ప్రక్షాళన చేయాల్సిందే..
కేఎంసీలో ఉద్యోగులు, సిబ్బంది ఇష్టారాజ్యం
పలు విభాగాలను శాసిస్తున్న ఔట్‌సోర్సింగ్ సిబ్బంది
అధికారులను సైతం ఏమారుస్తున్న వైనం
ఎవరైనా ప్రశ్నిస్తే ప్రజాప్రతినిధులతో పైరవీలు
కొత్త కమిషనర్ ఎదుట సవాళ్ల పర్వం
ఖమ్మం: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌లో ఔట్ సోర్సింగ్ సిబ్బంది తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. కొందరు సిబ్బంది విభాగాల్లో అంతా తామై వ్యవహరిస్తున్నారని కేఎంసీలో చర్చ జరుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగుల కన్నా వీరి పెత్తనమే ఎక్కువైందని, అధికారుల ఆదేశాలను పట్టించుకోకుండా తాము చెప్పిందే వేదం అన్న చందంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక కంప్యూటర్ ఆపరేటర్లు కేటాయించిన విభాగాల్లో కాకుండా అంతా ఒకే గదిలో కూర్చుని కార్యకలాపాలు సాగిస్తున్నారనే విమర్శ ఉంది. ప్రధానంగా శానిటేషన్, రెవెన్యూ, ఇంజనీరింగ్, అకౌంట్స్, ఐటీ, ఎన్నికలు, పరిపాలన విభాగాల్లో ఔట్‌సోర్సింగ్ సిబ్బంది పెత్తనం అధికమైందని తెలుస్తోంది. ఈనేపథ్యాన కమిషనర్‌గా విధుల్లో చేరిన అభిషేక్ అగస్త్య తొలుత కార్యాలయ ప్రక్షాళన నుంచే తన పని ప్రారంభించాలని పలువురు కోరుతున్నారు.
అంతా అక్కడి నుంచే..
కేఎంసీలో ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది కొరత కారణంగా పలువురిని ఔట్‌సోర్సింగ్ విధానంలో నియమించారు. వీరిలో కొందరికి కంప్యూటర్ ఆపరేటర్లుగా హోదా కల్పించి విభాగాలకు అప్పగించారు. ఇందులో పలువురు అధికారులు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ బృందంగా ఏర్పడి కార్యాలయంలో తమకంటూ ఒక ప్రత్యేక గది ఏర్పాటు చేసుకున్నారు.
రెవెన్యూ, గ్రీవెన్స్, కమిషనర్ పేషీ, సిస్టమ్ మేనేజర్ విభాగాలకు చెందిన కంప్యూటర్ ఆపరేటర్లు సాంకేతిక విభాగం పేరుతో అక్కడి నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నారు. వారి కి నచ్చిన ఫైళ్లను పరిష్కరిస్తూ.. ఇతరులవి పక్కన పెడుతున్నారనే విమర్శలు చాన్నాళ్లుగా ఉన్నాయి. ఏళ్ల తరబడి వీరంతా అదేవిభాగాల్లో పనిచేస్తుండడంతో అజమాయిషీ కరువవగా.. విభాగాల్లో కాకుండా అంతా ఒకేచోటకు చేరడంతో ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.
పాతుకుపోయారు..
కేఎంసీలో రెవెన్యూ, శానిటేషన్, టౌన్‌ప్లానింగ్, ఇంజనీరింగ్, ఎస్టాబ్లిష్‌మెంట్ విభాగాల్లో ఉద్యోగులు, అధికారులు ఏళ్ల తరబడి పాతుకుపోయి ఉన్నారు. ఇటీవల కొందరి విభాగాలు మార్చినప్పటికీ ఉద్యోగుల తీరు మాత్రం మారలేదని తెలుస్తోంది. కొందరు ఉద్యోగులు చెప్పా పెట్టకుండానే విధులకు గైర్హాజరు కావడం పరిపాటిగా మారిందని సమాచారం. ఈ నేపథ్యాన నగరాభివృద్ధి ఎంత ముఖ్య మో... కార్యాలయాన్ని ప్రక్షాళన చేయడం కూడా అంతే ముఖ్యమనే విషయాన్ని కొత్త కమిషనర్ గుర్తించాలనే వినతులు వెల్లువెత్తుతున్నాయి.
విధుల్లో చేరిన కమిషనర్ అభిషేక్ అగస్త్య
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా అభిషేక్ అగస్త్య మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. మేడ్చల్ మల్కాజ్‌గిరి అదనపు కలెక్టర్‌గా ఉన్న ఆయనను కమిషనర్‌గా బదిలీ చేయగా విధుల్లో చేరారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని వివిధ విభాగాల అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం మేయర్ పునుకొల్లు నీరజను కమిషనర్ మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై చర్చించారు.
ఆ తర్వాత కమిషనర్ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ తదితర విభాగాల అధికారులతో సమావేశమై ప్రస్తుతం జరుగుతున్న పనులపై ఆరా తీశారు. అలాగే, అకౌంట్స్ విభాగం అధికారితో సమావేశం సందర్భంగా కేఎంసీలో నిధుల నిల్వలు, పెండింగ్ బిల్లులపై చర్చించారు. మధ్యాహ్నం నగరంలోని బోనకల్ రోడ్డు, మమత రోడ్డు మార్గాల్లో కమిషనర్ అభిషేక్ పర్యటించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ రంజిత్‌కుమార్, అసిస్టెంట్ కమిషనర్ ఏ.సంపత్‌కుమార్, మున్సిపల్ ఈఈ కృష్ణలాల్, డీఈలు, టౌన్‌ప్లానింగ్ ఏసీపీ వసుంధర తదితరులు పాల్గొన్నారు.
కేఎంసీనా.. సాఫ్ట్‌వేర్ కంపెనీయా?
కార్పొరేషన్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ల సంఖ్యను చూస్తే ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీని తలదన్నేలా ఉంటుంది. ఒక్కో విభాగంలో ఇద్దరి నుంచి నలుగురు, ఐదుగురు వరకు ఆపరేటర్లను నియమించగా.. వీరు పనిచేయడం కన్నా బయట తిరగడం పైనే శ్రద్ధ వహిస్తారనే విమర్శలున్నాయి. ఎక్కడా ఏ కార్యాలయంలో లేని విధంగా కేఎంసీలో 23 మంది వరకు కంప్యూటర్ ఆపరేటర్లను నియమించగా పలువురికి కనీస కంప్యూటర్ పరిజ్ఞానం లేదని తెలుస్తోంది.
అయినా రాజకీయ పలుకుబడితో ఇతర విధుల్లో చేరి కంప్యూటర్ ఆపరేటర్లుగా పేర్లు నమోదు చేయించుకున్నారని సమాచారం. కాస్త పరిజ్ఞానం ఉన్న వారు అధికారులను ఏమారుస్తుంటే.. ఏ మాత్రం నైపుణ్యం లేని సిబ్బంది ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పి నెట్టుకొస్తున్నారని తెలుస్తోంది. ఇంతమంది ఉన్నప్పటికీ ప్రత్యేక అవసరాల సమయాల్లో మాత్రం రోజువారీ వేతనంపై బయట నుంచి ఆపరేటర్లను తీసుకొస్తుండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment