ఈ ఏడాది 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అంచనా
కాళేశ్వరంతోనే ఉత్పత్తి పెరిగిందన్న బీఆర్‌ఎస్ నేతలు ఇప్పుడేమంటారు?
అధికార దాహంతో బీఆర్‌ఎస్.. రెండో స్థానం కోసం బీజేపీ పోటీ
సంక్రాంతి నుంచి రేషన్ షాపుల్లో సన్నబియ్యం
మంత్రులు తుమ్మల, శ్రీధర్‌బాబు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీరు అందించకపోయినా రాష్ట్రంలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరి ధాన్యం ఉత్పత్తి అవుతున్నదని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా ఈ ఏడాది 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేసినట్లు చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్లనే రాష్ట్రంలో వరి ఉత్పత్తి పెరిగిందని ప్రచారం చేసిన బీఆర్‌ఎస్ నేతలు ఇప్పుడేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో మంత్రులు మీడియాతో మాట్లాడారు. అధికార దాహంతో ఉన్న బీఆర్‌ఎస్ పారీ్ట.. రైతులకు మేలు చేస్తున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో రెండోస్థానం కోసం బీజేపీ కుయుక్తులు పన్నుతోందని మండిపడ్డారు.
40 లక్షల ఎకరాల్లో సన్నాల సాగు
రాష్ట్రంలో గతంలో 25 లక్షల ఎకరాల్లో సన్నవడ్లు సాగు చేస్తే, ఈ ఏడాది సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించటంతో 40 లక్షలకు పైగా ఎకరాల్లో రైతులు సాగు చేశారని మంత్రులు తెలిపారు. వచ్చే సంక్రాంతి నుంచి రేషన్ షాపులు, గురుకులాలు, హాస్టళ్లలో సన్నబియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించారు. ‘గత ఏడాది ఇదే సమయానికి 17 జిల్లాల్లో కొనుగోళ్లు ప్రారంభిస్తే.. ఈ ఏడాది 25 జిల్లాల్లో కొనుగోళ్లు చేస్తున్నాం.
గత ఏడాది ఈ కాలానికి 9.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగులో చేస్తే.. ఈ ఏడాది 9.58 లక్షలు మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం. వాస్తవాలు ఇలా ఉంటే ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తూ రైతుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి’అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
హింస ప్రేరిపిస్తోంది విపక్షాలే..
ప్రతిపక్షాలు రైతులను, ప్రజలను రెచ్చగొట్ట హింసను ప్రేరిపిస్తున్నాయని మంత్రులు విమర్శించారు. పరిశ్రమలకు భూములు సేకరించే సమయంలో ప్రజాభిప్రాయ సేకరణను నేరుగా ముఖ్యమంత్రి, స్థానిక ప్రజాప్రతినిధులు చేపట్టడం దేశ చరిత్రలో ఎక్కడా లేదని, దీనిపై బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ ఇష్టానుసారంగా మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కొడంగల్‌లో ఫార్మా కంపెనీల ఏర్పాటు విషయంలో రైతులతో మాట్లాడేందుకు సీఎం, మంత్రులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
ధాన్యంలో తేమ 17 శాతానికి మించరాదన్న కేంద్ర ప్రభుత్వ నిబంధన వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని మంత్రులు తెలిపారు. ఈ నిబంధన సడలించేలా రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. తేమశాతాన్ని పక్కనపెట్టి ప్రైవేటు వ్యాపారులు అధిక ధరకు రైతుల నుంచి ధాన్యం కొంటున్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment