వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు వెల్లడి
కోహెడ మార్కెట్ నుంచి అంతర్జాతీయంగా పండ్ల ఎగుమతులు
గోదాములపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం మార్కెట్‌ను అంతర్జాతీయ ప్రమా ణాలతో ఆధునీకరించాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అధికారులను ఆదేశించారు. అలాగే కోహెడ మార్కెట్ నుంచి అంతర్జాతీయంగా పండ్ల ఎగుమతులు జరిగేలా అన్ని మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు. ఈ మేరకు మంత్రి శుక్రవారం వ్యవసాయ, మార్కెటింగ్, జౌళి శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యవసాయ, ఉద్యాన, సెరికల్చర్, జౌళి శాఖల్లో ఒకే రకమైన పనితీరు కలిగిన కార్పొరేషన్లను సంఘటితపరిచి ఒకే కార్పొరేషన్ ఏర్పాటుచేసి, వాటిని బలోపేతం చేసేందుకు ప్రతిపాదనలు తయారుచేసి త్వరలోనే ముఖ్యమంత్రి ఆమోదానికి పంపిస్తామని తెలిపారు.
అకాల వర్షాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు నష్టపోకుండా పంటల ఉత్పత్తులకు సంబంధించిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, బయోమాస్‌కు సంబంధించిన యూనిట్లను కూడా ప్రోత్సహించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. మార్కెటింగ్, గిడ్డంగుల సంస్థల గోదాములపై సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేయాలని, దీనికోసం విద్యుత్ అధికారులతో సంప్రదించి తగిన ఒప్పందాలు చేసుకోవాలన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు టెస్కో ద్వారా తప్పనిసరిగా వస్త్రాలను కొనుగోలు చేయాలని మంత్రి చెప్పారు.
ఈ ఆదేశాల ప్రకారం ఇప్పటివరకు వివిధ ప్రభుత్వ శాఖల నుంచి సుమారు రూ.255 కోట్ల విలువైన ఆర్డర్లు వచ్చాయన్నారు. ప్రతి సంవత్సరం బతుకమ్మ చీరలతో కలపి 5.70 కోట్ల మీటర్ల ఆర్డర్లు నేత కార్మికులకు వచ్చేవని, కానీ ఈ సంవత్సరం బతుకమ్మ చీరలు కాకుండానే 2.50 కోట్ల మీటర్ల ఆర్డర్లు వచ్చాయనీ, ఇంకా 80 లక్షల మీటర్ల ఆర్డర్లు రావాల్సి ఉందన్నారు. పవర్ లూమ్స్ పరిశ్రమకు విద్యుత్ సబ్సిడీ ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా అధికారులను మంత్రి కోరారు. సమావేశంలో పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, టీఎస్‌ఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, జౌళిశాఖ సంచాలకులు అలుగు వర్షిణి, ఉద్యాన సంచాలకులు అశోక్‌రెడ్డి, మార్కెటింగ్ శాఖ సంచాలకులు లక్ష్మీబాయి పాల్గొన్నారు.
మంత్రి తుమ్మలతో డీసీసీబీ చైర్మన్ల భేటీ
ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, వరంగల్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల డీసీసీబీ చైర్మన్లు శుక్రవారం సెక్రటేరియట్‌లో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా వారు ఆయా బ్యాంకుల స్థితిగతులు, ఆర్థిక విధానాలను వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment