వాహనం పాతది.. ఆలోచన కొత్తది !
బైక్‌కు బ్యాటరీ అమర్చిన యువకుడు
రెండు గంటల చార్జింగ్‌తో 80 కిలోమీటర్లు..
కరకగూడెం: పట్టుదల, అంకితభావం ఉంటే ఏదైనా సాధ్యమేనని నిరూపించాడు ఈ యువకుడు. మండలంలోని భట్టుపల్లి గ్రామానికి చెందిన మిట్టపల్లి మోహంత్ బీటెక్ ఈఈఈ చేశాడు. సరైన అవకాశాలు రాక కరకగూడెంలో బైక్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో పక్కన పడేసిన తన ద్విచక్ర వాహనాన్ని బ్యాటరీతో నడిపించాలనే ఆలోచన వచ్చింది. వెంటనే చైన్నెలోని తన ఇంజనీరింగ్ మిత్రుడిని ఫోన్ ద్వారా సంప్రదించాడు.
అతడి సూచన మేరకు రూ.25వేలు వెచ్చించి విద్యుత్ మోటార్, బ్యాటరీ తదితర వస్తువులు కొనుగోలు చేశాడు. తనకున్న పరిజ్ఞానంతో వారం రోజులు కష్టపడి వాహనం బ్యాటరీతో నడిచేలా చేశాడు. రెండు గంటల పాటు చార్జింగ్ పెడితే 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని ఈ సందర్భంగా మోహంత్ చెప్పాడు. ప్రభుత్వం సహకారం అందిస్తే ఇంకా మరిన్ని ఆవిష్కరణలు చేయగలనని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలు విరివిగా లభిస్తున్నా వాటి ధర సామాన్యులకు అందుబాటులో లేదని, ఇలాంటి తరుణంలో తమ లాంటి యువతను ప్రభుత్వం గుర్తిస్తే వాహనదారులకు మేలు జరుగుతుందని ఆయన తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment