మాకెందుకు కాలేదు మాఫీ? | Loan waiver for one lakh people under Khammam DCCB | Sakshi
Sakshi News home page

మాకెందుకు కాలేదు మాఫీ?

Published Fri, Jul 19 2024 6:08 AM | Last Updated on Fri, Jul 19 2024 7:15 AM

Loan waiver for one lakh people under Khammam DCCB

లక్షలాది మంది రైతుల గగ్గోలు 

అనేకచోట్ల లక్ష వరకు రుణాలున్న వారి పేర్లు గల్లంతు 

ఒక్క ఖమ్మం డీసీసీబీ పరిధిలోనే లక్ష మందికి నిలిచిన రుణమాఫీ  

రేషన్‌కార్డు లేకపోవడం వల్లేనన్న అనుమానాలు 

బంగారం, పాస్‌బుక్‌ పెట్టి తీసుకున్న రుణాలకూ వర్తించని వైనం

వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు సొంత జిల్లా ఖమ్మం డీసీసీబీ పరిధిలో రూ.లక్ష లోపు రుణం ఉన్నవారు 1,43,327 మంది (పీఏసీఎస్‌ ఖాతాలు) ఉన్నారు. వీరికి గురువారం రూ.526 కోట్లు మాఫీ కావాల్సి ఉంది. కానీ కేవలం 37,625 మంది రైతులకు రూ.121 కోట్లు మాత్రమే మాఫీ అయ్యాయి. మిగిలిన 1.05 లక్షల మందికి రుణమాఫీ ఎందుకు జరగలేదన్నది అంతు చిక్కడం లేదు. 

మహబూబ్‌నగర్‌ జిల్లా బాదేపల్లి సహకార బ్యాంకు పరిధిలో 756 మంది లక్ష రూపాయల వరకు రుణాలు తీసుకున్నారు. వీరిలో కేవలం 388 మంది రైతుల పేర్లు మాత్రమే గురువారం నాటి రుణమాఫీ జాబితాలో వచ్చాయి. మిగతా వారికి ఎందుకు రుణమాఫీ జరగలేదో కారణాలు తెలియవని బ్యాంకు అధికారులు అంటున్నారు.  

సాక్షి, హైదరాబాద్‌: రూ.లక్ష వరకు రైతుల రుణాలు మాఫీ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు నిధులు బ్యాంకుల్లో జమ చేశామని పేర్కొంది. కానీ రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు, ప్రభుత్వం చెప్పినట్టుగా లక్ష రూపాయల రుణమాఫీ జరగలేదని క్షేత్రస్థాయి నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. తమకు అర్హత ఉన్నప్పటికీ రుణమాఫీ కాలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేషన్‌కార్డు సహా పీఎం కిసాన్‌ నిబంధనల కారణంగానే లక్షలాది మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందలేక పోయారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రేషన్‌కార్డుతో సంబంధం లేదని ముఖ్యమంత్రి, మంత్రులు చెబుతున్నా.. గురువారం నాటి రుణమాఫీని పరిశీలిస్తే, కుటుంబాన్ని గుర్తించేందుకు దాన్ని ప్రామాణికంగా తీసుకోవడం వల్లనే ఈ పరిస్థితి నెలకొందని అంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో వందలాది మంది అర్హు లైన రైతులు ఉన్నా, ఒక్కరికి కూడా రుణమాఫీ కాకపోవడం విస్తుగొలుపుతోంది. బంగారాన్ని కుదవపెట్టి పాస్‌బుక్‌తో పంట రుణాలు తీసుకున్న రైతుల కు కూడా మాఫీ ఉంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు విలేకరులతో చిట్‌చాట్‌లో స్పష్టం చేశారు. కానీ ఎక్కడా బంగారం రుణాలు మాఫీ కాలేదని రైతులు అంటున్నారు. రేషన్‌కార్డుతో పాటు పీఎం కిసాన్‌లో ఉన్న ఏ నిబంధనలను సర్కారు అమలు చేస్తుందో స్పష్టత ఇవ్వడం లేదు.

దీంతో రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళం నెలకొంది. జాబితాల్లో తమ పేర్లు లేవంటూ గ్రామాల్లో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫీ కాకపోవడానికి కారణాలను బ్యాంకు అధికారులు కూడా చెప్పలేకపోతుండటం గమనార్హం. హైదరాబాద్‌ కేంద్రంగా జాబితాలు వచ్చాయని, ఈ విషయంలో తమకేమీ తెలియదని కొందరంటున్నారు. తొలి విడతలోనే భారీ సంఖ్యలో రైతులకు రుణమాఫీ కాకపోవడంతో.. వచ్చే రెండు విడతల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.  

రుణమాఫీ జరగని మరికొన్ని కేసులు 
 భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రానికి చెందిన కోట శైలజ 2023 ఆగస్టు 10వ తేదీన స్థానిక బ్యాంకులో రూ.97 వేలు పంట రుణం తీసుకున్నారు. కానీ ప్రస్తుత రుణమాఫీ జాబితాలో ఆమె పేరు రాలేదు. అయితే ఆమెతో పాటు అదే రోజు రుణం తీసుకున్న మరో రైతు పేరు జాబితాలో ఉంది.  

 ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బోదులబండ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం రుణమాఫీ కోసం 865 మందితో జాబితా పంపించింది. వీరు తీసుకున్న రుణం రూ.4.65 కోట్లు. లక్ష రూపాయల వరకు రుణం తీసుకున్న రైతులు 730 మంది కాగా, వారిలో 352 మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది. భార్యా భర్తలకు ఒకే బ్యాంకులో వేర్వేరు ఖాతా లు ఉండటం, వేర్వేరు బ్యాంకుల్లో ఇద్దరికి ఖాతాలు ఉండటం, సాంకేతిక లోపం లాంటివి కారణంగా అధికారులు చెబుతున్నారు.  

 నల్లగొండ మండలం గుండ్లపల్లి గ్రామంలోని పలువురు రైతులు ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్, యూనియన్‌ బ్యాంక్‌ల నుంచి పంట రుణాలు తీసుకున్నారు. ప్రభుత్వం ప్రకటించిన రుణ మాఫీ పొందే వారి జాబితాలో గ్రామానికి చెందిన కొంతమంది రైతుల పేర్లు లేవు. బ్యాంక్‌ అధికారులను అడిగితే తాము జాబితాను పంపించలేదని, హెడ్‌ ఆఫీస్‌ నుంచి ప్రభుత్వం జాబితాను తీసుకుందేమోనని సమాధానం చెబుతున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో లక్ష రూపాయలలోపు రుణాలు తీసుకున్న వారు 1,76,683 మంది ఉండగా, వారు మొత్తం రూ.941.29 కోట్లు తీసుకున్నట్లుగా ప్రభుత్వం జాబితా విడుదల చేసింది. కానీ రుణమాఫీలో కొంతమంది పేర్లు మిస్‌ అయ్యాయి.  

ఒక్కరికి కూడా కాలేదు.. 
నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి సహకార బ్యాంకులో లక్ష రూపాయలలోపు రుణమాఫీకి అర్హులైన రైతులు 1,407 మంది ఉన్నారు. వీరిలో గురువారం ఒక్కరికి కూడా రుణమాఫీ కాలేదు. జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని సహకార బ్యాంకు అధికారులు చెబుతున్నారు.  

 ఇదే జిల్లా కారేపల్లి సహకార సొసైటీలో 3,790 మంది రైతులు రుణమాఫీకి అర్హులు. వీరు తీసుకున్న రుణం 19.27 కోట్లు కాగా అందులో రూ.లక్షలోపు రుణమాఫీ కావాల్సిన రైతుల సంఖ్య 3,153. వారికి ఇవ్వాల్సిన సొమ్ము రూ. 10.30 కోట్లు. కానీ గురువారం రుణమాఫీ అయిన రైతులు 668 మంది మాత్రమే కాగా వారికి సంబంధించి కేవలం రూ. 2.06 కోట్లు మాత్రమే మాఫీ అయ్యింది.  

  మెదక్‌ డీసీసీబీ (జిల్లా కేంద్ర సహకార బ్యాంకు) పాపన్నపేట బ్రాంచి పరిధిలో రూ.లక్ష లోపు పంట రుణాలున్న మొత్తం రైతులు 1,685 మంది కాగా, వీరు తీసుకున్న పంటరుణం రూ.5.99 కోట్లు. ఇందులో కేవలం 845 మంది రైతులకు సంబందించిన రూ.2.83 కోట్లు మాత్రమే మాఫీ అయ్యాయి. మిగతా వారివి ఎందుకు మాఫీ కాలేదనే వివరాలు తమకు రావాల్సి ఉందని బ్యాంకు బ్రాంచి మేనేజర్‌ కిషన్‌ తెలిపారు. 

 ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని వాణిజ్య బ్యాంకుల్లో రూ.లక్ష లోపు రుణాలు తీసుకున్న వేల మంది రైతుల పేర్లు కూడా రుణమాఫీ జాబితాలో లేకుండా పోయాయి.

నా పంట రుణం మాఫీ కాలే 
నేను నేలకొండపల్లి సహకార బ్యాంక్‌లో పట్టాదారు పాస్‌ పుస్తకం పెట్టి రూ.50 వేలు వ్యవసాయ రుణం తీసుకున్నా. పంట సాగు కోసమే ఈ రుణం పొందా. ప్రభుత్వం రుణమాఫీకి పెట్టిన నిబంధనల ప్రకారం నేను అర్హురాలిని. అందరిలాగే నాకు కూడా రుణమాఫీ అవుతుందని రైతువేదిక వద్దకు వచ్చా. కానీ జాబితాలో నా పేరు లేదు. దీంతో నా రుణం మాఫీ కాలేదు. అధికారులు నాకు రుణమాఫీ అయ్యేలా న్యాయం చేయాలి.  – బాలిక రాంబాయి, మహిళా రైతు, భైరవునిపల్లి, నేలకొండపల్లి మండలం, ఖమ్మం జిల్లా  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement