నేలకొండపల్లి హత్యల కేసులో కీలకంగా కాల్ రికార్డ్
చెత్తకుప్పలో దొరికిన సెల్‌ఫోన్ ఆధారంగా విచారణ
నేలకొండపల్లి: నేలకొండపల్లిలో గత మంగళవారం రాత్రి దంపతులు ఎర్రా వెంకటరమణ – కృష్ణకుమారి హత్యకు గురైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపగా.. ప్రత్యేక పోలీసు బృందాల విచారణ కొనసాగుతోంది. అయితే, ఇప్పటివరకు మిస్టరీ వీడకపోగా శుక్రవారం కీలక ఆధారంగా భావిస్తున్న సెల్‌ఫోన్ పోలీసుల చేతికి చిక్కినట్లు సమాచారం. ఈ ఫోన్ కాల్ డేటాతో పాటు ఫోన్ లభించిన ప్రాంతానికి సమీపాన ఉన్న షాపు నుంచి సీసీ కెమెరాల పుటేజీ సేకరించడంతో దర్యాప్తులో అడుగు ముందుకు పడినట్లు భావిస్తున్నారు.
చెత్త కుప్పలో ఫోన్
నేలకొండపల్లిలో పెట్రోల్ బంక్ ఎదురుగా గ్రామపంచాయతీ స్వీపర్ శుక్రవారం ఉదయం చెత్త తొలగిస్తుండగా ఓ చోట సెల్‌ఫోన్ లభించింది. దీంతో ఆమె స్థానిక పోలీసులకు అప్పగించింది. ఈ విషయం తెలియగానే ప్రత్యేక బృందాలు సైతం సదరు స్వీపర్ ఇంటికి సైతం వెళ్లి విచారించారు. అంతేకాక సెల్‌ఫోన్ దొరికిన ప్రాంతంలో ఓ దుకాణం నుంచి సీసీ కెమెరాల పుటేజీ కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఆ ఫోన్ నిందితులు పారిపోయే క్రమంలో కింద పడిందా, లేక మృతుల ఫోన్‌ను తీసుకెళ్లే క్రమాన వదిలేశారా అనే విషయాన్ని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తుండగా స్పష్టత ఇవ్వడం లేదు. హంతకుల ఫోన్ అయితే హత్య జరిగిన రోజే లభించేదని, రెండు రోజుల తర్వాత దొరకడంతో నిందితులు మళ్లీ ఇక్కడకు వచ్చి, వెళ్లారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈనేపథ్యాన సెల్‌ఫోన్ కాల్‌డేటా, సీపీ కెమెరాల పుటేజీ ఆధారంగా దర్యాప్తులో వేగం పెంచినట్లు పోలీసువర్గాల ద్వారా తెలిసింది.
ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి, కూసుమంచి సీఐ సంజీవ్‌తో పాటు వివిధ పోలీస్‌స్టేషన్ల ఎస్సైలు శుక్రవారం సైతం మండల కేంద్రంలో పర్యటించి పలువురు అనుమానితులను విచారించినట్లు సమాచారం. ఈ విషయమై పోలీసులను వివరణ కోరగా సెల్‌ఫోన్ దొరికిన మాట వాస్తవమేనని చెప్పినా ఇతర వివరాలు వెల్లడించేందుకు మాత్రం నిరాకరించారు.
Comments
Please login to add a commentAdd a comment