Seetarama project
-
ప్రాజెక్ట్‌లపై బీఆర్ఎస్ నేతలవి బోగస్ మాటలు: సీఎం రేవంత్
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను రైతాంగానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంకితం చేశారు. రెండో పంప్ హౌస్ వద్ద పైలాన్ ఆవిష్కరించిన సీఎం రేవంత్.. అనంతరం స్విచ్ ఆన్ చేశారు.కాగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలం పూసగూడెంలో సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను సీఎం రేవంత్.. రైతాంగానికి అంకితం చేశారు. రెండో పంప్ హౌస్ స్విచ్ ఆన్ చేసి గోదావరి జలాలను దిగువకు విడుదల చేశారు. ఈ క్రమంలో గోదావరి జలాలకు సీఎం రేవంత్ ప్రత్యేక పూజలు చేశారు. దీంతో, కాలువలోకి గోదావరి జలాలను విడుదల చేశారు. ఇక, సీతారామ ప్రాజెక్ట్ ద్వారా కృష్ణా నదిలో గోదావరి నీరు కలవనుంది. ఈ క్రమంలో కృష్ణా నది చివరి పొలాలకు సీతారామ ప్రాజెక్ట్ ద్వారా సాగునీరు అందుతుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస్ హాజరయ్యారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రాజెక్ట్ పూర్తికి సహకరిస్తున్నాం. ఇది మా విశ్వసనీయతకు గుర్తింపు. ప్రాజెక్ట్‌ల మీద సమగ్రంగా చర్చించాం. నల్లగొండ జిల్లాలో చాలా ప్రాజెక్ట్‌లు అసంపూర్తిగా ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్ట్‌ల రీడిజైన్ పేరుతో వేల కోట్లు దండుకున్నారు. కేసీఆర్, హరీష్ రావు బోగస్ మాటలు చెప్పారు. ప్రాజెక్ట్‌లను పూర్తి చేయాలని కేసీఆర్ ఎప్పుడూ అనుకోలేదు. దోపిడీ బయటపడుతుందని బీఆర్ఎస్ దేనికీ డీపీఆర్‌లు ఇవ్వలేదు. మా శ్రమను హరీష్ రావు చులకన చేసి మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. నాలుగేళ్లుగా సీతారామ పంపులను ఆన్ చేయలేదు. మేం నీళ్లు చల్లుకోలేదు.. గోదారమ్మ మా మీద నీళ్లు చల్లింది. గత పదేళ్లలో రూ.లక్షా 80వేల కోట్లు ఖర్చు చేసినా రైతులకు మాత్రం నీళ్లు ఇవ్వలేకపోయారు. ఖమ్మం అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది.ఇక, మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. నా కల సాకారం చేసినందుకు సీఎం రేవంత్‌కు ధన్యవాదాలు. గత ప్రభుత్వం సీతారామా ప్రాజెక్ట్‌ను నిర్లక్ష్యం చేసిందన్నారు. -
కష్టపడింది కేసీఆర్.. క్రెడిట్ కాంగ్రెస్‌ది: హరీష్‌రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్‌పై సెటైరికల్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. సీతారామ ప్రాజెక్టును కేసీఆర్ నిర్మిస్తూ.. కాంగ్రెస్ క్రెడిట్ కొట్టేయాలని చూస్తోందన్నారు. రిబ్బన్ కటింగ్ అవకాశం వచ్చిందని.. ప్రాజెక్టును తామే కట్టినట్లు కలరింగ్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు.కాగా, హరీష్ రావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఖమ్మంలోని సీతారామ ప్రాజెక్టు ప్రారంభం కోసం కాంగ్రెస్ నేతలు తెగ హడావుడి చేస్తున్నారు. రోజుకో మంత్రి వెళ్లి ప్రాజెక్టు సందర్శనలు చేస్తున్నారన్నారు. అసలు ఆ ప్రాజెక్ట్‌ను నిర్మించింది కేసీఆర్. ఆయన నిర్మించిన ప్రాజెక్ట్‌కు కాంగ్రెస్ క్రెడిట్ కొట్టేయాలని చూస్తోంది. ప్రాజెక్ట్‌ను కాంగ్రెస్ పార్టీనే నిర్మించినట్టు ఫుల్ కలరింగ్ ఇస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో మేము చేసిన అభివృద్ధిని తాము చేసినట్టు చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు.రాష్ట్రంలో ప్రభుత్వం మారింది కాబట్టి.. బీఆర్ఎస్ నిర్మించిన ప్రాజెక్ట్‌ను రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. ఆనాడు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ప్రాజెక్ట్‌ను కట్టింది కేసీఆర్ అని చెప్పారు. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ కట్టిందని చెబుతున్నారు. పబ్లిసిటీ కోసం మాత్రమే ఈ ప్రభుత్వం చేస్తుందని మండిపడ్డారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలను నెరవేర్చండి అంటూ హితవు పలికారు. -
సీతారామ ప్రాజెక్టుతో ఆగస్టు నాటికి సాగునీరు అందించాలి : మంత్రి తుమ్మల
ఖమ్మం: సీతారామ ప్రాజెక్టు ద్వారా వచ్చే ఆగస్టు నాటికి సాగునీరు అందించాలని వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. దమ్మపేట మండలం గండుగులపల్లిలోని సీతా రామ లిఫ్ట్ పనులను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వేసవి కాలంలో మట్టి పనులు పూర్తి చేయాలని, మిగిలిన పనులు వర్షాకాలంలో చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ఇతర ప్రాంతాల్లో కూడా కాల్వలు తవ్వే పనులు వేసవికి ముందే పూర్తి చేయాలన్నారు. ఈ క్రమంలో రహదారులు, రైల్వే లైన్లు, అటవీ భూములు, పోడు భూములు, గిరిజనుల సాగులో ఉన్న అటవీ భూముల వంటివి ఏవి ఉన్నా నిర్వాసితులకు పరిహారం కోసం ఉమ్మడి జిల్లాల కలెక్టర్లను సంప్రదించాలని చెప్పారు. కేంద్రం లేదా రాష్ట్రంలో ఏ ప్రభుత్వ శాఖ అనుమతి కావాలన్నా తనను కలవాలని, సంబంధిత మంత్రిత్వ శాఖతో చర్చించి సకాలంలో సాధిస్తానని భరోసా ఇచ్చారు. అనంత రం మ్యాప్ ద్వారా అధికారులు పనుల పురోగతిని వివరించారు. టన్నెళ్ల నిర్మాణంలో జాప్యం జరుగుతోందని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించే ఏజన్సీ లను సంప్రదించాలని ఈ సందర్భంగా మంత్రి అధికారులకు సూచించారు. రూ.7,500 కోట్లు వెచ్చించినా ఇంకా పనుల్లో జాప్యం తగదన్నారు. ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ఏం చేయాలో ఆలోచించి ముందుకు సాగాలని సూచించారు. ఆధునిక సాంకేతికతతో టన్నెళ్ల నిర్మాణం, జెన్కో టెండర్లు, పంపుల నిర్మా ణం వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ ఏడాది 1.50 లక్షల ఎకరాలకు నీరు.. సీతారామ ప్రాజెక్టు ద్వారా ఈ ఏడాది 1.50 లక్షల ఎకరాలకు, వచ్చే ఏడాది మరో 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని మంత్రి తుమ్మల వివరించారు. ప్రాజెక్టు పరిశీలన అనంతరం ఆయన అక్కడే విలేకరులతో మాట్లాడారు. గోదావరి నది పోలవరం ప్రాజెక్టు వద్ద ఉన్న ఫుల్ రిజర్వాయర్ లెవల్‌కు సమానంగా ప్రాజెక్టు ఎత్తును నిర్వహించడం ద్వారా ఎంత పెద్ద ఉప్పెన వచ్చినా తెలంగాణలో ముంపు ఏర్పడదని అధికారులు చెప్పారు. అనంతరం ఖమ్మం ఔటర్ రింగ్ రోడ్ ప్రతిపాదనలను అఽధికారులు మంత్రి దృష్టికి తీసుకురాగా కొత్త కలెక్టరేట్‌కు ఇబ్బంది కాకుండా, మరెవరికీ ఆటంకం కలుగకుండా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. దమ్మపేట మండలం పూసుకుంట గ్రామంలో కొండరెడ్లు 80 ఏళ్ల క్రితం నుంచి ఉంటున్నారని.. వారు అంతరించిపోతున్న తెగగా గుర్తించబడ్డారని.. వారికి రవాణా సౌకర్యం కోసం గతంలోనే తాను రూ.30 కోట్ల ఎల్‌డబ్ల్యూఈ నిధులను మంజూరు చేశానని కలెక్టర్ ప్రియాంక ఆలకు గుర్తు చేశారు. సంబంధిత అధికారులతో చర్చించి ఆ నిధులు వెనక్కు మళ్లకుండా వారికి రహదారి సౌకర్యం కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఖమ్మం కలెక్టర్ వీ.పీ.గౌతమ్, స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సీఈ ఎ. శ్రీనివాసరెడ్డి, ఎస్ఈలు ఎస్. శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, అశ్వారావుపేట ఈఈ సురేష్‌కుమార్, డీఈఈ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: TS గవర్నమెంట్ కీలక నిర్ణయం! ఉపాధ్యాయుల్లో ఆందోళన.. -
వచ్చే ఖరీఫ్‌కు ‘సీతారామ’ నీరు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి సాగునీరు అందిస్తామని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. డిసెంబర్లో ట్రయల్ రన్ నిర్వహిస్తామని, ఇందుకు అవసరమైన నిర్మాణ పనులను వేగవంతం చేస్తామన్నారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు పంప్‌హౌస్ నిర్మాణ పనులను నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రట రీ రజత్‌కుమార్, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ మురళీధర్, ప్రభుత్వ సాగు నీటి రంగ సలహాదారు పెంటారెడ్డితో కలసి ఆయన పరిశీలించారు. ములకలపల్లి మండలం రామవరం పంప్‌హౌస్ వద్ద సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. సీతారామ ప్రాజెక్టు నిర్మాణ పనులను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేస్తామని చెప్పారు. ఇప్పటికే ప్యాకేజీల వారీగా పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. డిసెంబర్ నెలాఖరు నాటికి పంప్‌హౌస్–2 పనులు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 6 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించబడుతోందని, అలాగే.. నల్లగొండ జిల్లాకు కూడా నీరందుతోందని వివరించారు. మైనర్ ఇరిగేషన్ ద్వారా అదనంగా 2 లక్షల ఎకరాలు సాగవుతాయని పేర్కొన్నారు. సీతమ్మసాగర్ బ్యారేజీ నిర్మాణం కోసం భూసేకరణ ప్రారంభమైందని, టెండర్లు సైతం ఖరారయ్యాయని చెప్పారు. త్వరలో సీఎం కేసీఆర్ నిర్మాణ పనులను ప్రారంభిస్తారని తెలిపారు. నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్‌కుమార్ మాట్లాడుతూ.. పంప్‌హౌస్–1, 2 నిర్మాణాలకు సంబంధించిన యంత్ర సామగ్రి సిద్ధంగా ఉందని, ఇక నిర్మాణ పనులను వేగవంతం చేస్తామన్నారు. నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ప్యాకేజీల వారీగా పనులు పూర్తి చేస్తామన్నారు. అయితే.. 8వ ప్యాకేజీలో కొంత భూసేకరణ పూర్తి కావాల్సి ఉందన్నారు. ఈ విషయమై రైతులతో చర్చలు జరుపుతున్నామని, భూసేకరణపై పూర్తిగా దృష్టి సారించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు. దాదాపు 104 కిలోమీటర్ల పరిధిలో సీతారామ ప్రాజెక్టు కాల్వలు నిర్మాణం జరుగుతున్న తీరును ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించినట్లు ఆయన వివరించారు. -
'సన్న సీఎంని కాబట్టి.. సన్నబియ్యం ఇస్తున్నా'
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనపై తానే సెటైర్ వేసుకున్నారు. తాను 'సన్న ముఖ్యమంత్రిని కాబట్టి.. హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యం ఇస్తున్నా' అంటూ నవ్వులు పూయించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం హాస్టళ్లలో సన్నబియ్యం ఇస్తున్న విషయం పీడీఎస్‌యూ వాళ్లకు తెలియదా? అని నవ్వుతూ చురుకలు అంటించారు. చిల్లర రాజకీయాలు చేసేవాళ్లు పద్ధతి మార్చుకోవాలని హితవు పలకారు. సీతారామ ప్రాజెక్ట్ ద్వారా 24 మండలాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రాజెక్ట్ నిర్వాసితులను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. నాలుగేళ్లలో సాగునీటి రంగానికి రూ. లక్ష 25వేల కోట్ల రూపాయల ఖర్చు చేస్తామని కేసీఆర్ వెల్లడించారు.