అవమాన భారంతో వ్యక్తి ఆత్మహత్య
సత్తుపల్లిరూరల్: ఓ వ్యక్తి తన స్నేహితుడి ఫోన్ నుంచి మహిళకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడాడు. సదరు మహిళ భర్త, బంధువులు పంచాయితీ నిర్వహించి ఫోన్ యజమానిపై దాడి చేశారు. తీవ్ర మనస్తాపానికి గురైన ఫోన్ యజమాని పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఈ ఘటన మండంలోని రేగళ్లపాడులో ఆదివారం చోటుచేసుకుంది. మృతుడి భార్య నాగుర్‌బీ కథనం ప్రకారం.. మండలంలోని రేగళ్లపాడు గ్రామంలో కిరణాషాపు నిర్వహిస్తున్న పాషా (32)కు యాతాలకుంటకు చెందిన ధనికుల కాసుబాబు స్నేహితుడు. అయితే పాషా ఫోన్ నుంచి కాసుబాబు.. యాతాలకుంటకు చెందిన ఓ గిరిజన వివాహితకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడాడు. దీంతో ఆమె భర్త, కుటుంబ సభ్యులందరూ కలిసి పాషా ఫోన్ నుంచే కాల్‌రావటంతో పంచాయితీ పెట్టి పాషాపై చేయి చేసుకున్నారు. దీంతో మనస్తాపానికి గురైన పాషా శనివారం రాత్రి పురుగుమందు సేవించాడు.
ఆయన్ను ఖమ్మం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఆదివారం సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రిలో పాషా మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. మృతుడి భార్య నాగూర్‌బీ ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి ఒక కుమారుడు ఉన్నారు. కాసుబాబు పరారీలో ఉన్నాడు. కాగా పాషాపై దాడిచేసిన జవ్వాజి రాము, రాజు, సుమలత, సున్నం నాగరాజు, జవ్వాజి చిన్నారాజు, ఏడుకొండలుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment