జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారుల గాలింపు
గుండాల, ఆళ్లపల్లి, కరకగూడెం ప్రాంతాల్లో జాడలను వెదుకుతున్న సిబ్బంది
ములుగు జిల్లా నుంచి ఇటు వచ్చినట్లు చెబుతున్న తాడ్వాయి అధికారులు
మూడేళ్లుగా ఏజెన్సీ గ్రామాల ప్రజలను వణికిస్తున్న జాతీయ జంతువు
ఇల్లెందురూరల్/చుంచుపల్లి: ఆదిలాబాద్ జిల్లాలో కొంతకాలం హడలెత్తించిన పెద్దపులి క్రమంగా కరీంనగర్, వరంగల్, ములుగు జిల్లాలు దాటుకుంటూ భద్రాద్రికొత్తగూడెం జిల్లాకి ప్రవేశించింది. పాదముద్రల ఆధారంగా పులి భద్రాద్రి జిల్లాలోకి వచ్చినట్లు ములుగు జిల్లా తాడ్వాయి అటవీశాఖ అధికారులు తెలిపినట్లు ఇక్కడి అధికారులు చెబుతున్నారు. గురువారం కరకగూడెం మీదుగా గుండాల వైపునకు పెద్దపులి ప్రయాణం సాగినట్లు అటవీశాఖ అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో జిల్లాలోని అడవికి ఆనుకుని ఉన్న ఏజెన్సీ మండలాల్లో అటవీశాఖ అప్రమత్తమైంది.
మేటింగ్ సీజన్ కావడంతో..
సాధారణంగా చలికాలం అంటే నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు పులులకు మేటింగ్ (సంభోగం) సీజన్. ఈ సమయంలోనే మగ పెద్దపులి ఆడతోడు కోసం వెదుకుతుంది. దశాబ్దాల క్రితం పులులకు ఆవాసాలుగా ఉన్న ప్రాంతాల్లో కలియతిరిగే అలవాటు ఉంటుంది. ఈ క్రమంలో గోదావరి పరీవాహక ప్రాంతం వెంట అక్టోబర్‌లో తన ప్రయాణాన్ని ప్రారంభించిన పులి తాజాగా జిల్లాలోకి ప్రవేశించింది.
నాలుగేళ్ల క్రితం కూడా ఆడ పులి కోసమే..
నాలుగేళ్ల క్రితం జిల్లాలో పెద్దపులి సంచారం కనిపించింది. 2020 నవంబర్‌లో మగపెద్దపులి ఆడతోడు కోసం ములుగు జిల్లా నుంచి కరకగూడెం, ఆళ్లపల్లి, మామకన్ను అటవీ ప్రాంతాలలో సంచరించింది. అక్కడి నుంచి ఇల్లెందు మండలంలో పాండవుల గుట్ట మీదుగా మహబూబాబాద్ జిల్లాలోకి ప్రవేశించి తిరిగి ఆదిలాబాద్ దిశగా తన ప్రయాణం కొససాగించింది. ఆ సమయంలో జిల్లాలో ఎక్కడా మనుషులపై దాడి చేసిన ఘటన లేకపోవడంతో మ్యాన్‌ఈటర్ కాదని, ఆడతోడు కోసమే ఇటుగా వచ్చినట్లు అటవీశాఖ అధికారులు అప్పట్లో పేర్కొన్నారు. ఆ తర్వాత 2022లో మరోసారి పెద్దపులి సంచారం తిరిగి చలికాలంలోనే సాగింది.
పూర్వం పులులకు అడ్డాగా..
పూర్వం భద్రాద్రి జిల్లాలోని ఇల్లెందు, గుండాల, పాండవుల గుట్ట, పూర్వ వరంగల్ జిల్లా పాఖాల కొత్తగూడెం అటవీ ప్రాంతం పెద్దపులుల సంచారానికి అడ్డాగా ఉండేది. 2000 సంవత్సరంలోనూ ఈ ప్రాంతం దట్టమైన అడవులతో అల్లుకుపోయి ఉండేది. పులుల నివాసానికి అనుగుణంగా కనిపించే గుహలు పాండవుల గుట్ట ఏడు బావుల ప్రదేశాల్లో నేటికీ దర్శనమిస్తాయి. ఆ సముదాయాన్ని పులి గుహగా పిలుస్తుంటారు. 2000 సంవత్సరంలో నవంబర్‌లోనే ఈ ప్రాంతంలో పెద్దపులి సంచరించినట్లు ప్రచారంలో ఉంది. బయ్యారం మండలం మిర్యాలపెంట గ్రామానికి చెందిన ఓ గిరిజన రైతుకు చెందిన రెండు ఆవులను పెద్దపులి సంహరించింది. గ్రామ సమీపం వరకు దట్టమైన అడవి ఉండటంతో పులి సంచారాన్ని నాడు గిరిజనులు పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత పులుల ఆవాసంగా గుర్తింపు పొందిన పాండవుల గుట్ట అటవీ ప్రాంతంలో రెండు దశాబ్దాల తరువాత అంటే 2020లో, ఆ తర్వాత 2022లో పెద్దపులి సంచరించింది. ప్రస్తుతం మరో రెండేళ్ల తర్వాత తాజాగా మరోసారి పెద్దపులి జిల్లాలోకి ప్రవేశించి పాండవుల గుట్టకు చేరుకునే దిశగా తన ప్రయాణం సాగిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు అనుమానించి అప్రమత్తమయ్యారు.
అప్రమత్తమైన అధికారులు
పెద్దపులి సంచారం జిల్లాలోకి ప్రవేశించడంతో అటవీశాఖ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. అడవిని ఆనుకొని ఉన్న ములుగు జిల్లా సరిహద్దు గుండాల, ఆళ్లపల్లి మండలాలకు పెద్దపులి చేరుకుందన్న ప్రచారం జరగడంతో జాడ కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఇల్లెందు మండలం కొమరారం అటవీరేంజ్ పరిధిలో కూడా గాలింపు చేపట్టారు. ఆళ్లపల్లి మండలంతోపాటు అడవికి సరిహద్దున ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో పాదముద్రలను పరిశీలిస్తున్నారు. పలు చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిఘా పెంచారు. కాగా ఉన్నతాధికారుల ఆదేశాలతో ములుగు జిల్లాకు సరిహద్దున ఉన్న అటవీ ప్రాంతంలో గాలింపు, పాదముద్రల పరిశీలన చేపడుతున్నట్లు కొమరారం రేంజ్ అధికారి ఉదయ్ తెలిపారు. పాండవుల గుట్ట, ఏడు బావుల ప్రాంతంలో నిఘా పెంచామని వివరించారు.
కిన్నెరసాని అభయారణ్యంలోకి ప్రవేశించిందా..?
గుండాల: మూడు, నాలుగేళ్లుగా జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో పులి సంచరిస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చలికాలంలో జాతీయ జంతువు అడుగుజాడలు కనిపిస్తుండగా, ఏజెన్సీ గ్రామాల్లో ప్రజలకు కంటిమీద కునుకు ఉండటంలేదు. మళ్లీ పులి వచ్చిందని అటవీశాఖ అధికారులు చెబుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో పులి వచ్చినట్లు ప్రచారం సాగుతుండటంతో ప్రజలు వణికి పోతున్నారు. మూడు రోజులపాటు ములుగు జిల్లాలో సంచరించిన పులి మంగపేట, మల్లూరు అటవీ ప్రాంతాల నుంచి సరిహద్దు దాటి జిల్లాలోకి అడుగుపెట్టిందనే సమాచారం అటవీశాఖ అధికారులకు అందింది.
దీంతో గుండాల, ఆళ్లపలి, రేగళ్ల, కాచనపల్లి ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. గురువారం తెల్లవారు జామున మల్లూరు గుట్టవైపు వెళ్లిందని పేర్కొంటున్నారు. దామరతోగు, రేగళ్ల, మర్కోడు, అడవిరామారం, కొమరారం అటవీ ప్రాంతాల్లోని నీటి కొలను, దారి మార్గాల్లో పులి అడుగుజాడలను గుర్తించే పనిలో ఉన్నారు. అడవుల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. పశువుల కాపరులు అడవులకు వెళ్లొద్దని, వ్యవసాయ పనులకు వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. తాడ్వాయి అడవి దాటిన పెద్దపులి దామరతోగు, రేగళ్ల, అడవిరామారం అడవి మార్గంలోని కిన్నెరసాని అభయారణ్యంలోకి ప్రవేశించవచ్చని భావిస్తున్నారు. ఎక్కడ ఏం జరుగుతుందోనని గిరిజన గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment