Khammam Market
-
అంతర్జాతీయ ప్రమాణాలతో ఖమ్మం మార్కెట్ ఆధునీకరణ
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం మార్కెట్‌ను అంతర్జాతీయ ప్రమా ణాలతో ఆధునీకరించాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అధికారులను ఆదేశించారు. అలాగే కోహెడ మార్కెట్ నుంచి అంతర్జాతీయంగా పండ్ల ఎగుమతులు జరిగేలా అన్ని మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు. ఈ మేరకు మంత్రి శుక్రవారం వ్యవసాయ, మార్కెటింగ్, జౌళి శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యవసాయ, ఉద్యాన, సెరికల్చర్, జౌళి శాఖల్లో ఒకే రకమైన పనితీరు కలిగిన కార్పొరేషన్లను సంఘటితపరిచి ఒకే కార్పొరేషన్ ఏర్పాటుచేసి, వాటిని బలోపేతం చేసేందుకు ప్రతిపాదనలు తయారుచేసి త్వరలోనే ముఖ్యమంత్రి ఆమోదానికి పంపిస్తామని తెలిపారు.అకాల వర్షాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు నష్టపోకుండా పంటల ఉత్పత్తులకు సంబంధించిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, బయోమాస్‌కు సంబంధించిన యూనిట్లను కూడా ప్రోత్సహించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. మార్కెటింగ్, గిడ్డంగుల సంస్థల గోదాములపై సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేయాలని, దీనికోసం విద్యుత్ అధికారులతో సంప్రదించి తగిన ఒప్పందాలు చేసుకోవాలన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు టెస్కో ద్వారా తప్పనిసరిగా వస్త్రాలను కొనుగోలు చేయాలని మంత్రి చెప్పారు. ఈ ఆదేశాల ప్రకారం ఇప్పటివరకు వివిధ ప్రభుత్వ శాఖల నుంచి సుమారు రూ.255 కోట్ల విలువైన ఆర్డర్లు వచ్చాయన్నారు. ప్రతి సంవత్సరం బతుకమ్మ చీరలతో కలపి 5.70 కోట్ల మీటర్ల ఆర్డర్లు నేత కార్మికులకు వచ్చేవని, కానీ ఈ సంవత్సరం బతుకమ్మ చీరలు కాకుండానే 2.50 కోట్ల మీటర్ల ఆర్డర్లు వచ్చాయనీ, ఇంకా 80 లక్షల మీటర్ల ఆర్డర్లు రావాల్సి ఉందన్నారు. పవర్ లూమ్స్ పరిశ్రమకు విద్యుత్ సబ్సిడీ ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా అధికారులను మంత్రి కోరారు. సమావేశంలో పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, జౌళిశాఖ సంచాలకులు అలుగు వర్షిణి, ఉద్యాన సంచాలకులు అశోక్‌రెడ్డి, మార్కెటింగ్ శాఖ సంచాలకులు లక్ష్మీబాయి పాల్గొన్నారు.మంత్రి తుమ్మలతో డీసీసీబీ చైర్మన్ల భేటీ ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, వరంగల్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల డీసీసీబీ చైర్మన్లు శుక్రవారం సెక్రటేరియట్లో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా వారు ఆయా బ్యాంకుల స్థితిగతులు, ఆర్థిక విధానాలను వివరించారు. -
నిలిచిపోయిన మిర్చి పంట అమ్మకాలు
-
పత్తి బంగారం.. క్వింటాకు రూ.9,100.. ఏ మార్కెట్లో అంటే?
సాక్షి, ఖమ్మం వ్యవసాయం/మద్నూర్(జుక్కల్): ఖమ్మం, మద్నూరు మార్కెట్లలో గురువారం పత్తికి రికార్డు ధర పలికింది. ఖమ్మం వ్యవ సాయ మార్కెట్లో మంగళ, బుధవారాల్లో క్వింటా రూ.9 వేలుగా పలికిన ధర గురువారం రూ.9,100గా నమోదైంది. మోడల్ ధర రూ.9 వేలు, కనిష్ట ధర రూ.8వేలుగా నమోదైందని అధికారులు తెలిపారు. కాగా, కామారెడ్డి జిల్లా మద్నూర్ మార్కెట్లో పత్తి క్వింటాకు రూ.9,050 ధర లభించింది. చదవండి: ప్లాట్.. పాస్‘బుక్కయ్యి’.. ధరణి రూటు మారుస్తున్న రియల్టర్లు -
ఇదేం‘ధరో’!
ఖమ్మం వ్యవసాయం: ఏకమయ్యారు.. రైతన్నను దగా చేస్తున్నారు.. ఆరుగాలం శ్రమించి.. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని పండించిన పంటను మార్కెట్లో అమ్మకానికి తెస్తే.. నిలువు దోపిడీ చేస్తున్నారు.. కఠిన నిబంధనలు, పారదర్శకంగా మార్కెట్ నిర్వహణ అని ప్రభుత్వం చెబుతున్నా.. అవి మాటలు, కాగితాలకే పరిమితమయ్యాయి. వ్యాపారులు, కమీషన్ వ్యాపారులు, దడవాయిలు, కార్మికులు, మార్కెట్ ఉద్యోగులు సిండికేట్‌గా మారి మోసానికి ఒడిగడుతున్నారు. ఇది ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నిత్య తంతులా మారింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సరుకు అమ్మకానికి తెచ్చిన రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. రైతుల పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించడానికి కృషి చేయాల్సిన ఉద్యోగులు కక్కుర్తిపడి నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ప్రస్తుతం మిర్చికి ఉన్న ధర ప్రకారం కూడా కొనుగోళ్లు చేయకుండా సిండికేట్‌గా ఏర్పడి రైతులను దగా చేస్తున్నారు. ప్రస్తుతం మిర్చి క్వింటాల్ ధర రూ.9వేలకు పైగా ఉండగా.. ఖమ్మం మార్కెట్లో ఒకటి, రెండు లాట్లకు ఆ ధర పెడుతూ.. మిగిలిన లాట్లకు రూ.8వేలకు మించి ధర పెట్టడం లేదు. సరుకు నాణ్యత లేదని, తేమగా ఉందని పేర్కొంటూ రూ.6వేలకు కూడా కొనుగోలు చేస్తున్నారు. గురువారం రఘునాథపాలెం మండలం పడమటితండాకు చెందిన మహిళా రైతు మాలోత్ బుల్లెమ్మ 8 బస్తాల మిర్చిని విక్రయానికి తెచ్చింది. ఆ సరుకును కమీషన్దారు పలువురు ఖరీదుదారులకు చూపించారు. పీకేఆర్ పేరుతో ఉన్న ఖరీదుదారుడు క్వింటాల్‌కు రూ.8,700 ధర నిర్ణయించాడు. అదే ధర వస్తుందనుకున్న బుల్లెమ్మకు వ్యాపారి, కమీషన్ వ్యాపారి, అక్కడున్న మార్కెట్ ఉద్యోగి పెద్ద షాక్ ఇచ్చాడు. మార్కెట్లో ధర నిర్ణయించిన తర్వాత యార్డు గేటు వద్ద ఉన్న సూపర్వైజర్ లాట్ నంబర్‌తో నిర్ణయించిన ధరను పేర్కొంటూ.. సరుకును కాంటా పెట్టి సంబంధిత వ్యాపారికి అప్పగించాలని దడవాయిలకు బాధ్యత అప్పగిస్తాడు. నిరక్షరాస్యురాలైన బుల్లెమ్మ మిర్చికి మార్కెట్ ఉద్యోగి క్వింటాల్‌కు రూ.7వేలుగా పేర్కొంటూ దడవాయిని సరుకు కాంటాకు పంపించారు. దీంతో రైతు బుల్లెమ్మ మరో రైతుకు తన పంటకు ఎంత ధర పడిందో చూడమని చిట్టీ ఇచ్చింది. అందులో రూ.7వేల ధరగా ఉంది. దీంతో ఆమె లబోదిబోమంటూ యార్డు గేటు వద్దకు చేరి తనకు అన్యాయం చేశారని బోరున విలపించింది. ఈ క్రమంలోనే విధుల్లో ఉన్న మార్కెట్ సూపర్వైజర్ అక్కడి నుంచి జారుకున్నారు. దడవాయిలు తమ తప్పు లేదని ఆమెకు చెప్పారు. ఇదిలా ఉండగా, సరుకు కాంటా, తరలింపు కూడా జరిగిపోయింది. ఈ వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి చేరుతున్న క్రమంలో కొందరు ఆ మహిళను అక్కడి నుంచి తీసుకెళ్లి తొలుత నిర్ణయించిన ధర ఇప్పిస్తామని చెప్పారు. క్వింటాల్‌కు ఏకంగా రూ.1,700 తేడాతో రైతుకు దాదాపు రూ.7వేల నష్టం వాటిల్లుతోంది. ఇటువంటి ఘటనలు మార్కెట్లో నిత్యం చోటు చేసకుంటున్నాయి. ఏకమై దగా.. పంట మార్కెట్‌కు వచ్చింది మొదలు అడుగడుగునా రైతు అన్యాయానికి గురవుతూనే ఉన్నాడు. పంటకు ధర నిర్ణయించే ఖరీదుదారులంతా సిండికేట్‌గా ఏర్పడి ధర పెడుతున్నారు. ఇక కమీషన్ వ్యాపారులు కూడా ఖరీదుదారులతో కూడపలుక్కొని ధర పెట్టిస్తారు. ఈ తతంగమంతా తెలిసిన మార్కెట్ ఉద్యోగులకు ఆమ్యామ్యాలు ముట్టజెబుతూ అక్రమాలను మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగిస్తున్నారు. కాగా.. పంట పరిశీలనలో ఓ ధరను నిర్ణయిస్తూ.. తీరా కాంటా సమయంలో సరుకు నాణ్యతగా లేదని చెబుతూ ధరలో కోత పెడుతున్నారు. క్వింటాల్‌కు రూ.400 నుంచి రూ.500 వరకు కోత పెడుతున్నా.. అధికారులు నియంత్రించలేకపోతున్నారు. వ్యాపారులకు కొమ్ముకాస్తున్న ఉద్యోగులు పంట విక్రయంలో తమకు అన్యాయం జరిగిందని రైతులు మొరపెట్టుకున్నా మార్కెట్ ఉద్యోగులు మాత్రం వ్యాపారులకే కొమ్మకాస్తున్నారు. సరుకు నాణ్యత లేనందునే ధర తగ్గించారని, ఆ ధరకే అమ్మాలని వ్యాపారులకు అండగా నిలుస్తున్నారు. బదిలీ అయినా.. ఖమ్మం మార్కెట్లో బదిలీలు జరిగినప్పటికీ కొందరు అక్రమాలకు రుచిమరిగి ఇక్కడి నుంచి వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. ఇక్కడ సూపర్వైజర్గా పనిచేస్తూ.. అసిస్టెంట్ సెక్రటరీగా పదోన్నతి పొంది కొత్తగూడెం బదిలీ అయిన ఓ ఉద్యోగి గురువారం ఖమ్మం మార్కెట్ మిర్చి యార్డులో విధులు నిర్వహిస్తున్నాడు. మీరు బదిలీ అయ్యారుగా అని ప్రశ్నిస్తే.. అవునని, పని ఉండి వచ్చానని బుకాయించాడు. కాగా.. రైతు బుల్లెమ్మకు ధరలో అన్యాయం జరిగిన సమయంలో ఈ అధికారే మిర్చిగేటు వద్ద ఉన్నాడు. పరిశీలించి.. చర్యలు తీసుకుంటాం.. రైతుల పంటకు తగిన ధర కల్పించటంలో ఎటువంటి చర్యకైనా వెనకాడం. పంటకు ధర నిర్ణయించి.. తిరిగి తగ్గిస్తే సహించేది లేదు. ఇటువంటి ఘటనలపై నిఘా పెంచాం. రైతు బుల్లెమ్మకు జరిగిన అన్యాయంపై సమాచారం ఉంది. సమగ్రంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం. ఇటువంటివి పునరావృతం కాకుండా చూస్తాం. – రత్నం సంతోష్‌కుమార్, ఉన్నత శ్రేణి కార్యదర్శి ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ -
'ఈ సంకెళ్లే రేపు కేసీఆర్‌కు వేస్తారు'
హైదరాబాద్: ఖమ్మం మార్కెట్ లో ఇంత పెద్ద సంఘటన జరిగిన తర్వాత కూడా మార్కెట్ శాఖ మంత్రిగానీ, జిల్లా మంత్రిగానీ మార్కెట్‌ను రాకపోవడం ఆశ్ఛర్యకరమని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆయనిక్కడ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఖమ్మంలో రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు రైతుకు వేసిన సంకెళ్లే.. రాబోయే రోజుల్లో ప్రజలు కేసీఆర్ కు వేస్తారన్నారు. వరి పంటకు రూ. 2 వేలు, మొక్కజొన్నకు రూ. 2 వేలు, పసుపు, పత్తి రూ.10 వేల చొప్పున మద్దతు ధర ప్రకటించాలన్నారు. ప్రగతి భవన్లో బుల్లెట్ ఫ్రూఫ్ గదుల్లో కేసీఆర్ నీరో చక్రవర్తిలా నిద్రపోతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులకు అడ్డమని మరోసారి అంటే హరీష్‌రావు నాలుక కోస్తామని హెచ్చరించారు. టీఆర్ఎస్ మ్యానిఫెస్టో పెద్ద అబద్ధాల పుస్తకం.. పెద్ద ఒక్క హామీ కూడా నెరవేరలేదన్నారు. రైతులపై పెట్టిన కేసులను బేషరుతుగా ఉపసంహరించుకోవాలని పొన్నం డిమాండ్ చేశారు. -
మందగించిన మిర్చి కొనుగోళ్లు...
ఖమ్మం, వరంగల్ మార్కెట్లకు సగానికిపైగా తగ్గిన రైతులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మిర్చి కొనుగోళ్లు మందగించాయి. ఖమ్మం, వరంగల్ వ్యవసాయ మార్కెట్లకు తరలివచ్చే మిర్చి సాధారణ రోజుల కంటే సగానికి తగ్గినట్లు మార్కెటింగ్‌శాఖ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం క్వింటాలుకు రూ.5వేలకు కొనుగోలు చేస్తా మని ప్రకటించడం, రాష్ట్ర ప్రభుత్వం రూ.7వేలు చేయా లని లేఖ రాయడం తెలిసిందే. దీంతో కేంద్రం ధర పెంచుతుందన్న ఆశతోనే రైతులు తమ మిర్చిని మార్కెట్‌కు తీసుకురావడంలేదని మార్కెటింగ్ శాఖ వర్గాలు విశ్లేషి స్తున్నాయి. అంతేగాకుండా ఆయా జిల్లాల యంత్రాంగం కూడా మిర్చి అధికంగా మార్కెట్లకు రాకుండా కొంతమే రకు నియంత్రించింది. సాధారణంగా ఖమ్మం మార్కెట్‌కు రోజుకు 80వేల నుంచి లక్ష బస్తాల వరకు మిర్చి వచ్చేది. శుక్రవారం 40వేల బస్తాలకు పడిపోయిందని అధికారులు తెలిపారు. వరంగల్ మార్కెట్‌కు 70 వేల బస్తాలొచ్చే లోడు... 22 వేల బస్తాలకు పడిపోయిం దన్నారు. దీంతో ఖమ్మం మార్కెట్లో శుక్రవారం కాస్తంత ధర పెరిగింది. -
రైతులపై కుట్ర కేసులా..?
► వారిని సంఘ వ్యతిరేక శక్తులుగా ముద్ర వేస్తారా? ► ఖమ్మం మార్కెట్‌ను సందర్శించిన సీఎల్పీ నేత జానారెడ్డి సాక్షి, ఖమ్మం: ‘‘మిర్చిని అమ్ముకోవడానికి రైతులు మార్కెట్‌కు తెచ్చారు.. ధర లేదని ఆవేశంతో రైతులు ఆందోళన చేస్తే ప్రభుత్వా న్ని కూల్చేందుకు కుట్ర చేశారని కేసులు పెడ తారా’’అంటూ కాంగ్రెస్ శాసనసభా పక్షనేత కుందూరు జానారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన ఖమ్మం మార్కెట్‌ను సం దర్శించారు. తర్వాత మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్జేసీ కృష్ణ, కార్యదర్శి ప్రసాదరావుతో ఘటన జరిగిన తీరుపై మాట్లాడారు. ఈ సం దర్భంగా కాంగ్రెస్ నేత లు, మార్కెట్ కమిటీ చైర్మన్ మధ్య వాగ్వాదం జరిగింది. అనం తరం ఖమ్మం మార్కెట్‌పై దాడి ఘటనలో అరెస్టయి ఖమ్మం జిల్లా జైలులో ఉన్న రైతు లను కాంగ్రెస్ నేతలు కె. జానారెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ వి. హనుమంతరావు తదితరు లు సోమవారం పరామర్శించా రు. జానారెడ్డి విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం పంట లకు గిట్టుబాటు ధర ఇవ్వా ల్సిందిపోయి రైతులపట్ల అహం కారంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రైతులను సంఘ వ్యతిరేక శక్తులుగా ముద్రవేసి జైల్లో పెట్టించిందని, తాము బాధిత కుటుంబాలతో మాట్లాడితే వారు రైతులేనని తేలిందన్నారు. రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు. కొందరు వ్యా పారులు టీఆర్ఎస్లో చేరిన తర్వాత రైతు లను దోచుకుంటున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన: సీతక్క రాష్ట్రంలో రాక్షసపాలన నడుస్తోందని టీడీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సీతక్క అన్నారు. జైలు లో ఉన్న రైతులను ఆమె పరామర్శించారు. -
మార్కెట్‌కొస్తే జైల్లో పెట్టారు
► పంట పండించడమే నేరమా..? ► ఖమ్మం మార్కెట్ ఘటనలో జైలుపాలైన రైతు కుటుంబాల ఆవేదన ‘‘మార్కెట్‌కు మిర్చిని తీసుకొచ్చిన పాపానికి మా వాళ్లు జైలుకు పోయిన్రు.. పంట పండించడమే నేరమా..? ధర అడిగితే జైల్లో పెడతారా’’అంటూ జైలుపాలైన బాధిత రైతుల కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తూ.. కన్నీటి పర్యంతం అవుతున్నాయి. ఖమ్మం మార్కెట్లో గత నెల 28న జరిగిన దాడి ఘటన వెనుక పది మంది రైతులున్నారనే ఆరోపణపై వారిని అరెస్టు చేసి ఆదివారం జైలుకు పంపిన విషయం తెలిసిందే. సోమవారం ‘సాక్షి’ బాధిత రైతు కుటుంబాలను పలకరించగా, వారి గోడును వెళ్లబోసుకున్నారు. అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని, మార్కెట్‌కు తీసుకెళ్లిన మిర్చి అమ్మారో..? అమ్మలేదో తెలవదని కొంతమంది రైతుల కుటుంబాలు... ఇంటికి పెద్ద దిక్కు జైలు పాలు కావడంతో అన్నం ముద్దదిగడం లేదని, పిల్లలు నాన్న ఏడని అడుగుతున్నారని మరికొంతమంది రైతుల కుటుంబాలు దీనంగా చెప్పాయి. నా భర్తపై అక్రమంగా కేసు పెట్టారు పోలీసులు మా ఆయనపై అక్రమంగా కేసు పెట్టారు. మా మావ ఎకరం భూమి ఇచ్చాడు. మరో రెండెకరాలు కౌలుకు తీసుకొని రెండున్నర ఎకరాల్లో పత్తి సాగు చేశాం. అరెకరంలో మిర్చి సాగు చేశాం. మిర్చికి రూ.50వేల వరకు పెట్టుబడులయ్యాయి. 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మిర్చికి ధర లేకపోవడంతో పెట్టుబడులు కూడా రాలేదు. మొదటి రెండు కోతలు ఇంటి వద్దే అమ్మాం. చివరి కోతలు కోసిన మిర్చి 13 బస్తాలను అమ్మేందుకు పోయిన 27న ఖమ్మం మార్కెట్‌కు వెళ్లాడు. ఆ రోజు మొత్తం మార్కెట్లనే ఉన్నడు. తెల్లారిన తర్వాత గొడవ జరిగిందట. ఈ విషయం నా భర్తకు తెలియదు. మిర్చి కొనకపోవడంతో మిర్చి బస్తాలు తీసుకొని ఇంటికి వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈలోగా బహిర్భూమికి వెళ్లేందుకు మార్కెట్ వద్దకు వెళ్లడంతో.. పోలీసులు నా భర్తను అన్యాయంగా అరెస్టు చేశారు. నాకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక కొడుకు ఉన్నాడు. నా భర్త ఖమ్మం వెళ్లడం ఇదే మొదటిసారి. పోలీసులు మార్కెట్లో దాడి చేసిన వారిని వదిలిపెట్టి అన్యాయంగా నా భర్తను కేసులో ఇరికించారు. అమాయకుడైన నా భర్తను వదిలిపెట్టాలి. –రైతు భూక్యా నర్సింహారావు భార్య జ్యోతి, శ్రీరాంపురం తండ, ఎన్కూరు మార్కెట్ బయట ఉన్నా పోలీసులు పట్టుకెళ్లారు మిర్చి అమ్మేందుకు ఖమ్మం మార్కెట్‌కు వెళ్లిన బానోత్ ఉపేందర్‌పై అన్యాయంగా కేసు పెట్టారు. ఉపేందర్ ఎకరంలో మిర్చి వేశాడు. పోయిన శుక్రవారం 22 బస్తాల మిర్చి ఖమ్మం మార్కెట్‌కు తీసుకెళ్లాడు. యార్డు బయట మిర్చి దింపి.. టిఫిన్ చేసేందుకు మరో రైతు తేజావత్ నరేశ్‌తో కలసి వెళ్లాడు. అప్పుడే యార్డులో గొడవ జరుగుతుంటే.. మా వాడు బయటనే ఉన్నారు. అయినా, పోలీసులు పట్టుకెళ్లి కేసు పెట్టారు. వ్యవసాయం కోసం రూ. 1.50 లక్షల అప్పు చేసినం. మార్కెట్‌కు తీసుకెళ్లిన మిర్చి ఎక్కడుందో తెలియదు. –రైతు ఉపేందర్ తల్లి చాలీ, భార్య లలిత, శంకర్‌గిరి తండ, నేలకొండపల్లి ఇదెక్కడి అన్యాయం సారూ.. మిర్చి అమ్మేందుకు మార్కెట్‌కు వెళ్లిన మా కొడుకును జైలులో పెట్టడం అన్యాయం సారూ.. ఎకరానికి రూ.20 వేలకు మాట్లాడుకొని నాలుగెకరాలు కౌలుకు తీసుకొని మిర్చి పంట సాగు చేసినం. మా సొంత భూమి ఐదెకరాల్లో పత్తి, కంది పంటలు సాగు చేసినం. మిర్చి పంటకు ఎకరానికి రూ.లక్ష చొప్పున రూ.4 లక్షలు పెట్టుబడికి అప్పు తెచ్చి పెట్టినం. మొదటి కోతలో 25 క్వింటాళ్లు వచ్చింది. దీన్ని క్వింటాల్‌కు రూ.6వేల చొప్పున అమ్మితే రూ.1.50 లక్షలు వచ్చినయి. కూలోళ్లకు, అప్పు తెచ్చిన కాడ కొద్దిగ కట్టినం. రెండో కోతలో 62 మిర్చి బస్తాలు వచ్చింది. మా కొడుకు భావ్‌సింగ్ పోయిన శుక్రవారం మిర్చి అమ్మేందుకు మార్కెట్‌కు పోయిండు. ఆడ ఏం గొడవైందో తెలియదు. శనివారం పోలీసోళ్లు వచ్చి పట్టుకపోయి జైళ్లో పెట్టిళ్లు. భావ్‌సింగ్‌కు ఐదేళ్ల కొడుకు ఉన్నడు. భార్య గర్భవతి... పుట్టింటికి పోయింది. విషయం తెలిసిన కాడ్నుంచి ఆమె అన్నం తినడం లేదు. –భావ్‌సింగ్ తల్లిదండ్రులు పద్మ, శ్రీరాములు, దుబ్బతండ కారేపల్లి ఇంటికి వచ్చి మా ఆయనను తీసుకుపోయారు మాది వ్యవసాయ కుటుం బం. పండించిన మిర్చిని అమ్మేందుకు ఖమ్మం మార్కెట్‌కు తీసుకెళ్లినా ధర పడలేదు. మార్కెట్‌కు తీసుకపోయిన 65 బస్తాలను టాక్టర్‌లో ఇంటికి తెచ్చాం. తెల్లారే సరికి పోలీసులు వచ్చి తీసుకుపోతుంటే ఎందుకు తీసుకపోతున్నారో అనుకున్నా. ఇంతవరకు మల్ల ఇంటికి రాలే. గొడవ చేసింది ఎవరో తెలియదంట. కానీ మా ఆయనను ఇంటికి వచ్చి తీసుకుపోయారు. –ఆనందరావు భార్య, చిరుమర్రి, ముదిగొండ(మం) పొద్దున్నే టీ తాగి పోయిండు కిరాయి టాక్టర్‌లో మార్కెట్‌కు మిర్చి పంపిం చి.. మా ఆయన మిరపకాయ అమ్ముకొత్తనని పొద్దున్నే టీ తాగి పోయిండు. ఇంతవరకు ఇంటికి రాలే. ఎనిమిదిన్నర ఎకరాలు కౌలుకే చేత్తన్నం. కొంత కంది, మిరపకాయ, మొక్కజొన్న పండిం చాం. ఏం తెలియని మా ఆయనను జైలుకు పంపించారు. కౌలు ముందే కట్టాం. కట్టపడి ఎవుసం చేత్తే జైలుకు పంపించారు. మాకు ఎట్లంది తెలియదు. ఇంట్లో నేను, మా పాప, మా అత్తయ్య ఆడవాళ్లమే. కేసు ఎందుకు పెట్టారో మరి తెలియదు. –చట్టు కొండలు భార్య ఉపేంద్ర, బాణాపురం, ముదిగొండ(మం) బోసిపోయిన రైతు వెంకటేశ్వర్లు ఇల్లు మధిర నియోజకవర్గ పరిధి ముదిగొండ మండలం బాణాపురానికి చెందిన రైతు నెల్లూరి వెంకటేశ్వర్లు ఇల్లు బోసిపోయి కనిపించింది. వెంకటేశ్వర్లును పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపడంతో భార్య తులసి చిన్నారి బిడ్డతోపాటు.. వెంకటేశ్వర్లు తల్లి లలితమ్మలు ఆగలేక జైలు వద్దకు వెళ్లారు. ఆ ఇంటికి తాళం వేసి ఉండడంతో కళకళలాడే ఇల్లు రైతులేకపోవడంతో కళా హీనంగా మారింది. ఆ చిన్నారి నాన్న కోసం గుక్కపెట్టి ఏడుస్తుంటే ఆగలేక కన్నీటి పర్యంతమవుతున్నారు. వారు గూండాలు కాదు రైతులే.. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఖమ్మం అర్బన్: మార్కెట్లో రైతులే కడుపు మం డి దాడి చేశారే తప్ప.. వారు గూండాలు కాదని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నా రు. ప్రభుత్వం ఆత్మ పరిశీలన చేసుకుని రైతుల ను విడుదల చేయాలని, వారిపై కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలీసులు జైలుకు పంపిన వారిలో ఐదుగురు టీఆర్ఎస్ కార్యకర్త లేనని, వారిని ఎవరు రెచ్చగొడితే దాడి చేశారో తెలుసుకోవాలన్నారు. మంత్రి తుమ్మల ఆరోపణలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. – సాక్షి నెట్వర్క్ -
ప్రభుత్వం సీరియస్.. ఏ2గా టీడీపీ ఎమ్మెల్యే
ఖమ్మం: ఖమ్మం మిర్చి యార్డు రణరంగంగా మారిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో పాటు 11 మందిపై కేసు నమోదైంది. 147, 148, 353, 427, 448, 420(బి) సెక్షన్ల కింద వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఏ-2గా టీడీపీ ఎమ్మెల్యే సండ్ర పేరును చేర్చారు. మార్కెట్ కమిటీలో పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసు బలగాలు వచ్చినా మిర్చి ధర రోజురోజుకు తగ్గడంతో చేపట్టిన ఆందోళనను రైతులు అంత సులువుగా విరమించలేదు. మిర్చి ధరను రోజు రోజుకు ఎందుకిలా తగ్గిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన కొనసాగించారు. శనివారం నాడు ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో రైతులు ఆందోళనకు దిగి చైర్మన్, కార్యదర్శుల కార్యాలయాలకు నిప్పుపెట్టారు. అంతటితో ఆగకుండా మార్కెట్లోని సుమారు 1000 కాంటాలు ధ్వంసం చేశారు. ఆ సమయంలో ప్రాణభయంతో ఉద్యోగులు, కార్యదర్శి పరుగులు తీసిన విషయం తెలిసిందే. రైతులకు మద్దతుగా మార్కెట్‌కు వచ్చిన ఎమ్మెల్యే సండ్ర ఆందోళన జరుగుతున్న సమయంలో చైర్మన్ చాంబర్లోకి వెళ్లి మిర్చి ధరపై చర్చించారు. అయితే సండ్ర రైతులకు మద్దతుగా ఆందోళన చేపట్టంతో వారు తీవ్ర ఆవేశానికిలోనై కంప్యూటర్లు, ఫర్నీచర్, ద్విచక్రవాహనాలను ధ్వంసం చేశారని ఆరోపణలున్నాయి. దీంతో ఏ-2గా ఆయన పేరును చేర్చారు. -
రణరంగంగా మారిన ఖమ్మం మార్కెట్
-
మిర్చి మంటలు
ధర పతనంతో పెల్లుబిక్కిన రైతన్న ఆగ్రహం - రణరంగంగా మారిన ఖమ్మం మార్కెట్ - చైర్మన్, కార్యదర్శుల కార్యాలయాలు ధ్వంసం - ‘ఈ–నామ్’లో కంప్యూటర్లు, ఫర్నిచర్‌కు నిప్పు - మార్కెట్లోని సుమారు 1,000 కాంటాలు ధ్వంసం - పరుగులు తీసిన ఉద్యోగులు, కార్యదర్శి - రూ. 8 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా - క్వింటాల్‌కు 2 వేలకు పైగా పడిపోయిన ధర సాక్షి, ఖమ్మం: మిర్చి ధర ఒక్కసారిగా పతనం కావడంతో రైతన్న కడుపు రగిలింది. కొద్దిరోజుల కింద ఐదారు వేల వరకు పలికిన మిర్చి ధరను శుక్రవారం మూడు నాలుగు వేలకు తగ్గించడంతో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ధర తగ్గించడాన్ని నిరసిస్తూ రైతులు ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఆందోళనకు దిగారు. మార్కెట్ కమిటీ కార్యాలయంపై దాడి చేశారు. రాళ్లు రువ్వడంతోపాటు కార్యాలయంలోకి ప్రవేశించి కంప్యూటర్లు, ఫర్నిచర్‌ను తగలబెట్టారు. మార్కెట్లోని తూకం కాంటాలనూ ధ్వంసం చేశారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చివరికి పోలీసులు వచ్చి రైతులను చెదరగొట్టారు. ఆందోళన మొదలైందిలా.. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు శుక్రవారం సుమారు 1.5 లక్షల మిర్చి బస్తాలు వచ్చాయి. ఫిబ్రవరి, మార్చి నుంచి క్రమంగా తగ్గుతున్న మిర్చి ధర ఈ నెలలో అమాంతం పడిపోయింది. గత వారం వరకు సగటున రూ.4,500 నుంచి రూ.5వేల వరకు పలికినా.. శుక్రవారం వ్యాపారులు ఏకంగా రూ.2 వేల నుంచి రూ.4వేల వరకు తగ్గించారు. తొలుత ఉదయం 7 గంటల సమయంలో మార్కెట్ యార్డుల వెలుపల రహదారులపై వేసిన మిర్చి బస్తాల ధరలు నిర్ణయించారు. సరుకు తూకం వేసేందుకు కాంటాలను కూడా సిద్ధం చేసుకున్నారు. అయితే ధర బాగా తగ్గించడంపై మిర్చి రైతులు ఆందోళనకు దిగారు. ఆగ్రహంతో అక్కడి కాంటాలను ధ్వంసం చేసి.. మూకుమ్మడిగా మార్కెట్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. మార్కెట్ అధికారులు, చైర్మన్ వచ్చి దీనిపై సమాధానం చెప్పాలని, మిర్చికి తగిన ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్న మార్కెట్ కార్యదర్శి ప్రసాదరావు రైతుల వద్దకు వచ్చి.. ధర నిర్ణయం తమ చేతుల్లో లేదని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో మరింతగా ఆగ్రహించిన రైతులు మార్కెట్ కార్యాలయం ఎదుట కొంత మిర్చి దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. కొద్దిసేపటికి మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్జేసీ కృష్ణ మార్కెట్ కార్యాలయానికి వచ్చి రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మార్కెట్‌కు చేరుకుని.. రైతులకు మద్దతుగా ఆందోళన చేపట్టారు. ఒక్కసారిగా ఉద్రిక్తత.. రైతులకు మద్దతుగా వచ్చిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య చైర్మన్ చాంబర్లోకి వెళ్లి మిర్చి ధరపై చైర్మన్‌తో మాట్లాడుతున్నారు. ఇదే సమయంలో మార్కెట్ యార్డుల నుంచి రైతులంతా ఒక్కసారిగా మార్కెట్ కార్యాలయం వద్దకు వచ్చారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్యాలయంపైకి రాళ్లు రువ్వారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య బయటకు వెళ్లిపోయారు. చైర్మన్ ఆర్జేసీ కృష్ణ, కార్యదర్శి పాలకుర్తి ప్రసాదరావు, ఉద్యోగులు చాంబర్‌ను వీడి పక్కకు వెళ్లిపోయారు. రైతులు చైర్మన్ చాంబర్లోకి ప్రవేశించి.. అక్కడి కంప్యూటర్, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. తర్వాత కార్యదర్శి కార్యాలయంలో ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలు, ఏసీ, ఫ్యాన్లను, పక్కనే ఉన్న ఉద్యోగుల కార్యాలయానికి వెళ్లి రణరంగం సృష్టించారు. కంప్యూటర్లు, ఫర్నీచర్, బీరువాలు, ద్విచక్ర వాహనాలను కూడా ధ్వంసం చేశారు. అడ్డుకోబోయిన కొందరు ఉద్యోగులపైనా దాడి చేయడంతో వారు పరుగులు తీశారు. కొందరు ఉద్యోగులకు రాళ్ల దెబ్బలు తగిలాయి. పోలీసు బలగాలు వచ్చినా ఆగని ఆందోళన మార్కెట్ కమిటీలో పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసు బలగాలు వచ్చినా.. రైతులు తమ ఆందోళన విరమించలేదు. మిర్చి ధరను రోజు రోజుకు ఎందుకిలా తగ్గిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన కొనసాగించారు. ధరను బాగా తగ్గించేడంతో తీవ్రంగా నష్టపోతున్నామని, అప్పుల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతసేపు సంయమనం పాటించిన పోలీసులు.. రైతులు తిరిగి మార్కెట్ కార్యాలయం వైపు వస్తుండటంతో రంగంలోకి దిగి వారిని చెదరగొట్టారు. దీంతో మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత రైతుల ఆందోళన తగ్గింది. ఫర్నీచర్, ఇతర సామగ్రి దహనమవుతుండగా.. ఫైరింజన్లను తెప్పించి మంటలు ఆర్పించారు. రైతుల ఆగ్రహానికి మార్కెట్ ధ్వంసం కావడంతో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ మార్కెట్లో ధ్వంసమైన కార్యాలయాలను పరిశీలించి, మార్కెట్ కమిటీ చైర్మన్, సిబ్బందితో మాట్లాడారు. రైతుల ఆందోళన, మార్కెట్లో పరిస్థితిపై పోలీసు, మార్కెటింగ్ శాఖల ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. రూ.8 కోట్ల ఆస్తి నష్టం రైతుల ఆగ్రహానికి మార్కెట్లోని కార్యాలయాల్లో ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ ధ్వంసమయ్యాయి. సుమారు 40 కంప్యూటర్లు, నాలుగు ల్యాప్‌టాప్‌లు, ఎనిమిది ఏసీలు, ఐదు జీపీఆర్ఎస్ కాంటాలు, 20 హ్యాండ్పాస్లు, 35 టేబుళ్లతోపాటు ప్రింటర్లు, జిరాక్స్ యంత్రాలు, సీసీ కెమెరాలు, స్మార్ట్‌టీవీలు, ఫ్యాన్లు, కూలర్లు, బీరువాలు, ఆఫీస్ ఫైళ్లు, రికార్డులు, వేబ్రిడ్జి యంత్రం ధ్వంసమయ్యాయి. వీటితోపాటు వ్యాపారులకు చెందిన సుమారు వెయ్యి ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలను ధ్వంసం చేశారు. మొత్తంగా రూ.8 కోట్ల మేరకు ఆస్తి నష్టం జరిగినట్లు భావిస్తున్నారు. మరోవైపు వ్యాపారుల ఎలక్ట్రానిక్ కాంటాలు ధ్వంసం కావడంతో.. మార్కెట్లో పంటలను కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నారు. తప్పిన పెను ప్రమాదం! రైతులు ఈ–నామ్ కేంద్రంలోని ఫర్నీచర్‌ను, ఎలక్ట్రానిక్ వస్తువులను దహనం చేసిన సమయంలో పక్కనే మిర్చి బస్తాలున్నాయి. ఆ యార్డుతోపాటు పక్క యార్డులలో, రహదారులపై, సమీప ప్రాంతాల నిండా మిర్చి బస్తాలున్నాయి. అసలే మండుతున్న ఎండ.. ఇటు ఫర్నీచర్ దహనంతో మంటలు చెలరేగుతాయేమోననే ఆందోళన వ్యక్తమైంది. అంతేకాదు మార్కెట్యార్డులోగానీ, సమీపంలోగానీ ఫైరింజన్ అందుబాటులో లేదు. ఒకవేళ యార్డులో మిర్చి బస్తాలకు మంటలు అంటుకుని ఉంటే.. పెద్ద ప్రమాదమే తలెత్తేది. పరిస్థితి చేయి దాటిపోయేది. ఖమ్మం నగరమంతా అతలాకుతలమయ్యేది. పోలీసులు అప్రమత్తమై రైతులను చెల్లాచెదురు చేయడం, మంటలను ఆర్పడంతో ప్రమాదం తప్పింది. ఈ–నామ్ కార్యాలయం అగ్నికి ఆహుతి మార్కెట్లో ఓ పక్కగా ఉన్న పత్తియార్డులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘జాతీయ వ్యవసాయ మార్కెట్ కార్యాలయం (ఈ–నామ్)’పైనా రైతులు దాడిచేశారు. అందులోని కంప్యూటర్లు, ఫర్నీచర్, ల్యాప్‌టాప్‌లు, ఏసీలను బయటపడేసి నిప్పంటించారు. కంప్యూటర్ క్యాబిన్ అద్దాలన్నీ ధ్వంసం చేశారు. అయితే ఈ–నామ్ కేంద్రాన్ని ప్రస్తుతం పత్తి లావాదేవీల కోసం మాత్రమే ఏర్పాటు చేశారు. ఇటీవలే అధునాతన హంగులతో ప్రారంభించారు. అది మిర్చికి సంబంధించినది కాకున్నా రైతులు దానిని ధ్వంసం చేయడంపై సందేహాలు తలెత్తుతున్నాయి. దాడి చేసింది రాజకీయ పార్టీల కార్యకర్తలు ‘‘మిర్చికి గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రానికి విన్నవించాం. స్పందన రాలేదు. కానీ దీనిపై కొన్ని పార్టీలు రాజకీయ డ్రామాలు చేస్తున్నాయి. ఖమ్మంలో మార్కెట్ యార్డుపై దాడి అలాంటిదే. రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు రైతుల ముసుగులో వచ్చి దాడికి పాల్పడ్డారు. మార్కెట్లోని సీసీ కెమెరాల వీడియోలు చూస్తే.. దాడిలో ముసుగేసుకుని వచ్చినవారున్నారు. వారెవరూ రైతులు కాదు. రైతులెవరూ అలా దాడులు చేయరు. మిర్చి ధరపై రైతులకు సరైన న్యాయం చేస్తాం..’’ – టి.హరీశ్‌రావు, మార్కెటింగ్‌శాఖ మంత్రి ధర లేదని మిర్చి పంటను తగలబెట్టాడు మిర్చి ధర పడిపోవడంతో పెట్టుబడి కూడా రాదని మనస్తాపం చెందిన రైతు.. తాను పండించిన పంటకు తనే నిప్పుపెట్టాడు. వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం కౌకొండకు చెందిన చుక్క రాజయ్య తన రెండెకరాల పొలంలో మిర్చి పంట సాగు చేశాడు. ఇప్పుడు పంట దిగుబడికి వచ్చి, అమ్ముదామనుకునే సరికి ధర బాగా పడిపోయింది. దీంతో ఆందోళనకు లోనైన రాజయ్య.. దిక్కుతోచని పరిస్థితిలో శుక్రవారం మిర్చి పంటకు నిప్పు పెట్టుకున్నాడు. తగిన మద్దతు ధరకు కొంటామంటూ ఒప్పందం చేసుకున్న ఐటీసీ కంపెనీ వారు చెప్పినట్లుగానే పంట పండిచానని.. కానీ వారు పంటను కొనకుండా మొండిచేయి చూపారని తెలిపారు. -
మాకో పదవి
♦ నామినేటెడ్ పదవులపై గులాబీ నేతల ఆశలు ♦ ఖమ్మం మార్కెట్, భద్రాచలం ట్రస్ట్‌బోర్డు పైనే గురి ♦ కోర్టు పరిధిలో ఏజెన్సీలోని నాలుగు వ్యవసాయ మార్కెట్ కమిటీలు ♦ మిగతా పోస్టులపై చిన్నాచితక నేతల పైరవీలు ♦ ‘మంత్రాంగం’తోనే పదవులు దక్కుతాయని నేతల ధీమా మార్కెట్ కమిటీలు 9 ఖమ్మం, నేలకొండపల్లి, కొత్తగూడెం, చర్ల, వైరా, కల్లూరు, సత్తుపల్లి, దమ్మపేట, మధిర ఆలయ ట్రస్ట్ బోర్డులు600 భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయం, జమలాపురం వేంకటేశ్వరస్వామి దేవాలయం, పాల్వంచ పెద్దమ్మతల్లి దేవాలయాలే ఆదాయ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ -1 సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు కూడా ముగిశాయి. పాలేరు ఉపఎన్నిక మినహా ఏ ఎన్నికలు జరిగే అవకాశాలు లేవు. దీంతో ఇప్పటి వరకు ఊరిస్తూ వచ్చిన నామినేటెడ్ పదవులు ఈసారైనా భర్తీ చేస్తారనే ఆశతో పలువురు నేతలు ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఆదాయం ఎక్కువగా ఉన్న వ్యవసాయ మార్కెట్ కమిటీలు, ఆలయ బోర్డులపైనే ప్రధాన నేతలంతా గురి పెట్టారు. జిల్లా మంత్రి కనుసన్నల్లోనే పదవులు భర్తీ అయ్యే అవకాశముందని, ఆయనతోనే మంత్రాంగం చేసి పదవులు దక్కించుకోవాలని ఎత్తుకు పైఎత్తులు వేయడంలో మునిగారు. జిల్లావ్యాప్తంగా 13 వ్యవసాయ మార్కెట్ కమిటీలుండగా గిరిజనేతరులను నియమించవద్దన్న అంశంపై ఇల్లెందు, ఏన్కూరు, బూర్గంపాడు, భద్రాచలం మార్కెట్ కమిటీల కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంది. దీంతో 9 మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలను భర్తీ చేసే అవకాశాలున్నారుు. జిల్లాలోని దేవాలయాలను 6 ఏ, 6 బీ, 6 సీ అని మూడు కేటగిరిలుగా విభజించారు. 6 ఏ పరిధిలో మూడు దేవాలయాలు, 6 బీ లో 2 దేవాలయాలు, 6సీలో 595 దేవాలయాలు ఉన్నాయి. 6ఏ లో ఉన్న భద్రాచలం, జమలాపు రం వేంకటేశ్వరస్వామి దేవాలయం, పాల్వంచలోని పెద్దమ్మతల్లి దేవాలయాలే ఆదాయపరంగా ప్రభుత్వానికి కీలకమైనవి. మిగతావన్నీ ఏడాదికి సగటున తక్కువ ఆదాయం వచ్చేవే. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి కూడా ఏళ్లుగా పెండింగ్‌లోనే ఉంది. ఇది కూడా ప్రభుత్వం భర్తీ చేయనుంది. మొత్తంగా 9 వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో ఖమ్మం ప్రధానం కాగా, ఆలయాల విషయానికి వస్తే భద్రాచలం ట్రస్ట్‌బోర్డు, గ్రంథాలయ చైర్మన్ పదవులను దక్కించుకోవడానికి ఆశావహులు పోటీ పడుతున్నారు. ఆదాయం ఉన్న కమిటీలపై దృష్టి.. ఖమ్మం మార్కెట్ కమిటీ భర్తీపైనే అధికార పార్టీలోని ఆశావహులు దృష్టి పెట్టారు. జిల్లాతోపాటు వరంగల్, నల్లగొండ జిల్లాల నుంచి కూడా ఈ మార్కెట్లో ఏడాదికి రూ.1500 కోట్లపైనే వ్యాపారం జరుగుతుంది. ఈ కమిటీ చైర్మన్ పదవి కోసం ఉద్యమ జెండాను తొలి నుంచి మోసిన నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరిన నేతలు కూడా ఎలాగైనా తమకే చైర్మన్ పదవి దక్కుతుందన్న ధీమాలో ఉన్నారు. మంత్రి తుమ్మలకు అనుంగు అనుచరులుగా ఉన్న నేతలకే ఈ పదవి వరిస్తుందన్న ప్రచారం జరుగుతోంది. ఇక నేలకొండపల్లి, కొత్తగూడెం, చర్ల, వైరా, కల్లూరు, సత్తుపల్లి, దమ్మపేట, మధిర కమిటీలకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యేలు సూచించే నేతలా..? లేకపోతే మంత్రి అండదండలున్న వారికే పదవులు దక్కే అవకాశం ఉంటుందా అని చర్చించుకుంటున్నారు. మొత్తంగా ఎమ్మెల్యేలు, ప్రధాన నేతలు ఎవరిని సూచించినా మంత్రి తుమ్మల నిర్ణయమే తుది నిర్ణయం అవుతుందని సమాచారం. తుమ్మలతో సఖ్యత లేని నేతలు ఈ పదవులను దక్కించుకోవాలని నేరుగా తమకున్న మార్గాల్లో ఇతర మంత్రులతో మంత్రాంగం నెరిపేందుకు సమాయత్తమవుతున్నారు. అంతటా తుమ్మల అనుచరులకే పదవులు ఇస్తే తమ పరిస్థితి ఏమిటని గతంలోనే పలువురు నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ పరిస్థితులతో పదవులు ఎవరికి దక్కుతాయోనని ఉత్కంఠ నెలకొంది. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి కూడా ప్రాముఖ్యతను సంతరించుకోవడంతో దీనిపై నేతల మధ్య పోటీ నెలకొంది. గతంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా చేసి ప్రస్తుతం టీఆర్ఎస్లో ఉన్న వారికి ఈ పదవిని ఇవ్వనున్నట్లు తెలిసింది. ఏడాదికి రూ.25 కోట్లపైనే భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవాలయానికి ఆదాయం ఉంటుంది. ఇక్కడ శ్రీరామనవమి, పట్టాభిషేకంతోపాటు ఇతర ఉత్సవాలు నిర్వహించడం పాలకవర్గానికి సవాలే. అయితే రాష్ట్రవ్యాప్తంగా, జిల్లాలోనూ ఈ ట్రస్ట్ బోర్డుకు చైర్మన్ పదవితోపాటు సభ్యులు భర్తీకి సంబంధించి ప్రతిష్టాత్మక పోరు నెలకొంటుంది. చైర్మన్ పదవితోపాటు 9మంది సభ్యులను పాలకమండలికి ఎన్నుకుంటారు. 2013లో ట్రస్ట్‌బోర్డు పాలకవర్గం పదవీ కాలం ముగిసింది. ఇటీవల ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరిన నాయకులు అందరూ ఈ ట్రస్ట్‌బోర్డు చైర్మన్ పదవిపై గురిపెట్టారు. రిజర్వేషన్లపై గిరిజనుల ఆశలు.. నామినేటెడ్ పోస్టుల్లో రిజర్వేషన్లను కూడా పరిశీలిస్తామని గతంలో సీఎం ప్రకటించడంతో ఏజెన్సీలోని గిరిజన నేతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇల్లెందు, ఏన్కూరు, బూర్గంపాడు, భద్రాచలం కమిటీల్లో గిరిజనేతరులను నియమించొద్దని కోర్టుల్లో కేసు పెండింగ్‌లో ఉంది. అయితే ముఖ్యమంత్రి నిర్ణయంతో ఇక్కడ గిరిజనులను నియమిస్తే ఎలాంటి వివాదం ఉండదని ఆ పార్టీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా గిరిజనులకు నామినేటెడ్ పోస్టుల్లో కూడా ప్రాధాన్యం ఇస్తే ఏజెన్సీలో పార్టీ పరిస్థితి మెరుగవుతుందనే భావనలో ఉన్నట్లు తెలిసింది. రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవులను పొందేందుకు ఇటీవల జిల్లాలో ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యే పదవికి పోటీ చేసి ఓటమి చెందిన నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. -
పత్తి బస్తానే.. పాడె కట్టెనా..
ఖమ్మం: కలిసిరాని కాలంతో అంతంత మాత్రమే పత్తి పండింది.. ఆ కొంచెం దిగుబడినీ చేతబట్టుకొని వస్తే మార్కెట్లో ధర వెక్కిరించింది.. ఇక ఏ దిక్కూలేక వచ్చినకాడికి అమ్ముకునేందుకు సిద్ధమైనా.. అప్పులు కళ్లముందు కదలాడాయి. గుండెను పిండేస్తున్న ఆ ఆందోళనతో.. అక్కడే.. ఆరుగాలం చెమటోడ్చి పండించిన ఆ పత్తిబస్తాలపైనే కుప్పకూలిపోయాడు.. ప్రాణాలు వదిలేశాడు.. పత్తి అమ్మేం దుకు సోమవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు వచ్చిన రైతు గొర్రెముచ్చు వెంకటి (58) వ్యథ ఇది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నేరెడ గ్రామానికి చెందిన వెంకటికి భార్య, ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన తనకున్న రెండెకరాల భూమితో పాటు మరో 10 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాడు. పెట్టుబడి కోసం మూడు లక్షల రూపాయలు అప్పు తెచ్చాడు. వర్షాభావ పరిస్థితుల కారణంగా పంట దిగుబడి తగ్గిపోయింది. వచ్చినకాడికి తీసి దాచిన 10 బస్తాల పత్తిని అమ్మేందుకు సోమవారం ఖమ్మంలోని వ్యవసాయ మార్కెట్‌కు వచ్చాడు. సీసీఐ కొనుగోళ్లు నిలిపివేయడంతో ప్రైవేటు వ్యాపారులు పత్తి ధర తగ్గించారు. వెంకటి తెచ్చిన పత్తి క్వింటాల్‌కు రూ. 3,600 చొప్పున మాత్రమే ఇస్తామన్నారు. దీంతో ఆందోళన పడ్డ వెంకటి.. చివరికి వచ్చినకాడికి అమ్ముకునేందుకు సిద్ధమయ్యాడు. గుండెను పిండేస్తున్న ఆందోళనతో... పత్తిని తూకం వేయిస్తుండగానే కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన తోటి రైతులు 108కు సమాచారం ఇచ్చారు. కొద్దిసేపటికే అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది వెంకటి గుండెపోటుతో మరణించాడని నిర్ధారించారు. వెంకటి హఠాన్మరణంతో ఆయన కుటుంబసభ్యుల ఆవేదనకు అంతులేదు. గతేడు చేసిన అప్పులే తీరలేదని, ఈసారి సాగు కోసం మరిన్ని అప్పులు చేయాల్సి వచ్చిందని చెప్పారు. కాగా.. వెంకటి కుటుంబానికి రైతు బీమా పథకం కింద రూ. లక్ష చెల్లిస్తామని మార్కెట్ అధికారులు ప్రకటించారు. అంత్యక్రియల కోసం రూ. 30 వేలు ఇస్తామన్నారు. కాగా, వెంకటి కుటుంబానికి ప్రభుత్వం రూ. 5 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని న్యూడెమోక్రసీ, రైతుకూలీ సంఘం డిమాండ్ చేశాయి. గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమవడంతోనే మరణాలు చోటు చేసుకుంటున్నాయని మండిపడ్డాయి. మరో ఇద్దరు రైతులు బలి! ఓదెల/ములుగు: అప్పుల బాధతో మరో ఇద్దరు రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. కరీంనగర్ జిల్లా ఓదెల మండలం ఇందుర్తికి చెందిన తాడూరి రవీందర్‌రెడ్డి(45), వరంగల్ జిల్లా ములుగు మండలం బరిగలోనిపల్లికి చెందిన పంచగిరి భిక్షపతి(55) ఆత్మహత్య చేసుకున్నారు. -
ఈ-బిడ్డింగ్‌పై వ్యాపారుల ఆందోళన
ఖమ్మం వ్యవసాయం: ఎలక్ట్రానిక్ బిడ్డింగ్‌లో అమలు జరుగుతున్న విధానాలను వ్యతిరేకిస్తూ ఖమ్మం మార్కెట్లో గురువారం కమీషన్ వ్యాపారులు జెండాపాటను అడ్డుకున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఎలక్ట్రానిక్ బిడ్డింగ్ విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. దీనిలో బాగంగా అమ్మకానికి వచ్చిన పంట ఉత్పత్తిని ఖరీదు దారులు చూసుకొని నాణ్యతా ప్రమాణాల మేరకు ధరను రహస్యంగా బిడ్డింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ బిడ్డింగ్‌లో అధిక ధరను కోడ్ చేసిన వ్యాపారికి రైతు సరుకును అమ్మేలా చర్యలు తీసుకున్నారు. గతంలో ఖరీదుదారులు సరుకుకు తాము పెట్టే ధరను రైతులకు చెబుతూ బిడ్డింగ్ చేసేవారు. ప్రస్తుతం ఆ విధానాన్ని మార్చి రహస్య విధానం చేపట్టడంతో కమీషన్ వ్యాపారులు తిరుగుబాటు చేశారు. గతంలో మాదిరిగా ఖరీదుదారులు సరుకుకు పెట్టే ధరను రైతులకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ విధానం అమలు చేసే వరకు సరుకు కొనుగోలు చేయనీయమని అడ్డుకున్నారు. జెండాపాట నిర్వహించవద్దంటూ పత్తి మార్కెట్ అసిస్టెంట్ సెక్రటరీ ఖాదర్‌బాబాను డిమాండ్ చేశారు. దీంతో ఆయనకు, కమీషన్ వ్యాపారులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి మహ్మద్ అబ్దుల్ జావీద్, ఖమ్మం అసిస్టెంట్ మార్కెటింగ్ డెరైక్టర్ కె.సీ.రెడ్డి అక్కడికి చేరుకుని చాంబర్ ఆఫ్ కామర్స్ దిగుమతి శాఖ అధ్యక్ష, కార్యదర్శులు నున్నా కోదండరాములు, మాటేటి రామారావుతో చర్చించారు. ఆ తర్వాత జెండా పాట నిర్వహించడానికి వెళ్లగా, వ్యాపారులు మళ్లీ అడ్డుకున్నారు. దీంతో వ్యాపారులకు-అధికారులకు మధ్య మరోసారి వాగ్వాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక్క ఖమ్మం మార్కెట్లోనే ఈ-బిడ్డింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారని కమీషన్ వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కొందరు రైతులు కూడా ఈ విధానం తమకు అర్థం కావటం లేదని వాపోయారు. వ్యాపారుల ఆందోళన తీవ్రం కావడంతో త్రీటౌన్ సీఐ రహమాన్ మార్కెట్‌కు చేరుకుని సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. అనంతరం వ్యాపారులు, ఖరీదుదారుల ప్రతినిధులు, చాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షులు గొడవర్తి శ్రీనివాసరావు, మన్నెం కృష్ణ, రమేష్ భద్రం తదితరులు సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఎలక్ట్రానిక్ బిడ్డింగ్‌ను అమలు చేస్తున్నారని, రాష్ట్ర మంత్రి, ప్రభుత్వం మెప్పు పొందేందుకు అధికారులు ఈ విధానాన్ని అమలు చేస్తున్నారని వ్యాపారులు ఆరోపించారు. అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకే ఈ-బిడ్డింగ్ ఏర్పాటు చేశామని, నిబంధనల మేరకు విధానాలను అమలు చేస్తున్నామని మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి మహ్మద్ అబ్దుల్ జావీద్ చెప్పారు. ఇలా వాదోపవాదాల అనంతరం రైతులు ఇబ్బంది పడకుండా తాత్కాలికంగా పాత విధానంతో సరుకు కొనుగోలుకు అధికారులు అంగీకరించారు. దీంతో మద్యాహ్నం 2:45 గంటలకు జెండాపాట నిర్వహించారు. -
ఖమ్మం టు ఇంగ్లండ్... వయా ముంబై
* జడలు విప్పుతున్న బెట్టింగ్ మాఫియా * జిల్లాలో జోరుగా క్రికెట్ పందేలు మ్యాచ్ జరిగితే రూ.5కోట్లు తారుమారు * చేతులు మారుతున్న వందల కోట్ల రూపాయలు * హాట్‌లైన్, ఫేస్‌టుఫేస్ పేరుతో పందేలు * లక్షలాది రూపాయలు నష్టపోతున్న యువత * రాజకీయ నాయకులు, బడాబాబుల నుంచి సామాన్యుల వరకు అదే బాట * ఆర్థికంగా, మానసికంగా కుంగిపోయి వ్యసనాలకు లోనవుతున్న వైనం ఖమ్మం: ఖమ్మం మార్కెట్లో స్విచ్ వేస్తే ఎక్కడో ఉన్న లండన్‌లో లైటు వెలుగుతోంది. ఇక్కడ ఊ.. అంటే ముంబైలో పచ్చనోట్లు రెపరెపలాడుతున్నాయి. ఇదేమిటీ అని ఆశ్చర్యపోతున్నారా...జిల్లాలో జరుగుతున్న క్రికెట్ బెట్టింగ్‌ల మహిమ. యువకులు, వ్యాపారులు, రాజకీయనాయకులు ఎందర్నో కట్టిపడేసి నిలువునా ముంచేస్తున్న ఈ వ్యసనంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం... వ్యసనపరుల బలహీనతను ఆసరాగా చేసుకున్న బెట్టింగ్ మాఫియా జిల్లాలో జడలు విప్పుతోంది. ట్వంటీ20, 50ఓవర్ల మ్యాచ్‌లు, లీగ్మ్యాచ్ల పేరుతో కోట్లాది రూపాయలు బెట్టింగ్‌ల రూపంలో చేతులు మారుతున్నాయి. ఇందుకు లండన్ ప్రధాన వేదికగా, ముంబై మాఫియా కనుసన్నల్లో ఆన్లైన్ కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఫలానా ఓవర్ వరకు ఇన్ని పరుగులు కొడతారని, మొత్తం ఇన్నింగ్స్‌లో ఇన్ని పరుగులు కొడతారని, ఫలానా జట్టు గెలుస్తుందని పందేలు కాస్తున్న వారు.. ముఖ్యంగా యువతరం బెట్టింగ్ మోజులో పడి లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. ఈ బెట్టింగ్‌లో రాజకీయ నాయకులు, బడాబాబులు, విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున పాలుపంచుకుంటున్నారు. ఎక్కడైనా సరే ఒక్కమ్యాచ్ జరిగితే... జిల్లా వ్యాప్తంగా బెట్టింగ్ రూపంలో రూ.5 కోట్లు చేతులు మారుతున్నాయంటే పందేల తీవ్రత అర్థం చేసుకోవచ్చు. జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాలే కాదు...మండల కేంద్రాలకు కూడా బెట్టింగ్ మాఫియా విస్తరించింది. ఈ బెట్టింగ్‌ల రూపంలో ఇప్పటికే జిల్లాలో వందల కోట్ల రూపాయలు మార్పిడి జరిగిఉంటుందని అంచనా. ఈ జూదంలో వందలాది మంది జీవితాలు బలయిపోతున్నాయి. సునాయసంగా డబ్బులు సంపాదించుకోవచ్చనే ఆశతో లక్షల రూపాయలు పందేలు కాసి పోగొట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. అప్పులపాలై మానసిక వ్యథకు గురయిన వీరు పలు వ్యసనాలకు కూడా బానిసలవుతున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసు యంత్రాంగం మాత్రం చేష్టలుడిగి చూస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముంబై, హైదరాబాద్, ఢిల్లీ, కోల్‌కతా లాంటి మెట్రోపాలిటన్ నగరాల తరహాలో బెట్టింగ్ నడుస్తున్నా నియంత్రించడంలో పోలీసు శాఖ విఫలమయిందనే భావన ప్రజల్లో నెలకొంది. బెట్టింగ్ కడతారిలా....! ఈ బెట్టింగ్ ప్రక్రియ చాలా పక డ్బందీగా జరుగుతుంది. ట్వంటీ20 నుంచి ఎలాంటి మ్యాచ్ జరిగినా హాట్‌లైన్ ఓపెన్ అయిపోతుంది. ముందుగా మ్యాచ్ ప్రారంభం కాగానే 10 ఓవర్లకు బ్యాటింగ్ జట్టు ఎంత స్కోరు చేస్తుందనేది నిర్ధారించి ఆ స్కోరుపై బెట్టింగ్ కాస్తారు. నిర్వాహకులు ఇంత స్కోరు చేస్తుందని చెపితే బెట్టింగ్ చేసేవాళ్లు ఎస్ ఆర్ నో చెప్పాలి. దానిని బట్టి 10 ఓవర్లు పూర్తయిన తర్వాత గెలుపోటముల ఆధారంగా అప్పటికే వారి వద్ద ఉన్న నగదు నుంచి మినహాయించుకోవడం లేదా బ్యాంకు అకౌంట్లలో నగదు జమ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత 25, 35, 50 ఓవర్లకు, మరలా ఇన్నింగ్స్కోరుకు, ఆ తర్వాత మ్యాచ్ ఫలితంపై... ఇలా పలు దశల్లో మ్యాచ్ పూర్తయ్యే వరకు ఈ బెట్టింగ్ ప్రక్రియ నడుస్తూనే ఉంటుంది. ఒక పందెం ఓడితే ఆ డబ్బులు రాబట్టుకోవాలని, గెలిస్తే మరిన్ని డబ్బులు సంపాదించాలని జూదరులు ఈ బెట్టింగ్‌లో మ్యాచ్ పూర్తయ్యేంతవరకు పాల్గొంటూనే ఉంటారు. ఇక ట్వంటీ20 మ్యాచ్‌లో అయితే తొలుత 6ఓవర్లకు, ఆ తర్వాత ఇన్నింగ్స్ స్కోరు, మరలా మ్యాచ్ఫలితంపై బెట్టింగ్‌లుంటాయి. హాట్‌లైన్ పద్ధతిలో ఇలా ఉంటే.... ఇక ఫేస్‌టుఫేస్ బెట్టింగ్‌ల పేరిట మరో రకం పందేలు నడుస్తున్నాయి. తెలిసిన వ్యక్తుల మధ్య జరిగే ఈ బెట్టింగ్‌లలో కూడా లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి. అయితే, ఈతరహా బెట్టింగ్‌లు మాత్రం మ్యాచ్ ఫలితం పైనే ఎక్కువగా సాగుతున్నాయి. ఈ బెట్టింగ్ ప్రక్రియను నిర్వహించేందుకు జిల్లాలో వందలాది మంది బుకీలున్నట్లు సమాచారం. వీరికి దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఉన్న బుకీలతో సంబంధాలున్నాయని, నిత్యం వారిని సంప్రతిస్తూ బె ట్టింగ్‌లు విచ్చలవిడిగా నిర్వహిస్తున్నారని సమాచారం. వీరి గురించి పోలీసులకు తెలిసినా ఏమీ చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. జూదంలో కోల్పోయి... ఇతర వ్యసనాలకు బానిసలై... ఈ బెట్టింగ్ జూదంలో జిల్లా ప్రజలు లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. యువకులు ఇంట్లో డబ్బులు దొంగిలించి పందేలు కాస్తున్నారు. తల్లిదండ్రులు ఇచ్చిన మోటారు బైక్‌లను సైతం ఫైనాన్స్‌లలో తాకట్టుపెట్టి మరీ బెట్టింగ్‌లు వేస్తున్నారు. ఇక వ్యాపారులు, రాజకీయ నాయకులది కూడా ఇదే పరిస్థితి. కొందరు బడాబాబులు అయితే లక్షల్లో బెట్టింగ్‌లు కడుతున్నారు. ఒక్కోరోజు దాదాపు రూ.3లక్షలు పోగొట్టుకున్న లేదా సంపాదించిన సందర్భాలు కూడా ఉంటాయని, అయితే ఎక్కువగా డబ్బు పోగొట్టుకోవడమే జూదం ప్రధాన లక్షణమని బెట్టింగ్‌లో ఆర్థికంగా నష్టపోయిన ఓ వ్యాపారి ‘సాక్షి’తో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తంచేశారు. ఇలా డబ్బులు పోగొట్టుకున్నామనే బాధతో యువకులు కొన్ని వ్యసనాలకు కూడా లోనవుతున్నారు. తాగుడు, మత్తుమందు లాంటి వాటికి బానిసలయి అటు కుటుంబాలను, ఇటు తమ వ్యక్తిత్వాన్ని బజారుకీడ్చుకుంటున్నారు. ఖాకీలేం చేస్తున్నారు? కోట్ల రూపాయలు చేతులుమారే బెట్టింగ్ రాకెట్ జెట్స్పీడ్తో దూసుకెళుతుంటే అరికట్టాల్సిన పోలీసులు ఏం చేస్తున్నారన్నది ప్రశ్నార్థకంగా మారింది. బుకీల సమాచారం, బెట్టింగ్ వ్యవహారం పక్కాగా తెలిసినప్పటికీ పోలీసు శాఖ చేష్టలుడిగిందనే విమర్శలున్నాయి. పెద్ద ఎత్తున బెట్టింగ్ నడుస్తున్నా చర్యలు తీసుకోకపోవడం, అసలు తీసుకునే ప్రయత్నం కూడా చేయకపోవడంతో ఖాకీలు బుకీల మధ్య ఏదైనా ‘అవగాహన’ఉండి ఉంటుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎప్పుడో ఓ నలుగురుని అరెస్టు చేసి బెట్టింగ్‌పై ఉక్కుపాదం మోపుతామని చెప్పే పోలీసులు ఆ తర్వాత అసలు ఆ వైపు దృష్టి కూడా సారించడంలేదు. పందేల రూపంలో లక్షల రూపాయలు కోల్పోతున్న యువత భవిష్యత్తు నాశనమయిపోతున్నా పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో... విధినిర్వహణలో చురుకుగా, కఠినంగా వ్యవహరిస్తారనే పేరు సంపాదించుకున్న జిల్లా పోలీస్‌బాస్ అయినా కలగజేసుకుని ఈ బెట్టింగ్ జాఢ్యం నుంచి జిల్లా ప్రజలను విముక్తులను చేయాలని ప్రజాసంఘాలు కోరుతున్నాయి.