దృష్టి
Published Thu, Jul 10 2014 12:20 AM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM
Advertisement