ఖమ్మం: సీతారామ ప్రాజెక్టు ద్వారా వచ్చే ఆగస్టు నాటికి సాగునీరు అందించాలని వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. దమ్మపేట మండలం గండుగులపల్లిలోని సీతా రామ లిఫ్ట్ పనులను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వేసవి కాలంలో మట్టి పనులు పూర్తి చేయాలని, మిగిలిన పనులు వర్షాకాలంలో చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ఇతర ప్రాంతాల్లో కూడా కాల్వలు తవ్వే పనులు వేసవికి ముందే పూర్తి చేయాలన్నారు.
ఈ క్రమంలో రహదారులు, రైల్వే లైన్లు, అటవీ భూములు, పోడు భూములు, గిరిజనుల సాగులో ఉన్న అటవీ భూముల వంటివి ఏవి ఉన్నా నిర్వాసితులకు పరిహారం కోసం ఉమ్మడి జిల్లాల కలెక్టర్లను సంప్రదించాలని చెప్పారు. కేంద్రం లేదా రాష్ట్రంలో ఏ ప్రభుత్వ శాఖ అనుమతి కావాలన్నా తనను కలవాలని, సంబంధిత మంత్రిత్వ శాఖతో చర్చించి సకాలంలో సాధిస్తానని భరోసా ఇచ్చారు. అనంత రం మ్యాప్ ద్వారా అధికారులు పనుల పురోగతిని వివరించారు.
టన్నెళ్ల నిర్మాణంలో జాప్యం జరుగుతోందని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించే ఏజన్సీ లను సంప్రదించాలని ఈ సందర్భంగా మంత్రి అధికారులకు సూచించారు. రూ.7,500 కోట్లు వెచ్చించినా ఇంకా పనుల్లో జాప్యం తగదన్నారు. ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ఏం చేయాలో ఆలోచించి ముందుకు సాగాలని సూచించారు. ఆధునిక సాంకేతికతతో టన్నెళ్ల నిర్మాణం, జెన్‌కో టెండర్లు, పంపుల నిర్మా ణం వేగవంతం చేయాలని ఆదేశించారు.
ఈ ఏడాది 1.50 లక్షల ఎకరాలకు నీరు..
సీతారామ ప్రాజెక్టు ద్వారా ఈ ఏడాది 1.50 లక్షల ఎకరాలకు, వచ్చే ఏడాది మరో 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని మంత్రి తుమ్మల వివరించారు. ప్రాజెక్టు పరిశీలన అనంతరం ఆయన అక్కడే విలేకరులతో మాట్లాడారు. గోదావరి నది పోలవరం ప్రాజెక్టు వద్ద ఉన్న ఫుల్ రిజర్వాయర్ లెవల్‌కు సమానంగా ప్రాజెక్టు ఎత్తును నిర్వహించడం ద్వారా ఎంత పెద్ద ఉప్పెన వచ్చినా తెలంగాణలో ముంపు ఏర్పడదని అధికారులు చెప్పారు. అనంతరం ఖమ్మం ఔటర్ రింగ్ రోడ్ ప్రతిపాదనలను అఽధికారులు మంత్రి దృష్టికి తీసుకురాగా కొత్త కలెక్టరేట్‌కు ఇబ్బంది కాకుండా, మరెవరికీ ఆటంకం కలుగకుండా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
దమ్మపేట మండలం పూసుకుంట గ్రామంలో కొండరెడ్లు 80 ఏళ్ల క్రితం నుంచి ఉంటున్నారని.. వారు అంతరించిపోతున్న తెగగా గుర్తించబడ్డారని.. వారికి రవాణా సౌకర్యం కోసం గతంలోనే తాను రూ.30 కోట్ల ఎల్‌డబ్ల్యూఈ నిధులను మంజూరు చేశానని కలెక్టర్ ప్రియాంక ఆలకు గుర్తు చేశారు. సంబంధిత అధికారులతో చర్చించి ఆ నిధులు వెనక్కు మళ్లకుండా వారికి రహదారి సౌకర్యం కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఖమ్మం కలెక్టర్ వీ.పీ.గౌతమ్, స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సీఈ ఎ. శ్రీనివాసరెడ్డి, ఎస్‌ఈలు ఎస్. శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, అశ్వారావుపేట ఈఈ సురేష్‌కుమార్, డీఈఈ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఇవి చదవండి: TS గవర్నమెంట్ కీలక నిర్ణయం! ఉపాధ్యాయుల్లో ఆందోళన..
Comments
Please login to add a commentAdd a comment