ఉన్నత చదువులకు వెళ్లి.. అనంతలోకాలకు | - | Sakshi
Sakshi News home page

ఉన్నత చదువులకు వెళ్లి.. అనంతలోకాలకు

Published Sun, Dec 1 2024 12:10 AM | Last Updated on Sun, Dec 1 2024 1:54 PM

-

అమెరికాలో దుండగుల కాల్పుల్లో ఖమ్మం విద్యార్థి మృతి 

ఐదు నెలల క్రితమే వెళ్లిన సాయితేజ 

ఖమ్మంక్రైం: ఉన్నత చదువులు పూర్తి కాగానే తమ కుమారుడు ఉద్యోగంలో చేరి కుటుంబానికి ఆసరాగా నిలుస్తాడని భావిస్తున్న తల్లిదండ్రులకు నిరాశే ఎదురైంది. కుమారుడిని గొప్ప స్థాయిలో చూడాలని ఆశించి వారు అమెరికాకు పంపించగా అక్కడ దుండుగులు జరిగిన కాల్పుల్లో మృతి చెందాడనే సమాచారం అందడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఎంబీఏ చదివేందుకు వెళ్లిన ఐదు నెలల్లోనే జిల్లాకు చెందిన నూకారపు సాయితేజ(25) మృతి చెందినట్లు సమాచారం అందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.

అక్క అక్కడే..
ఖమ్మం రూరల్‌ మండలం రామన్నపేటకు చెందిన నూకారపు కోటేశ్వరరావు కుటుంబంతో కలిసి ఖమ్మం రాపర్తినగర్‌లోని రమణగుట్టలో నివాసం ఉంటున్నాడు. ఆయనకు భార్య వాణితో పాటు కుమార్తె ప్రియ, కుమారుడు సాయితేజ ఉన్నారు. కొన్నాళ్ల క్రితమే ప్రియ అమెరికాకు వెళ్లగా ఎంఎస్‌ పూర్తి చేసి ఉద్యోగంలో చేరింది. కుమారుడైన సాయితేజ హైదరాబాద్‌లో ఇంటర్‌, బీబీఎం పూర్తిచేశాక అమెరికా ఎంబీఏ చేసేందుకు పంపించారు. ఆయనకు చికాగో ప్రాంతంలోని కాంకాడ్సి యూనివర్సిటీలో సీటు రావడంతో ఈ ఏడాది జూన్‌ 15వ తేదీన అక్కడకు బయలుదేరాడు. అమెరికా వెళ్లాక సాయితేజ మరికొందరు స్నేహితులతో కలిసి అద్దె గదిలో ఉంటూ పార్ట్‌టైం ఉద్యోగం కూడా సంపాదించుకున్నాడు. ఖమ్మంలో ఉన్న తల్లిదండ్రులకే కాక అమెరికాలోని మరో ప్రాంతంలో ఉన్న తన సోదరి ప్రియకి ఫోన్‌ చేస్తుండేవాడు. వారంలో కనీసం మూడు రోజులైనా గ్రూప్‌ కాల్‌ మాట్లాడుకునేవారు. ఎంబీఏ పూర్తికాగానే మంచి ఉద్యోగం సాధిస్తానని, తల్లిదండ్రులను సైతం అమెరికా తీసుకెళ్తానని తరచుగా చెప్పేవాడు.

ఏం జరిగింది...
సాయితేజ అమెరికాలోని ఓ స్టోర్‌లో పార్ట్‌టైం ఉద్యోగం చేస్తున్నాడు. భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున ఆయన క్యాష్‌కౌంటర్‌లో ఉండగా తుపాకులతో వచ్చిన దుండగులు బెదిరించడంతో డబ్బులు ఇచ్చేసి పక్కన నిల్చున్నాడు. ఇంతలో ఏం జరిగిందో ఏమో కానీ దుండగులు అతి సమీపం నుంచి కాల్చడంతో సాయి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయాన్ని పోలీసులు ఆయన స్నేహితులకు తెలపడంతో వారు కోటేశ్వరరావుకు ఫోన్‌లో సమాచారం ఇచ్చారు. కాగా, శుక్రవారం కూడా సాయితేజ తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడగా శనివారం ఫోన్‌ కోసం ఎదురుచూస్తుండగా పిడుగు లాంటి వార్త తెలియడంతో కన్నీరుమున్నీరయ్యారు. తల్లి వాణికి మృతి చెందినట్లు కాకుండా గాయాలయ్యాయని మాత్రమే చెప్పారు. అమెరికాలోని తానా సభ్యులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడి సాయి మృతదేహాన్ని త్వరగా పంపించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. దీంతో ఐదు రోజుల్లో మృతదేహం వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఎంపీలు, ఎమ్మెల్సీ సంతాపం
ఖమ్మం మయూరిసెంటర్‌/ఖమ్మంవన్‌టౌన్‌: అమెరికాలో ఖమ్మం విద్యార్ధి నూకారపు సాయితేజ మృతి చెందడంపై ఎంపీలు రామసహాయం రఘురాంరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులను ఫోన్‌లో పరామర్శించారు. అలాగే, అమెరికా నుంచి సాయితేజ మృతదేహాన్ని త్వరగా రప్పించేలా కృషి చేస్తామని తెలిపారు. కాగా, సాయితేజ కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌ పరామర్శించారు. ఆయన మృతదేహాన్ని ఖమ్మం త్వరగా పంపించేలా ఏర్పాట్లు చేయాలని తానా బాధ్యులైన లావు అంజయ్య చౌదరి, లావు శ్రీనివాస్‌ తదితరులను ఫోన్‌లో కోరారు. ఎమ్మెల్సీ వెంట నాయకులు బెల్లం వేణుగోపాల్‌ తదితరులు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement