దండుపాళ్యం ముఠా తరహాలోనే..
వృద్ధుల వద్ద దోపిడీకి ఆరు నెలలుగా పథకం
మచ్చిక చేసుకుని దంపతులనుహతమార్చిన ముఠా
నేలకొండపల్లి హత్య కేసులోఎనిమిది మంది అరెస్ట్
వివరాలు వెల్లడించిన పోలీసు కమిషనర్ సునీల్‌దత్
ఖమ్మంక్రైం: కర్ణాటకలో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా తీసిన దండుపాళ్యం సినిమాలో మహిళలు, పురుషులు ఎనిమిది మంది ముఠాగా ఏర్పడతారు. బాగా డబ్బు ఉన్న ఒంటరి వృద్ధులు, మహిళలను ఎంచుకుని వారిని మహిళలు మాటల్లో పెడుతుండగా పురుషులు లోపలికి దూసుకొచ్చి ఇంట్లో ఉన్న వారిని హతమార్చి బంగారం, డబ్బు దోచుకెళ్తుంటారు. ఈ సినిమాను చూసి స్ఫూర్తి పొందారో ఏమో కానీ నేలకొండపల్లిలో గతనెల 26వ తేదీన వృద్ధ దంపతులు ఎర్ర వెంకటరమణ, కృష్ణకుమారిని ఇదే తరహాలో ఓ ముఠా హతమార్చింది.
వీరెవరికీ పరిచయం లేకపోగా ఒకరి నుంచి ఒకరు కలుస్తూ ముఠాగా ఏర్పడి దోపిడీకి పథకం పన్నారు. కానీ దంపతులు ముందు జాగ్రత్తగా ఇంట్లో పెద్దగా నగదు, ఆభరణాలు ఉంచకపోవడంతో ముఠాకు నిరాశ ఎదురైనా ఇద్దరిని హతమార్చగా... బృందాలుగా ఏర్పడిన పోలీసులు ఫోన్ కాల్‌డేటా ఆధారంగా అరెస్ట్ చేశారు. ఈమేరకు నిందితుల వివరాలను పోలీసు కమిషనర్ సునీల్‌దత్ శుక్రవారం వెల్లడించారు.
జీవిత ఖైదు.. పెరోల్‌పై బయటకు
ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం ముగూలూరుకు చెందిన షేక్ ఆబిద్ అలియాస్ అబియాద్ అలీ 2011 ఏడాదిలో ఒకరిని హత్య చేసి బంగారం, డబ్బు ఎత్తుకెళ్లాడు. ఈకేసులో జీవిత ఖైదు శిక్ష పడింది. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తూ పెరోల్‌పై బయటకు వచ్చిన ఆబిద్ మళ్లీ జైలుకు వెళ్లకుండా తిరుగుతున్నాడు. అనంతరం కోదాడలో గది అద్దెకు తీసుకుని సోహైల్‌గా పేరు మార్చుకుని అప్పుడప్పుడు కూలీకి వెళ్తుండేవాడు. ఆయన ఇంటి ఎదురుగా ఉన్న భర్త లేని షేక్ హుస్సేన్‌బీతో పరిచయం పెంచుకోగా అది వివాహేతర సంబంధానికి దారి తీసింది.
ఆపై చిలుకూరు మండలం నారాయణపురానికి చెందిన చిట్టిప్రోలు సురేష్(గే)తో మరోపేరుతో పరిచయం చేసుకుని ఆయనతోనూ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అనంతరం హైదరాబాద్‌లో ట్యాక్సీ నడిపే జగ్గయ్యపేటకు చెందిన స్నేహితుడు ఫరీద్ అహ్మద్ ద్వారా ఖమ్మంలో అబిద్ గది అద్దెకు తీసుకున్నాడు. కాగా, ఆబిద్‌తో వివాహేతర సంబంధం సాగిస్తున్న హుస్సేన్‌బీ ద్వారా నేలకొండపల్లి మండలం బుద్దారానికి చెందిన జమాల్‌బీ, ఆమెతో పైనంపల్లికి చెందిన షేక్ షబానా పరిచయమైంది. కాగా, షబానా ప్రస్తుతం అనంతగిరి మండలం తమ్మరబండపాలెంలో ఉంటోంది. ఆమెతో కూడా ఆబిద్ వివాహేతర సంబంధం ఏర్పర్చుకున్నాడు.
హత్యకు పథకం సిద్ధమైంది ఇలా...
ఒకేసారి రూ.లక్షలు సంపాదిస్తే విలాసవంతంగా జీవనం గడపొచ్చని, అందుకు దోపిడీ సరైన మార్గమని షబానాకు ఆబిద్ చెప్పగా ఆమె తన మేనత్త జమాల్‌బీకి చెబితే ఆమె సైతం అంగీకరించింది. అయితే, ధనవంతులై ఒంటరిగా ఉండే వారి వివరాలు చెప్పాలని కోరగా ఆమె ఆరు నెలల క్రితం నేలకొండపల్లిలోని కొత్తకొత్తూరుకు చెందిన రేషన్ బియ్యం వ్యాపారం చేసే వెంకటరమణ పేరు సూచించింది. వృద్ధుడైన ఆయన భార్యతో ఉంటాడని, దోపిడీ చేయడం సులువని చెప్పింది. అనంతరం కోదాడలో ఉన్న హుస్సేన్‌బీ, గే అయిన సురేష్‌ను పిలిపించి వారినీ ఒప్పించాడు. ఆపై ఖమ్మంలో సెల్‌ఫోన్ సిమ్‌లు విక్రయించే మణికంఠతో పరిచయం పెంచుకుని డబ్బు ఆశ చూపి ఎలాంటి ఆధారాలు లేకుండా 10 సిమ్ కార్డులు, ఇంకో చోట ద్విచక్రవాహనం కొనుగోలు చేశాడు.
అయితే, ఇంకో వాహనం నంబర్ ప్లేట్ చోరీ చేసి తాను కొన్న వాహనానికి అమర్చాడు. ఇంతలోనే నేలకొండపల్లి లోని వెంకటరమణ ఇంట్లో ఓ పోర్షన్ ఖాళీగా ఉండగా సురేష్‌ను పంపించగా ఆయన తన కుటుంబం మూడు నెలల తర్వాత వస్తుందని చెప్పినా వెంకటరమణ అద్దెకు ఇవ్వలేదు. ఆతర్వాత హుస్సేనీబీ, షబానాను పంపగా వారికి ఇల్లు అద్దెకు ఇచ్చాడు. ఆతర్వాత మణికంఠ వద్ద మరో ఐదు సిమ్‌లను తీసుకోగా.. హుస్సేన్‌బీ, షబానాలు వెంకటరమణ, కృష్ణ కుమారితో పరిచయం పెంచుకుని తరచూ వారి ఇంట్లో టీవీ చూస్తూ భోజనం చేసేవారు. వృద్ధ దంపతుల వద్ద భారీగా బంగారం, డబ్బు ఉందనే భావనతో నవంబర్ 25వ తేదీన రాత్రి అబిద్, సురేష్‌లు షబానా, హుస్సేన్‌బీ ఉంటున్న పోర్షన్‌లోకి ప్రవేశించారు.
కానీ ఆరోజు హత్య చేయడం కుదరలేదు. మరుసటి రోజు 26వ తేదీన రాత్రి వెంకటరమణ ఇంట్లోకి వెళ్లిన షబానా, హుస్సేన్‌బీ టీవీ చూస్తూ కృష్ణకుమారితో మాటలు కలిపారు. ఆపై అబీద్, సురేష్ ఇంట్లోకి జొరబడి షబానా, హుస్సేన్‌బీ సహకారంతో కృష్ణకుమారి గొంతు పిసికి హత్య చేశారు. ఆతర్వాత ఆమె ఒంటిపై ఎనిమిది తులాల బంగారు ఆభరణాలు దొంగిలించారు. అనంతరం ఇంట్లో బంగారు, డబ్బుకోసం వెతుకుతుండగా శబ్దానికి నిద్ర లేచిన వెంకటరమణ పక్క గది నుంచి రావడంతో ఆయననూ హత్య చేశారు.
ఇలా చిక్కారు...
దంపతుల హత్య కేసును ఛేదించేందుకు పోలీసు కమిషనర్ సునీల్‌దత్ ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి ఆధ్వర్యాన 45 మంది సిబ్బందితో ఐదు బృందాలను నియమించారు. దీంతో వారు అన్ని కోణాల్లో పరిశీలిస్తూ అనుమానం ఉన్న ప్రతీ ఒక్కరిని విచారించారు. మృతుడు వెంకటరమణకు ఫోన్ చేసిన వారి నంబర్ల ఆధారంగా 15 సిమ్‌ల కాల్‌డేటా వెలికితీశారు. దీంతో ఆబిద్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా విషయం బయటపడింది.
ఈమేరకు ఎనిమిది మందిని అరెస్ట్ చేసి ఎనిమిది తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా, కేసు విచారణలో కీలకంగా వ్యవహరించిన ఉద్యోగులను సీపీ అభినందించి రివార్డులు ప్రకటించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ ఇంటి అద్దె కోసం వచ్చే వారి పూర్తి వివరాలు తెలుసుకోవాలని, అనుమానం ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కాగా, ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతోందని తెలి పారు. ఈసమావేశంలో ఏసీపీ తిరుపతిరెడ్డి, కూసుమంచి సీఐ సంజీవ్, ఎస్‌ఐలు జగదీష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
రాత్రంతా అక్కడే..
దంపతులను హత్య చేశాక బయటకు వెళ్తే పోలీసులకు పట్టుబడతామని భావించి నిందితులంతా ఇంట్లోనే గడిపారు. డాగ్ స్క్వాడ్‌కు వాసన పసిగట్టకుండా ఇంటి చుట్టూ, మృతదేహాల వద్ద కారం పొడి చల్లాడు. ఇక 27న తెల్లవారుజామున అబీద్ బైక్‌పై హుస్సేన్‌బీ, షబానాను తీసుకెళ్లి ఆటోలో ఖమ్మం పంపించాడు. అనంతరం సురేష్‌కు బంగారంలో కొంత, నగదు కొంత ఇచ్చి కోదాడకు పంపాడు. ఆతర్వాత ఖమ్మం వెళ్లిన అబీద్ పాత బస్టాండ్ వద్ద హుస్సేన్‌బీ, షబానాతొ ఖమ్మంలో తాను ఉండే గదికి వెళ్లాడు.
రెండు రోజుల పాటు కూడా వారు నేలకొండపల్లి కి వచ్చివెళ్తూ ఏం జరుగుతుందో తెలుసుకున్నాడు. ఆపై ఉన్న బంగారాన్ని అమ్మితే వాటా ఇస్తానని హైదరాబాద్‌లో ఉన్న స్నేహితుడైన ఫరీద్‌కు చెప్పాడు. దీంతో ఆయన ఖమ్మంలోని స్టోన్‌క్రషర్‌లో పనిచేసే విజయ్‌నగర్‌కాలనీకి చెందిన అనుమోల అనిల్‌కుమార్‌ని పరిచయం చేయడంతో ఆయనకు వాటా ఇస్తామని నమ్మబలికి బంగారం అమ్మాలని అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment