70–75 శాతం మిల్లర్లు సహకరిస్తున్నారు
సహకరించని ప్రాంతాల్లో కార్పొరేషన్ ద్వారా కొనుగోళ్లు
ఏపీలో 100శాతం బ్యాంకు గ్యారంటీలు.. ఇక్కడ 10–25 శాతమే
మిల్లర్ల సంఘం సమ్మతించిన తర్వాతే ముందుకు పోతున్నాం
ధాన్యం కొనుగోళ్లకు రూ.30 వేల కోట్ల సమీకరణ
‘సాక్షి’ప్రత్యేక ఇంటర్వ్యూలో పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రైతు పండించిన ప్రతి గింజకు మా ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తుంది. 7,750 ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరిచాం. ఇది గత ప్రభుత్వం కంటే చాలాఎక్కువ. కేంద్రాల్లో పనిచేసే సిబ్బందికి శిక్షణ ఇచ్చి అన్ని సదుపాయాలు కల్పించాం. ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన నిధులు కూడా సమీకరించాం. రూ.30 వేల కోట్ల వరకు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 70–75 శాతం మిల్లర్లు ధాన్యం కొనుగోళ్లకు సహకరిస్తున్నారు. వారు సహకరించని ప్రాంతాల్లో పౌరసరఫరాల సంస్థ ద్వారా మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో కొనుగోలు చేస్తాం. రైతులెవరూ ఆందోళన పడొద్దు’అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్లపై ఆదివారం ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
ప్రశ్న: కొన్ని ప్రాంతాల్లో మిల్లర్లు సహకరించక రైతులు ఇబ్బంది పడుతున్నారు కదా ?
ఉత్తమ్: ధాన్యం కొనుగోళ్లకు సహకరించాలని మిల్లర్లకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. రైతులకు మద్దతు ధరకన్నా, తక్కువ చెల్లింపులు చేస్తే కఠిన చర్యలు తప్పవు. మిల్లర్లు సహకరించని ప్రాంతాల్లో రైతులకు ఇబ్బంది కలగకుండా పౌరసరఫరాల సంస్థ ద్వారా కొనుగోళ్లు చేసి గోదాముల్లో నిల్వ చేసేందుకు ఏర్పాట్లు చేశాం. ఎక్కడా మేజర్ సమస్యల్లేవు.
ప్రశ్న: బ్యాంకు గ్యారంటీ నిబంధన ఉపసంహరించాలని మిల్లర్లు కోరుకుంటున్నారు కదా?
ఉత్తమ్: గత ప్రభుత్వం మిల్లర్ల వద్ద స్టాక్ ఉంచి ఏ సెక్యూరిటీ తీసుకోలేదు. ఏపీలో 100 శాతం సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించి మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. మన దగ్గర సైతం ప్రారంభ దశలో మిల్లర్ల ట్రాక్ రికార్డు ఆధారంగా స్టాక్ విలువలో 10 శాతం, 20 శాతం, 25 శాతాన్ని సెక్యూరిటీ డిపాజిట్‌గా తీసుకోవాలని నిర్ణయించాం. రాష్ట్ర మిల్లర్ల సంఘం ఒప్పుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాం. బాండ్ పేపర్‌పై పూచీకత్తు రాసిచ్చి కూడా ధాన్యం కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించాం.
ప్రశ్న: మిల్లర్లకు ఏమైనా వెసులుబాటు కల్పిస్తారా?
ఉత్తమ్: ఏపీతో పోలి్చతే రాష్ట్రంలో బ్యాంకు గ్యారంటీలు చాలా తక్కువే. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం మిల్లర్లకు టన్నుకు రూ.10 చొప్పున మిల్లింగ్ చార్జీలు చెల్లించగా, ఇప్పుడు మేము దొడ్డు రకానికి రూ.40, సన్న రకానికి రూ.50 చొప్పున పెంచాం. ఏపీలో డిఫాల్ట్ అయిన మిల్లర్ల నుంచి 150 శాతం జరిమానా వసూలు చేస్తే, మన దగ్గర 120 శాతమే వసూలు చేస్తున్నాం.గతంలో మిల్లర్లకు సీఎంఆర్ ధాన్యం కేటాయింపుల్లో చాలా అవినీతి జరిగేది. ఇప్పుడు శాస్త్రీయ సిద్ధాంతం ఆధారంగా ఏ మిల్లర్‌కు ఎంత ఇవ్వాలో నిర్ణయించి ఇస్తున్నాం.
ప్రశ్న: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కూడా రైతులు ఇబ్బంది పడుతున్నట్టు వార్తలొచ్చాయి ?
ఉత్తమ్: ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో సజావుగా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఒకరిద్దరు మినహా స్థానిక మిల్లర్లందరూ సహకరిస్తున్నారు. (మంత్రి ఉత్తమ్ సూర్యాపేట, నల్లగొండ, భువనగిరి జిల్లాల కలెక్టర్లకు అప్పటికప్పుడు ఫోన్ చేసి పరిస్థితిని ఆరా తీశారు. కలెక్టర్ల నుంచి మంచి ఫీడ్‌బ్యాక్ ఉందని చెప్పారు.)
ప్రశ్న: ఈ సారి రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి వచి్చంది.ఎలాంటి ఏర్పాట్లు చేశారు ?
ఉత్తమ్: గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో ఈసారి రికార్డు స్థాయిలో 66.7లక్షల ఎకరాల్లో 40 లక్షల మంది రైతులు 155 మెట్రిక్ టన్నుల ధాన్యం పండించారు. ధాన్యం కొనుగోలు చేసిన మూడు నాలుగు రోజుల్లోనే వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులను జమ చేస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టుతోనే రాష్ట్రంలో వరి ధాన్యం పెరిగిందని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చెప్పుకున్నదంతా అబద్ధమని ఈసారి తేటతెల్లమైంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నుంచి చుక్కనీరు సరఫరా చేయకపోయినా ఈ ఖరీఫ్‌లో రికార్డు స్థాయిలో ధాన్యం పండింది.
ప్రశ్న: సన్నాలకు రూ.500 బోనస్ చెల్లిస్తామన్నా, రైతులు వ్యాపారులు, మిల్లర్లకు నేరుగా అమ్ముకుంటున్నారు కదా ?
ఉత్తమ్: కేంద్రం ప్రకటించిన మద్దతు ధరతో దొడ్డు రకం ధాన్యం, దానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరో రూ.500 బోనస్ చెల్లించి సన్నరకం ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నది. కొనుగోలు కేంద్రాలకు సన్న రకం ధాన్యం ఎంత వచ్చినా బోనస్ చెల్లించి కొనుగోలు చేస్తాం. పండించిన ధాన్యం అమ్ముకునే విషయంలో రైతులపై ఆంక్షలు లేవు. సన్నాలకు మద్దతు ధర రూ.2320కు బోనస్ రూ.500 కలిపితే వచ్చే ధర కంటే అధిక ధరతో అమ్ముకునే అవకాశం వస్తే రైతులకు, ఆర్థిక వ్యవస్థకు, రాష్ట్రానికి మంచిది.
ప్రశ్న: రైతులు సన్నాలను ప్రభుత్వానికి అమ్మకపోతే వచ్చే సంక్రాంతి నుంచి రేషన్‌షాపుల్లో సన్న బియ్యం పంపిణీ ఎలా చేస్తారు ?
ఉత్తమ్: రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీకి ఇబ్బంది లేకుండా అవసరమైన సరుకు సమీకరణ చేస్తాం. ఇబ్బందులేమీ రావు.
ప్రశ్న: ధాన్యం సేకరణలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని బీఆర్‌ఎస్, బీజేపీ ఆరోపణలు చేస్తున్నాయి ?
ఉత్తమ్: నల్లగొండ జిల్లాలో రైతులు రోడ్లపై ఆరబోసుకున్న ధాన్యం వీడియోలు తీసి రైతులు రోడ్లపై పారబోశారని బీఆర్‌ఎస్ వారు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 17శాతం, ఆలోపే తేమ ఉండాలని కేంద్రమే నిర్దేశించింది. మద్దతు ధర సైతం కేంద్రమే నిర్ణయించింది. దాని ప్రకారమే ధాన్యం కొనుగోళ్లు చేస్తుంటే బీజేపీ నేతలు కేంద్రాలకు వెళ్లి ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment