thummala nageswar rao
-
కాళేశ్వరం లేకున్నా రికార్డు వరి పంట
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీరు అందించకపోయినా రాష్ట్రంలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరి ధాన్యం ఉత్పత్తి అవుతున్నదని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా ఈ ఏడాది 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేసినట్లు చెప్పారు.కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్లనే రాష్ట్రంలో వరి ఉత్పత్తి పెరిగిందని ప్రచారం చేసిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో మంత్రులు మీడియాతో మాట్లాడారు. అధికార దాహంతో ఉన్న బీఆర్ఎస్ పారీ్ట.. రైతులకు మేలు చేస్తున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో రెండోస్థానం కోసం బీజేపీ కుయుక్తులు పన్నుతోందని మండిపడ్డారు. 40 లక్షల ఎకరాల్లో సన్నాల సాగు రాష్ట్రంలో గతంలో 25 లక్షల ఎకరాల్లో సన్నవడ్లు సాగు చేస్తే, ఈ ఏడాది సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించటంతో 40 లక్షలకు పైగా ఎకరాల్లో రైతులు సాగు చేశారని మంత్రులు తెలిపారు. వచ్చే సంక్రాంతి నుంచి రేషన్ షాపులు, గురుకులాలు, హాస్టళ్లలో సన్నబియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించారు. ‘గత ఏడాది ఇదే సమయానికి 17 జిల్లాల్లో కొనుగోళ్లు ప్రారంభిస్తే.. ఈ ఏడాది 25 జిల్లాల్లో కొనుగోళ్లు చేస్తున్నాం.గత ఏడాది ఈ కాలానికి 9.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగులో చేస్తే.. ఈ ఏడాది 9.58 లక్షలు మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం. వాస్తవాలు ఇలా ఉంటే ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తూ రైతుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి’అని ఆగ్రహం వ్యక్తంచేశారు. హింస ప్రేరిపిస్తోంది విపక్షాలే.. ప్రతిపక్షాలు రైతులను, ప్రజలను రెచ్చగొట్ట హింసను ప్రేరిపిస్తున్నాయని మంత్రులు విమర్శించారు. పరిశ్రమలకు భూములు సేకరించే సమయంలో ప్రజాభిప్రాయ సేకరణను నేరుగా ముఖ్యమంత్రి, స్థానిక ప్రజాప్రతినిధులు చేపట్టడం దేశ చరిత్రలో ఎక్కడా లేదని, దీనిపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఇష్టానుసారంగా మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కొడంగల్‌లో ఫార్మా కంపెనీల ఏర్పాటు విషయంలో రైతులతో మాట్లాడేందుకు సీఎం, మంత్రులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.ధాన్యంలో తేమ 17 శాతానికి మించరాదన్న కేంద్ర ప్రభుత్వ నిబంధన వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని మంత్రులు తెలిపారు. ఈ నిబంధన సడలించేలా రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. తేమశాతాన్ని పక్కనపెట్టి ప్రైవేటు వ్యాపారులు అధిక ధరకు రైతుల నుంచి ధాన్యం కొంటున్నారని చెప్పారు. -
మాకెందుకు కాలేదు మాఫీ?
వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు సొంత జిల్లా ఖమ్మం డీసీసీబీ పరిధిలో రూ.లక్ష లోపు రుణం ఉన్నవారు 1,43,327 మంది (పీఏసీఎస్ ఖాతాలు) ఉన్నారు. వీరికి గురువారం రూ.526 కోట్లు మాఫీ కావాల్సి ఉంది. కానీ కేవలం 37,625 మంది రైతులకు రూ.121 కోట్లు మాత్రమే మాఫీ అయ్యాయి. మిగిలిన 1.05 లక్షల మందికి రుణమాఫీ ఎందుకు జరగలేదన్నది అంతు చిక్కడం లేదు. మహబూబ్‌నగర్ జిల్లా బాదేపల్లి సహకార బ్యాంకు పరిధిలో 756 మంది లక్ష రూపాయల వరకు రుణాలు తీసుకున్నారు. వీరిలో కేవలం 388 మంది రైతుల పేర్లు మాత్రమే గురువారం నాటి రుణమాఫీ జాబితాలో వచ్చాయి. మిగతా వారికి ఎందుకు రుణమాఫీ జరగలేదో కారణాలు తెలియవని బ్యాంకు అధికారులు అంటున్నారు. సాక్షి, హైదరాబాద్: రూ.లక్ష వరకు రైతుల రుణాలు మాఫీ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు నిధులు బ్యాంకుల్లో జమ చేశామని పేర్కొంది. కానీ రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు, ప్రభుత్వం చెప్పినట్టుగా లక్ష రూపాయల రుణమాఫీ జరగలేదని క్షేత్రస్థాయి నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. తమకు అర్హత ఉన్నప్పటికీ రుణమాఫీ కాలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేషన్‌కార్డు సహా పీఎం కిసాన్ నిబంధనల కారణంగానే లక్షలాది మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందలేక పోయారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.రేషన్‌కార్డుతో సంబంధం లేదని ముఖ్యమంత్రి, మంత్రులు చెబుతున్నా.. గురువారం నాటి రుణమాఫీని పరిశీలిస్తే, కుటుంబాన్ని గుర్తించేందుకు దాన్ని ప్రామాణికంగా తీసుకోవడం వల్లనే ఈ పరిస్థితి నెలకొందని అంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో వందలాది మంది అర్హు లైన రైతులు ఉన్నా, ఒక్కరికి కూడా రుణమాఫీ కాకపోవడం విస్తుగొలుపుతోంది. బంగారాన్ని కుదవపెట్టి పాస్‌బుక్‌తో పంట రుణాలు తీసుకున్న రైతుల కు కూడా మాఫీ ఉంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు విలేకరులతో చిట్‌చాట్‌లో స్పష్టం చేశారు. కానీ ఎక్కడా బంగారం రుణాలు మాఫీ కాలేదని రైతులు అంటున్నారు. రేషన్‌కార్డుతో పాటు పీఎం కిసాన్‌లో ఉన్న ఏ నిబంధనలను సర్కారు అమలు చేస్తుందో స్పష్టత ఇవ్వడం లేదు.దీంతో రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళం నెలకొంది. జాబితాల్లో తమ పేర్లు లేవంటూ గ్రామాల్లో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫీ కాకపోవడానికి కారణాలను బ్యాంకు అధికారులు కూడా చెప్పలేకపోతుండటం గమనార్హం. హైదరాబాద్ కేంద్రంగా జాబితాలు వచ్చాయని, ఈ విషయంలో తమకేమీ తెలియదని కొందరంటున్నారు. తొలి విడతలోనే భారీ సంఖ్యలో రైతులకు రుణమాఫీ కాకపోవడంతో.. వచ్చే రెండు విడతల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రుణమాఫీ జరగని మరికొన్ని కేసులు ⇒ భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రానికి చెందిన కోట శైలజ 2023 ఆగస్టు 10వ తేదీన స్థానిక బ్యాంకులో రూ.97 వేలు పంట రుణం తీసుకున్నారు. కానీ ప్రస్తుత రుణమాఫీ జాబితాలో ఆమె పేరు రాలేదు. అయితే ఆమెతో పాటు అదే రోజు రుణం తీసుకున్న మరో రైతు పేరు జాబితాలో ఉంది. ⇒ ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బోదులబండ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం రుణమాఫీ కోసం 865 మందితో జాబితా పంపించింది. వీరు తీసుకున్న రుణం రూ.4.65 కోట్లు. లక్ష రూపాయల వరకు రుణం తీసుకున్న రైతులు 730 మంది కాగా, వారిలో 352 మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది. భార్యా భర్తలకు ఒకే బ్యాంకులో వేర్వేరు ఖాతా లు ఉండటం, వేర్వేరు బ్యాంకుల్లో ఇద్దరికి ఖాతాలు ఉండటం, సాంకేతిక లోపం లాంటివి కారణంగా అధికారులు చెబుతున్నారు. ⇒ నల్లగొండ మండలం గుండ్లపల్లి గ్రామంలోని పలువురు రైతులు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్‌ల నుంచి పంట రుణాలు తీసుకున్నారు. ప్రభుత్వం ప్రకటించిన రుణ మాఫీ పొందే వారి జాబితాలో గ్రామానికి చెందిన కొంతమంది రైతుల పేర్లు లేవు. బ్యాంక్ అధికారులను అడిగితే తాము జాబితాను పంపించలేదని, హెడ్ ఆఫీస్ నుంచి ప్రభుత్వం జాబితాను తీసుకుందేమోనని సమాధానం చెబుతున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో లక్ష రూపాయలలోపు రుణాలు తీసుకున్న వారు 1,76,683 మంది ఉండగా, వారు మొత్తం రూ.941.29 కోట్లు తీసుకున్నట్లుగా ప్రభుత్వం జాబితా విడుదల చేసింది. కానీ రుణమాఫీలో కొంతమంది పేర్లు మిస్ అయ్యాయి. ఒక్కరికి కూడా కాలేదు.. ⇒ నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి సహకార బ్యాంకులో లక్ష రూపాయలలోపు రుణమాఫీకి అర్హులైన రైతులు 1,407 మంది ఉన్నారు. వీరిలో గురువారం ఒక్కరికి కూడా రుణమాఫీ కాలేదు. జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని సహకార బ్యాంకు అధికారులు చెబుతున్నారు. ⇒ ఇదే జిల్లా కారేపల్లి సహకార సొసైటీలో 3,790 మంది రైతులు రుణమాఫీకి అర్హులు. వీరు తీసుకున్న రుణం 19.27 కోట్లు కాగా అందులో రూ.లక్షలోపు రుణమాఫీ కావాల్సిన రైతుల సంఖ్య 3,153. వారికి ఇవ్వాల్సిన సొమ్ము రూ. 10.30 కోట్లు. కానీ గురువారం రుణమాఫీ అయిన రైతులు 668 మంది మాత్రమే కాగా వారికి సంబంధించి కేవలం రూ. 2.06 కోట్లు మాత్రమే మాఫీ అయ్యింది. ⇒ మెదక్ డీసీసీబీ (జిల్లా కేంద్ర సహకార బ్యాంకు) పాపన్నపేట బ్రాంచి పరిధిలో రూ.లక్ష లోపు పంట రుణాలున్న మొత్తం రైతులు 1,685 మంది కాగా, వీరు తీసుకున్న పంటరుణం రూ.5.99 కోట్లు. ఇందులో కేవలం 845 మంది రైతులకు సంబందించిన రూ.2.83 కోట్లు మాత్రమే మాఫీ అయ్యాయి. మిగతా వారివి ఎందుకు మాఫీ కాలేదనే వివరాలు తమకు రావాల్సి ఉందని బ్యాంకు బ్రాంచి మేనేజర్ కిషన్ తెలిపారు. ⇒ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని వాణిజ్య బ్యాంకుల్లో రూ.లక్ష లోపు రుణాలు తీసుకున్న వేల మంది రైతుల పేర్లు కూడా రుణమాఫీ జాబితాలో లేకుండా పోయాయి.నా పంట రుణం మాఫీ కాలే నేను నేలకొండపల్లి సహకార బ్యాంక్‌లో పట్టాదారు పాస్ పుస్తకం పెట్టి రూ.50 వేలు వ్యవసాయ రుణం తీసుకున్నా. పంట సాగు కోసమే ఈ రుణం పొందా. ప్రభుత్వం రుణమాఫీకి పెట్టిన నిబంధనల ప్రకారం నేను అర్హురాలిని. అందరిలాగే నాకు కూడా రుణమాఫీ అవుతుందని రైతువేదిక వద్దకు వచ్చా. కానీ జాబితాలో నా పేరు లేదు. దీంతో నా రుణం మాఫీ కాలేదు. అధికారులు నాకు రుణమాఫీ అయ్యేలా న్యాయం చేయాలి. – బాలిక రాంబాయి, మహిళా రైతు, భైరవునిపల్లి, నేలకొండపల్లి మండలం, ఖమ్మం జిల్లా -
అంతర్జాతీయ ప్రమాణాలతో ఖమ్మం మార్కెట్ ఆధునీకరణ
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం మార్కెట్‌ను అంతర్జాతీయ ప్రమా ణాలతో ఆధునీకరించాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అధికారులను ఆదేశించారు. అలాగే కోహెడ మార్కెట్ నుంచి అంతర్జాతీయంగా పండ్ల ఎగుమతులు జరిగేలా అన్ని మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు. ఈ మేరకు మంత్రి శుక్రవారం వ్యవసాయ, మార్కెటింగ్, జౌళి శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యవసాయ, ఉద్యాన, సెరికల్చర్, జౌళి శాఖల్లో ఒకే రకమైన పనితీరు కలిగిన కార్పొరేషన్లను సంఘటితపరిచి ఒకే కార్పొరేషన్ ఏర్పాటుచేసి, వాటిని బలోపేతం చేసేందుకు ప్రతిపాదనలు తయారుచేసి త్వరలోనే ముఖ్యమంత్రి ఆమోదానికి పంపిస్తామని తెలిపారు.అకాల వర్షాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు నష్టపోకుండా పంటల ఉత్పత్తులకు సంబంధించిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, బయోమాస్‌కు సంబంధించిన యూనిట్లను కూడా ప్రోత్సహించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. మార్కెటింగ్, గిడ్డంగుల సంస్థల గోదాములపై సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేయాలని, దీనికోసం విద్యుత్ అధికారులతో సంప్రదించి తగిన ఒప్పందాలు చేసుకోవాలన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు టెస్కో ద్వారా తప్పనిసరిగా వస్త్రాలను కొనుగోలు చేయాలని మంత్రి చెప్పారు. ఈ ఆదేశాల ప్రకారం ఇప్పటివరకు వివిధ ప్రభుత్వ శాఖల నుంచి సుమారు రూ.255 కోట్ల విలువైన ఆర్డర్లు వచ్చాయన్నారు. ప్రతి సంవత్సరం బతుకమ్మ చీరలతో కలపి 5.70 కోట్ల మీటర్ల ఆర్డర్లు నేత కార్మికులకు వచ్చేవని, కానీ ఈ సంవత్సరం బతుకమ్మ చీరలు కాకుండానే 2.50 కోట్ల మీటర్ల ఆర్డర్లు వచ్చాయనీ, ఇంకా 80 లక్షల మీటర్ల ఆర్డర్లు రావాల్సి ఉందన్నారు. పవర్ లూమ్స్ పరిశ్రమకు విద్యుత్ సబ్సిడీ ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా అధికారులను మంత్రి కోరారు. సమావేశంలో పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, జౌళిశాఖ సంచాలకులు అలుగు వర్షిణి, ఉద్యాన సంచాలకులు అశోక్‌రెడ్డి, మార్కెటింగ్ శాఖ సంచాలకులు లక్ష్మీబాయి పాల్గొన్నారు.మంత్రి తుమ్మలతో డీసీసీబీ చైర్మన్ల భేటీ ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, వరంగల్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల డీసీసీబీ చైర్మన్లు శుక్రవారం సెక్రటేరియట్లో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా వారు ఆయా బ్యాంకుల స్థితిగతులు, ఆర్థిక విధానాలను వివరించారు. -
సీతారామ ప్రాజెక్టుతో ఆగస్టు నాటికి సాగునీరు అందించాలి : మంత్రి తుమ్మల
ఖమ్మం: సీతారామ ప్రాజెక్టు ద్వారా వచ్చే ఆగస్టు నాటికి సాగునీరు అందించాలని వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. దమ్మపేట మండలం గండుగులపల్లిలోని సీతా రామ లిఫ్ట్ పనులను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వేసవి కాలంలో మట్టి పనులు పూర్తి చేయాలని, మిగిలిన పనులు వర్షాకాలంలో చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ఇతర ప్రాంతాల్లో కూడా కాల్వలు తవ్వే పనులు వేసవికి ముందే పూర్తి చేయాలన్నారు. ఈ క్రమంలో రహదారులు, రైల్వే లైన్లు, అటవీ భూములు, పోడు భూములు, గిరిజనుల సాగులో ఉన్న అటవీ భూముల వంటివి ఏవి ఉన్నా నిర్వాసితులకు పరిహారం కోసం ఉమ్మడి జిల్లాల కలెక్టర్లను సంప్రదించాలని చెప్పారు. కేంద్రం లేదా రాష్ట్రంలో ఏ ప్రభుత్వ శాఖ అనుమతి కావాలన్నా తనను కలవాలని, సంబంధిత మంత్రిత్వ శాఖతో చర్చించి సకాలంలో సాధిస్తానని భరోసా ఇచ్చారు. అనంత రం మ్యాప్ ద్వారా అధికారులు పనుల పురోగతిని వివరించారు. టన్నెళ్ల నిర్మాణంలో జాప్యం జరుగుతోందని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించే ఏజన్సీ లను సంప్రదించాలని ఈ సందర్భంగా మంత్రి అధికారులకు సూచించారు. రూ.7,500 కోట్లు వెచ్చించినా ఇంకా పనుల్లో జాప్యం తగదన్నారు. ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ఏం చేయాలో ఆలోచించి ముందుకు సాగాలని సూచించారు. ఆధునిక సాంకేతికతతో టన్నెళ్ల నిర్మాణం, జెన్కో టెండర్లు, పంపుల నిర్మా ణం వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ ఏడాది 1.50 లక్షల ఎకరాలకు నీరు.. సీతారామ ప్రాజెక్టు ద్వారా ఈ ఏడాది 1.50 లక్షల ఎకరాలకు, వచ్చే ఏడాది మరో 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని మంత్రి తుమ్మల వివరించారు. ప్రాజెక్టు పరిశీలన అనంతరం ఆయన అక్కడే విలేకరులతో మాట్లాడారు. గోదావరి నది పోలవరం ప్రాజెక్టు వద్ద ఉన్న ఫుల్ రిజర్వాయర్ లెవల్‌కు సమానంగా ప్రాజెక్టు ఎత్తును నిర్వహించడం ద్వారా ఎంత పెద్ద ఉప్పెన వచ్చినా తెలంగాణలో ముంపు ఏర్పడదని అధికారులు చెప్పారు. అనంతరం ఖమ్మం ఔటర్ రింగ్ రోడ్ ప్రతిపాదనలను అఽధికారులు మంత్రి దృష్టికి తీసుకురాగా కొత్త కలెక్టరేట్‌కు ఇబ్బంది కాకుండా, మరెవరికీ ఆటంకం కలుగకుండా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. దమ్మపేట మండలం పూసుకుంట గ్రామంలో కొండరెడ్లు 80 ఏళ్ల క్రితం నుంచి ఉంటున్నారని.. వారు అంతరించిపోతున్న తెగగా గుర్తించబడ్డారని.. వారికి రవాణా సౌకర్యం కోసం గతంలోనే తాను రూ.30 కోట్ల ఎల్‌డబ్ల్యూఈ నిధులను మంజూరు చేశానని కలెక్టర్ ప్రియాంక ఆలకు గుర్తు చేశారు. సంబంధిత అధికారులతో చర్చించి ఆ నిధులు వెనక్కు మళ్లకుండా వారికి రహదారి సౌకర్యం కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఖమ్మం కలెక్టర్ వీ.పీ.గౌతమ్, స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సీఈ ఎ. శ్రీనివాసరెడ్డి, ఎస్ఈలు ఎస్. శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, అశ్వారావుపేట ఈఈ సురేష్‌కుమార్, డీఈఈ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: TS గవర్నమెంట్ కీలక నిర్ణయం! ఉపాధ్యాయుల్లో ఆందోళన.. -
ప్రతి అసెంబ్లీ కేంద్రంలో మహిళా దినోత్సవం
సాక్షి, హైదరాబాద్: మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో వేడుకలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇందుకు సంబంధించిన నిధులను జిల్లాలకు విడుదల చేస్తామని చెప్పారు. బుధవారం సచివాలయంలో మహిళా దినోత్సవ ఏర్పాట్లపై ప్రభుత్వ సలహాదారులు కేవీ రమణాచారి, సాంస్కృతిక మండలి చైర్మన్ రసమయి బాలకిషన్ తదితరులతో ఆయన సమావేశం నిర్వహించారు. మార్చి 8న రాష్ట్ర స్థాయిలో నిర్వహించే కార్యక్రమానికి వేదికగా లలితకళాతోరణాన్ని పరిశీలించాలన్నారు. ఈ కార్యక్రమం సాయంత్రం 5 నుంచి 8 గంటల మధ్య జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన మహిళలకు అవార్డులు ఇవ్వనున్నట్లు మంత్రి చెప్పారు. శుక్రవారం మరోమారు ఉత్సవ కమిటీ సమావేశం అవుతుందని తెలిపారు. ‘భేటీ బచావో, భేటీ పడావో’ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసి కేంద్రం ప్రశంసలు పొందిన హైదరాబాద్ జిల్లా యంత్రాంగాన్ని ఈ సందర్భంగా మంత్రి తుమ్మల ప్రత్యేకంగా అభినందించారు. -
సూర్యాపేటలో ఎమ్మార్పీఎస్ ఆందోళన
సాక్షి, సూర్యాపేట: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగను వెంటనే విడుదల చేయాలని ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. సూర్యాపేట జిల్లాలో శుక్రవారం ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. దీంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అయితే అదే సమయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ట్రాపిక్‌లో చిక్కుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మార్పీఎస్ నేతలు మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు ఆందోళన కారులను అరెస్టు చేశారు. -
‘జాతీయ రహదారులను త్వరలో పూర్తిచేస్తాం’
హైదరాబాద్: జాతీయ రహదారుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని, అయితే ఈ అన్యాయాన్ని సీఎం కేసీఆర్ సరిదిద్దారని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు స్పష్టం చేశారు. శాసనసభలో జాతీయ రహదారులపై స్వల్పకాలిక చర్చ ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ఎంతో పట్టుదలతో నేషనల్ హైవేలను మంజూరు చేయించారన్నారు. స్వయంగా సీఎం కేసీఆరే రెండుసార్లు జాతీయ రహదారులను డిజైన్ చేశారని, మరో 2,500 కిలోమీటర్ల నేషనల్ హైవేలను నిర్మించుకుందామని తెలిపారు. హైదరాబాద్‌లో జాతీయ రహదారులను త్వరలో పూర్తిచేస్తామన్నారు. అన్ని మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్లు వేస్తామని చెప్పారు. -
పోలవరం నుంచి మహారాష్ట్రకు జలమార్గం
ఖమ్మం: పోలవరం నుంచి మహారాష్ట్ర వరకు గోదావరి నదిపై జలమార్గం కోసం తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపిందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బుధవారం ఖమ్మంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూజలమార్గంతో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మరింతగా బీజం పడుతుందన్నారు. రాష్ట్రంలో చేపట్టే ప్రాజెక్టులు జలమార్గానికి అనుకూలంగా ఉండేలా నిర్మాణం చేస్తామని చెప్పారు. కొత్తగూడెంలో ఎయిర్ పోర్టు, కొత్తగూడెం- సత్తుపల్లి రైల్వేలైన్ పై కేంద్రానికి ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు. ఇవి త్వరిత గతిన వచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. జిల్లాలో జాతీయ రహదారుల నిర్మాణం కూడా జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఎమ్మెల్సీ అభ్యర్థి బాలసాని లక్ష్మీనారాయణ ను గెలిపించాలని కోరారు. కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు మాట్లాడుతూ... టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే జిల్లా అభివృద్ధికి బాటలు పడ్డాయన్నారు. -