‘సాక్షి’ ఇంటర్వ్యూలో నీటిపారుదల,పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
తుమ్మిడిహెట్టి సహా పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం
‘కాళేశ్వరం’పై రాజకీయ దురుద్దేశాల్లేవు..ప్రాజెక్టును వీలైనంత వాడుకుంటాం.. త్వరలో నీటిపారుదల శాఖ పునర్వ్యవస్థీకరణ
ఏపీతో నీటి వాటాలపై రాజీలేదు..
జనవరి/ఫిబ్రవరి నుంచి సన్న బియ్యం పంపిణీ
సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్లు, డ్రాయింగ్‌లతోపాటు అంచనాలను సవరించి వచ్చే వేసవిలో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తామని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఎన్నికల హామీ మేరకు ఈ టర్మ్‌లోనే ప్రాజెక్టును పూర్తిచేస్తామని చెప్పారు. గోదావరిపై తుమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మించే అంశాన్ని పునఃపరిశీలిస్తున్నామని.. నిపుణుల సలహా మేరకు ముందుకెళ్తామని అన్నారు. గత డిజైన్లు, నీటి లభ్యతను పునఃసమీక్షించి బరాజ్‌ను తప్పనిసరిగా కడతామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేపటితో (డిసెంబర్ 7) ఏడాది పూర్తవుతున్న సందర్భంగా మంత్రి ఉత్తమ్ ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఏడాది కాలంలో సాధించిన ప్రగతి, పాలనా విశేషాలను పంచుకున్నారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
‘కాళేశ్వరాన్ని’ సాధ్యమైనంత వరకు వాడుకుంటాం...
తెలంగాణ ప్రజల సొమ్ముతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగానే ఉండాలనే రాజకీయ దురుద్దేశాలు మాకు లేవు. ప్రాజెక్టును ఏ మేరకు ఉపయోగంలోకి తీసుకురాగలమో అంతవరకు తీసుకొస్తాం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పునరుద్ధరణకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) నివేదిక కోసం నిరీక్షిస్తున్నాం. జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సూచనల మేరకు బరాజ్‌లను రక్షించుకోవడానికి గ్రౌటింగ్ పనులను అధికారులు చేయడంపై ఎన్డీఎస్‌ఏ అభ్యంతరం తెలపడం వాస్తవమే.
మేడిగడ్డ బరాజ్ కుంగినందున అన్నారం, సుందిళ్ల బరాజ్‌లనైనా వాడుకోవచ్చా? అని ఎన్డీఎస్‌ఏ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్‌ను అడిగా. మూడు బరాజ్‌లకు సికెంట్ పైల్స్ వాడటంతో వాటి భద్రతపై అనుమానాలున్నాయని.. క్లియరెన్స్ ఇవ్వలేమని ఆయన బదులిచ్చారు. దీనిపై డిసెంబర్ ఆఖరిలోగా పరిశీలించి చెప్తామన్నారు.
‘కాళేశ్వరం’లేకున్నా రికార్డుస్థాయి దిగుబడి..
కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్‌లలో చుక్క నీళ్లు నిల్వ చేయకపోయినా గత వానాకాలంలో 66.7 లక్షల ఎకరాల్లో 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండటం దేశంలోనే రికార్డు. ధాన్యం అమ్మకాలతో రైతులు రూ. 35–40 వేల కోట్లు ఆర్జించారు. సన్నాలకు పరిమితి లేకుండా రూ. 500 చొప్పున 1,87,532 మంది రైతులకు బోనస్ ఇచ్చాం. యాసంగిలో సన్నాలకు బోనస్ కొనసాగిస్తాం. దొడ్డు వడ్లనూ కొంటాం.
పాత, కొత్త ప్రాజెక్టులను పూర్తి చేస్తాం..
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధిక కమీషన్లు వచ్చే పనులకే ప్రాధ్యాతనిచి్చంది. మేము సాగునీటి ప్రాజెక్టులను ఏ, బీ కేటగిరీలుగా విభజించి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సత్వరమే సాగునీరు ఇచ్చే పనులను చేస్తున్నాం. పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్, డిండి, దేవాదుల, గౌరవెల్లి, ఎస్సారెస్పీ, అచ్చంపేట లిఫ్టుతోపాటు కొత్తగా చేపట్టిన కొడంగల్–నారాయణపేట ప్రాజెక్టులను ఈ టర్మ్‌లోనే పూర్తిచేస్తాం. నా ప్రధాన బాధ్యతగా ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులను రెండేళ్లలో పూర్తిచేస్తా. జాతీయ విధానం ఆధారంగా లోయర్ మానేరు, మిడ్‌మానేరు ప్రాజెక్టుల్లో పూడిక తొలగింపు పనులను ప్రయోగాత్మకంగా చేపట్టబోతున్నాం. తర్వాత అన్ని ప్రాజెక్టుల్లో చేపడతాం.
సీఎం, డిప్యూటీ సీఎం రాష్ట్రాభివృద్ధికి నిధులు సమీకరిస్తారని నమ్ముతున్నా..
బడ్జెట్‌లో నీటిపారుదల శాఖకు రూ. 22,160 కోట్లు కేటాయిస్తే అందులో రుణాలు, వడ్డీల చెల్లింపులు పోగా మిగిలిన రూ. 11 వేల కోట్లను ప్రాజెక్టులపై ఖర్చు చేస్తున్నాం. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రాజెక్టులకు, రాష్ట్రాభివృద్ధికి సరిపడా నిధులు సమీకరిస్తారని నమ్మకం ఉంది.
అన్ని జిల్లాలూ సమానమే..
ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ప్రాజెక్టులకే ప్రాధ్యాత ఇస్తున్నామన్న ఆరోపణలు అవాస్తవం. కరీంనగర్‌లో గౌరవెల్లి ప్రాజెక్టుకి రూ. 500 కోట్లు ఇచ్చాం. చిన్నకాళేశ్వరం పూర్తి చేస్తున్నాం. పెద్దపల్లిలో పత్తిపాక రిజర్వాయర్ నిర్మిస్తున్నాం. మాకు అన్ని జిల్లాలు సమానమే.
గత సర్కారు చుక్క నీటినీ సాధించలేదు..
రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నీటి వాటాలపై రాజీ ప్రసక్తే లేదు. కృష్ణా జలాల్లో 811 టీఎంసీల ఉమ్మడి ఏపీ వాటాలో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీల కేటాయింపులను అంగీకరిస్తూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పలుమార్లు కేంద్రానికి లిఖితపూర్వకంగా సమ్మతి తెలిపింది. తాజాగా అందుకు అంగీకరించబోమని.. 70 శాతం పరీవాహక ప్రాంతంగల తెలంగాణకే 70 శాతం జలాలను కేటాయించాలని కేంద్రంతో కోట్లాడుతున్నాం. పాలమూరు–రంగారెడ్డి, సీతారామ, సమ్మక్క–సారక్క ప్రాజెక్టులకు చుక్క నీటి కేటాయింపులను కూడా గత సర్కారు సాధించలేదు. మా ప్రయత్నాలతో సీతారామకు 67 టీఎంసీల కేటాయింపులు తుది దశకు చేరాయి.
శ్రీశైలంపై 10 రోజుల్లో సుప్రీంకు... (బాక్స్ ఐటెమ్)
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు, ఇతర మార్గాల ద్వారా ఏపీ అక్రమంగా నీళ్లు తరలిస్తుండడంపై వారం 10 రోజుల్లో సుప్రీం కోర్టులో కేసు వేయబోతున్నాం. సీఎం రేవంత్‌రెడ్డి వైఫల్యంతోనే నాగార్జునసాగర్‌పై నియంత్రణ సీఆర్పీఎఫ్ చేతుల్లోకి వెళ్లిందని ఎమ్మెల్సీ కె.కవిత చేసిన ఆరోపణలు అర్థరహితం. సాగర్‌ను తిరిగి కైవసం చేసుకోవడానికి చట్టప్రకారం అన్నీ చేస్తాం. ఇంజనీర్ల పదోన్నతులపై హైకోర్టులో స్టే తొలగిన వెంటనే నీటిపారుదల శాఖను పునర్వ్యవస్థీకరిస్తాం. నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల్లో భారీ సంస్కరణలు తీసుకొస్తున్నాం.
జనవరి లేదా ఫిబ్రవరిలో రేషన్‌కార్డులకు సన్న బియ్యం..
రైతులు సన్నాలను అధిక ధరకు ధాన్యం వ్యాపారులకు అమ్ముకోవడం సంతోషకరం. రేషన్‌కు కొరత లేకుండా అవసరమైన సన్న బియ్యాన్ని సమీకరిస్తాం. మేము అధికారంలోకి వచ్చేసరికి సివిల్ సప్లై కార్పొరేషన్ అప్పులు రూ. 58,623 కోట్లు ఉండగా 10 నెలల్లో రూ. 11,600 కోట్లను కట్టేశాం. సంస్కరణల్లో భాగంగా మరో రెండు పంటల నాటికి మిల్లర్ల నుంచి 100 శాతం బ్యాంకు గ్యారంటీ అడుగుతాం. డిఫాల్టర్ల నుంచి చట్టపరమైన చర్యలతో రికవరీ చేస్తాం. రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలు పూర్తయ్యాక రేషన్‌కార్డుల జారీకి మళ్లీ కసరత్తు ప్రారంభిస్తాం. రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీని జనవరి లేదా ఫిబ్రవరిలో మొదలుపెట్టే అంశంపై మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటుంది.
24 గంటలూ ప్రజలకు అందుబాటులో...
తెలంగాణ ప్రజాకాంక్షలకు విరుద్ధంగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేసింది. వన్ మ్యాన్ షో.. వన్ ఫ్యామిలీ షో అన్నట్లుగా పాలన సాగింది. నిలువెల్లా అహంకారం, నియంత్రతృత్వ ధోరణి, అవినీతితో ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ నాటి సర్కార్ నీరుగార్చింది. మేము ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి శాసనసభ గౌరవాన్ని పెంపొందించాం. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం. సమర్థంగా శాఖలను పరుగెత్తిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వాల్లో మంత్రులకు గౌరవం, స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఉంటుంది.
బీఆర్‌ఎస్ అతిచేస్తోంది..
మేము అధికారంలోకి వచ్చి ఏడాది కాలేదు. ఇదైపోయింది... అదైపోయిందని బీఆర్‌ఎస్ నేతలు మాట్లాడటం సరికాదు. మూసీ ప్రాజెక్టులో ఒక్క రూపాయి ఖర్చు పెట్టకపోయినా కుంభకోణం అనడం అతి. బీజేపీ, బీఆర్‌ఎస్ ఉద్యోగ, ఉపాధి కల్పనలో పదేళ్లు విఫలమయ్యారు. 10 నెలల్లోనే 55 వేల ఉద్యోగాలిచ్చాం. నిన్న ఇంకా 9 వేల ఉద్యోగాలు భర్తీ చేసినా ఏడుపే. పదేళ్లలో ఒక్క ఉపాధ్యాయ పోస్టునూ భర్తీ చేయలేదు. మేము 11 వేల మంది టీచర్లను నియమించాం. నీటిపారుదల శాఖలో 687 మంది ఏఈఈలను భర్తీ చేశాం.
Comments
Please login to add a commentAdd a comment