సాక్షి ప్రతినిధి, ఖమ్మం: వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి సాగునీరు అందిస్తామని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. డిసెంబర్‌లో ట్రయల్ రన్ నిర్వహిస్తామని, ఇందుకు అవసరమైన నిర్మాణ పనులను వేగవంతం చేస్తామన్నారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు పంప్‌హౌస్ నిర్మాణ పనులను నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రట రీ రజత్‌కుమార్, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ మురళీధర్, ప్రభుత్వ సాగు నీటి రంగ సలహాదారు పెంటారెడ్డితో కలసి ఆయన పరిశీలించారు.
ములకలపల్లి మండలం రామవరం పంప్‌హౌస్ వద్ద సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. సీతారామ ప్రాజెక్టు నిర్మాణ పనులను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేస్తామని చెప్పారు. ఇప్పటికే ప్యాకేజీల వారీగా పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. డిసెంబర్ నెలాఖరు నాటికి పంప్‌హౌస్–2 పనులు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 6 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించబడుతోందని, అలాగే.. నల్లగొండ జిల్లాకు కూడా నీరందుతోందని వివరించారు. మైనర్ ఇరిగేషన్ ద్వారా అదనంగా 2 లక్షల ఎకరాలు సాగవుతాయని పేర్కొన్నారు.
సీతమ్మసాగర్ బ్యారేజీ నిర్మాణం కోసం భూసేకరణ ప్రారంభమైందని, టెండర్లు సైతం ఖరారయ్యాయని చెప్పారు. త్వరలో సీఎం కేసీఆర్ నిర్మాణ పనులను ప్రారంభిస్తారని తెలిపారు. నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్‌కుమార్ మాట్లాడుతూ.. పంప్‌హౌస్–1, 2 నిర్మాణాలకు సంబంధించిన యంత్ర సామగ్రి సిద్ధంగా ఉందని, ఇక నిర్మాణ పనులను వేగవంతం చేస్తామన్నారు. నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ప్యాకేజీల వారీగా పనులు పూర్తి చేస్తామన్నారు. అయితే.. 8వ ప్యాకేజీలో కొంత భూసేకరణ పూర్తి కావాల్సి ఉందన్నారు. ఈ విషయమై రైతులతో చర్చలు జరుపుతున్నామని, భూసేకరణపై పూర్తిగా దృష్టి సారించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు. దాదాపు 104 కిలోమీటర్ల పరిధిలో సీతారామ ప్రాజెక్టు కాల్వలు నిర్మాణం జరుగుతున్న తీరును ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించినట్లు ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment