ఉమ్మడి వరంగల్‌లో సాగని కుటుంబ నిర్ధారణ
48,297 కుటుంబాల గుర్తింపు లక్ష్యం
క్షేత్రస్థాయిలో 36,279 కుటుంబాలే నిర్ధారణ
కుటుంబ సభ్యులతో సెల్ఫీ దిగి ఆన్‌లైన్‌లో నమోదు
స్థానికంగా నివసించకపోవడం, ఆధార్ కార్డు లేకపోవడమే కారణాలు
ప్రభుత్వానికి వివరాలందించిన అధికారులు
సాక్షి, వరంగల్: అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ అందాలన్న ఉద్దేశంతో చేపట్టిన కుటుంబ నిర్ధారణ ప్రక్రియ.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పూర్తిస్థాయిలో సఫలం కాలేదు. ఇందుకు అనేకమంది రైతులు స్థానికంగా లేకపోవడం ఒక కారణం. మరణించిన రైతు పేరుపై రుణమాఫీ ఉండడంతో సదరు మరణ ధ్రువీకరణ పత్రం ఆధార్ కార్డుతో సరిపోకపోవడం, ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వారు ముందుకు రాకపోవడం మరో కారణంగా తెలుస్తోంది.
ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా 12 వేల మంది రైతుల కుటుంబ నిర్ధారణ కాలేదని సమాచారం. కాగా మొత్తం 48,297 కుటుంబాలకు.. ఇప్పటి వరకు 36,279 కుటుంబాల నిర్ధారణ జరిగింది. ఈ వివరాలను ఆయా రైతుల కుటుంబాలతో సెల్ఫీ ఫొటోలను కూడా వ్యవసాయ శాఖ అధికారులు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఈ వివరాలు రాష్ట్ర ప్రభుత్వానికి చేరడంతో.. నిర్ధారణ కాని 12 వేల మంది రైతులకు రుణమాఫీ వర్తించదని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.
అయితే వ్యవసాయ అధికారులు సరైన సమాచారం ఇవ్వకుండా చేసిన ఈ సర్వేతో.. చాలామంది సమయానికి రాలేక రుణమాఫీకి దూరమవుతున్నారని రైతు సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మూడు దశల్లో 2.63 లక్షల మందికి రూ.2,312 కోట్ల రుణమాఫీ చేయడం తెలిసిందే.
ఏ జిల్లాలో ఎంత మంది రైతులు..
వరంగల్ జిల్లాలో 8,252 మంది రైతులకు 6,263 మంది, హనుమకొండలో 8,359 మంది రైతులకు 6,934 మంది, జనగామలో 9,947 మంది రైతులకు 7,762 మంది, మహబూబాబాద్‌లో 10,937 మంది రైతులకు 6,652 మంది, భూపాలపల్లిలో 5,815 మంది రైతులకు 4,713 మంది, ములుగు జిల్లాలో 4,987 మంది రైతులకు 3,955 రైతు కుటుంబ సభ్యుల నిర్ధారణను వ్యవసాయ అధికారులు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు.
మొత్తంగా దాదాపు 12 వేల మంది రైతుల వివరాలు నమోదు కాలేదు. రుణమాఫీకి అర్హులైనా రేషన్ కార్డు లేకపోవడంతో అనేకమందికి రుణమాఫీ వర్తించలేదనే ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై ప్రభుత్వ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పర్యటించి అర్హులైన కుటుంబాల నిర్ధారణ చేపట్టినట్టు వరంగల్ జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ తెలిపారు. రైతులకు ముందస్తు సమాచారం అందించి పంచాయతీ, రైతు వేదికల్లో రేషన్ కార్డు లేని కుటుంబ సభ్యుల నిర్ధారణ చేపట్టామని పేర్కొన్నారు.
కుటుంబ సభ్యులందరితో సెల్ఫీ తీసుకొని ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసినట్టు చెప్పారు. ఈ సమయంలోనే స్థానికంగా ఉండకపోవడం, ఆధార్ కార్డు సమస్యలు, కొందరు విదేశాల్లో ఉండడం తదితర కారణాలతో కొన్ని కుటుంబాలు నిర్ధారణకు దూరంగా ఉన్నాయని వెల్లడించారు. ఇప్పటికే కుటుంబ నిర్ధారణ జరిగిన రైతుల ఖాతాల్లో రుణమాఫీ సొమ్ము ఎప్పుడు వేస్తారోనని రైతులు ఎదురుచూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment