యశ్వంత్ (ఫైల్), యశ్వంత్ మృతదేహంతో రోదిస్తున్న తల్లి
నీటి సంప్‌లో పడి చిన్నారి మృతి
కన్నీరుమున్నీరుగా విలపించిన కుటుంబీకులు
ఖమ్మం: ఆడుకుంటూ వెళ్లి ఇంటి ఆవరణలోని నీటి సంప్‌లో ప్రమాదవశాత్తు పడిన చిన్నారి మృతి చెందాడు. వైరా మండలం కనకగిరి సిరిపురంలో సోమవారం రాత్రి వెలుగుచూసిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. కనకగిరి సిరిపురం గ్రామానికి చెందిన కూరకుల గోపి – భవాని దంపతులకు నాలుగేళ్ల కుమారుడు మణికంఠతో పాటు 16నెలల కుమారుడు యశ్వంత్ ఉన్నారు.
గోపి ఆటోడ్రైవర్‌గా పని చేస్తుండగా కుటుంబ పోషణలో పాలుపంచుకునేందుకు భవాని వారం క్రితమే వైరాలోని ఒక బట్టల దుకాణంలో చేరింది. వీరిద్దరు పనులకు వెళ్తే పిల్ల లను చూసుకునేందుకకు నెమలి గ్రామానికి చెందిన భవాని తల్లి భద్రమ్మ వచ్చింది. రోజులాగే గోపి, భవానీ పనులకు వెళ్లగా భద్రమ్మ తన ఇద్దరు మనవళ్లు మణికంఠ, యశ్వంత్ ఆడుకుంటుండగా ఇంట్లో నిద్రించింది. ఆ సమయాన యశ్వంత్ ఇంటి ఆవరణలో ఆడుకుంటూ ప్రమాదశాత్తు ఇంటి ముందు ఉన్న నీటి సంప్‌లో పడినట్లు తెలుస్తోంది.
కాసేపయ్యాక భద్రమ్మ మనవడు యశ్వంత్ కోసం ఎక్కడ వెతికినా ఆచూకీ లేకపోవడంతో తన కుమార్తె, అల్లుడికి సమాచారం ఇచ్చింది. వారు చేరుకుని పరిసర ప్రాంతాలు, ఇంట్లో గాలిస్తుండగా యశ్వంత్ మృతిదేహం నీటి సంప్‌లో తేలియడుతూ కనిపించింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పనికి వెళ్లి రాగానే తనను ఎదురొచ్చే కుమారుడు విగతజీవిగా మారడంతో భవానీ ‘అమ్మ వచ్చింది లేరా.. కన్నా’ అంటూ విలపించిన తీరు స్థానికులను సైతం కంటతడి పెట్టించింది.
Comments
Please login to add a commentAdd a comment