సాక్షి, వరంగల్/ హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా చాలామంది రైతుల ఇళ్లు ఇరుగ్గా మారిపోయాయి.. ఇంటి ఆవరణలు, పశువుల కొట్టాల్లో కూడా జాగా లేకుండా పోయింది.. ఉన్నట్టుండి ఇలా అయిపోవడానికి కారణం ‘పత్తి’ తెచ్చిన తంటాలే. అసలే అడ్డగోలు పెట్టుబడులు, పైగా తగ్గిన దిగుబడితో ఆందోళనలో ఉన్న రైతులకు పత్తి ధరలు తగ్గిపోవడం అశనిపాతంగా మారింది. తక్కువ ధరకు అమ్ముకుని అప్పులు మిగుల్చుకోలేక.. ఎక్కువ ధర ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ.. పత్తిని ఇళ్ల వద్ద, కొట్టాల్లో నిల్వ చేసుకుంటున్నారు. వాస్తవానికి ఈ సమయానికల్లా వానాకాలం పత్తి అమ్మేసుకుని, యాసంగి పంటపై దృష్టిపెట్టే రైతులు.. ఈసారి ఇంకా పంటను విక్రయించకుండా ఎదురుచూస్తున్నారు. దీనితో కాటన్, జిన్నింగ్ మిల్లులు బోసిపోయి కనిపిస్తున్నాయి.
అమ్మింది 3.17 లక్షల టన్నులే..
మార్కెట్లో గత ఏడాది పత్తికి గరిష్టంగా క్వింటాల్‌కు రూ.13 వేలకుపైగా ధర పలికింది. ఈ క్రమంలో వరిసాగు తగ్గించి, పత్తి పెంచాలని ప్రభుత్వం రైతులకు సూచించింది. అయితే సీజన్ ప్రారంభంలో భారీ వర్షాలు పడటంతో పలుచోట్ల మొదట వేసిన పత్తి విత్తనాలు కుళ్లిపోయాయి. దాంతో రైతులు మళ్లీ విత్తనాలు వేశారు. మరోవైపు అధిక వర్షాలు కొనసాగడంతో పత్తి దిగుబడి కూడా తగ్గింది.
ఎకరాకు 10 క్వింటాళ్లకుపైగా దిగుబడి రావాల్సి ఉన్నా.. ఐదారు క్వింటాళ్లే వచి్చందని రైతులు చెప్తున్నారు. మొత్తంగా రాష్ట్రంలో సుమారు 50 లక్షల ఎకరాల్లో పత్తి వేయగా.. 26 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. అందులో జనవరి మూడో తేదీ నాటికి మార్కెట్‌కు కేవలం 3.17 లక్షల టన్నులే వచి్చందని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులు చెప్తున్నారు. మిగతా పత్తినంతా రైతులు నిల్వ చేసుకున్నట్టు వివరిస్తున్నారు.
బోసిపోయిన మిల్లులు
రాష్ట్రవ్యాప్తంగా 350 మిల్లుల్లో రోజూ పత్తిని జిన్నింగ్ చేయాలంటే.. కనీసం 4 లక్షల క్వింటాళ్ల పత్తి మార్కెట్లకు రావాలి. ప్రస్తుతం అందులో సగం కూడా రావడం లేదని జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు చెప్తున్నాయి. దీనితో మార్కెట్ యార్డులు, కాటన్, జిన్నింగ్ మిల్లులు వెలవెలబోయి కనిపిస్తున్నాయి.
తగ్గిన ధర.. మళ్లీ పెరుగుతుందనే ఆశలు
గత ఏడాది పత్తి ధర రూ.13 వేలు కూడా దాటింది. 6 నెలల కిందటి వరకు కూడా క్వింటాల్‌కు రూ.10 వేలు పైన పలికినా.. తర్వాత తగ్గిపోయింది. ప్రస్తు తం రకాన్ని బట్టి క్వింటాల్ రూ.6,200 నుంచి రూ.8,300 మధ్య కొనుగోలు చేస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో కొన్నిచోట్ల వ్యాపారులు రూ.6 వేల వరకే చెల్లించారు. దీనితో ఆందోళనలో పడ్డ రైతులు భవిష్యత్తులో మంచి ధర వస్తుందన్న ఆశ తో నిల్వ చేసుకున్నారు.
ఖమ్మం, నల్లగొండ వంటి జిల్లాల్లో మాత్రం కొంతమేర పత్తి మార్కెట్‌కు వస్తోంది. గత శుక్రవారం వరంగల్ ఎనుమాముల మార్కెట్లో పత్తి ధర గరిష్టంగా క్వింటాల్‌కు రూ.8,170గా నమోదైంది. ఆదిలాబాద్ మార్కెట్‌లో రూ.8,150, ఖమ్మం, జమ్మికుంట మార్కెట్లలో రూ.8,300 పలికింది. ఈ క్రమంలో సంక్రాంతి తర్వాత క్వింటాల్‌కు ధర రూ.10 వేలు దాటుందని రైతులు ఆశిస్తున్నారు. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక క్యాండీ (గింజలు తీసిన 3.56 క్వింటాళ్ల పత్తి) ధర రికవరీ అవుతోంది. గతేడాది జూన్, జూలై వరకు రూ.1,10,000గా ఉన్న క్యాండీ ధర తర్వాత రూ.52 వేలకు పడిపోయింది. ప్రస్తుతం రూ.62 వేలు దాటింది. త్వరలో ఇది రూ.90 వేలకు చేరుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పత్తి గింజల ధర కూడా పెరుగుతోందని.. ఈ లెక్కన పత్తి ధర పెరుగుతుందని అంటున్నాయి.
కౌలుకు తీసుకుని సాగు చేసి..
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండికి చెందిన తుమ్మ రాజారెడ్డి తన పదెకరాలతోపాటు మరో పదెకరాలను కౌలు తీసుకొని పత్తిసాగు చేశాడు. రూ.15 లక్షల వరకు పెట్టుబడి అయింది. ఇప్పటికే కూలీలను పెట్టి 120 క్వింటాళ్ల పత్తి ఏరారు. కానీ గిట్టుబాటు ధర రాక విక్రయించకుండా నిల్వ చేశారు. చేనులో ఇంకా పత్తి ఉన్నా చేతిలో డబ్బుల్లేక అలాగే వదిలేశాడు.
ఇంటి బయట ఎండా వానకు..
సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం తిగుల్ గ్రామానికి చెందిన బీడ చిన్న లచ్చయ్య ఎనిమిది ఎకరాల్లో పత్తి వేశాడు. మార్కెట్లో ధర లేదని పత్తిని ఇలా ఇంటి బయట, వరండాలో ప్లాస్టిక్ కవర్లు కప్పి నిల్వ చేశాడు. ఎప్పుడు ధర పెరుగుతుందో, ఎప్పుడు అమ్ముతానో అని ఆవేదన చెందుతున్నాడు.
సంగారెడ్డి జిల్లా జరాసంఘం మండలం బొప్పన్‌పల్లికి చెందిన రైతు రాములు ఇంట్లో పరిస్థితి ఇది. దిగుబడి వచి్చన పత్తిని అమ్ముకుందామంటే సరైన ధర రాక ఇంట్లోనే నిల్వచేసుకున్నాడు. ఉన్న రెండు గదుల్లోనూ పత్తి నిండిపోవడంతో.. దానికి ఓ పక్కన స్టవ్ పెట్టుకుని వంట చేసుకుంటున్నారు. ఆ కొంత స్థలంలోనే కుటుంబమంతా నిద్రపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment