ఖమ్మం వ్యవసాయం: ఎలక్ట్రానిక్ బిడ్డింగ్‌లో అమలు జరుగుతున్న విధానాలను వ్యతిరేకిస్తూ ఖమ్మం మార్కెట్‌లో గురువారం కమీషన్ వ్యాపారులు జెండాపాటను అడ్డుకున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఎలక్ట్రానిక్ బిడ్డింగ్ విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. దీనిలో బాగంగా అమ్మకానికి వచ్చిన పంట ఉత్పత్తిని ఖరీదు దారులు చూసుకొని నాణ్యతా ప్రమాణాల మేరకు ధరను రహస్యంగా బిడ్డింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ బిడ్డింగ్‌లో అధిక ధరను కోడ్ చేసిన వ్యాపారికి రైతు సరుకును అమ్మేలా చర్యలు తీసుకున్నారు.
గతంలో ఖరీదుదారులు సరుకుకు తాము పెట్టే ధరను రైతులకు చెబుతూ బిడ్డింగ్ చేసేవారు. ప్రస్తుతం ఆ విధానాన్ని మార్చి రహస్య విధానం చేపట్టడంతో కమీషన్ వ్యాపారులు తిరుగుబాటు చేశారు. గతంలో మాదిరిగా ఖరీదుదారులు సరుకుకు పెట్టే ధరను రైతులకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ విధానం అమలు చేసే వరకు సరుకు కొనుగోలు చేయనీయమని అడ్డుకున్నారు. జెండాపాట నిర్వహించవద్దంటూ పత్తి మార్కెట్ అసిస్టెంట్ సెక్రటరీ ఖాదర్‌బాబాను డిమాండ్ చేశారు.
దీంతో ఆయనకు, కమీషన్ వ్యాపారులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి మహ్మద్ అబ్దుల్ జావీద్, ఖమ్మం అసిస్టెంట్ మార్కెటింగ్ డెరైక్టర్ కె.సీ.రెడ్డి అక్కడికి చేరుకుని చాంబర్ ఆఫ్ కామర్స్ దిగుమతి శాఖ అధ్యక్ష, కార్యదర్శులు నున్నా కోదండరాములు, మాటేటి రామారావుతో చర్చించారు. ఆ తర్వాత జెండా పాట నిర్వహించడానికి వెళ్లగా, వ్యాపారులు మళ్లీ అడ్డుకున్నారు. దీంతో వ్యాపారులకు-అధికారులకు మధ్య మరోసారి వాగ్వాదం చోటు చేసుకుంది.
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక్క ఖమ్మం మార్కెట్‌లోనే ఈ-బిడ్డింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారని కమీషన్ వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కొందరు రైతులు కూడా ఈ విధానం తమకు అర్థం కావటం లేదని వాపోయారు.
వ్యాపారుల ఆందోళన తీవ్రం కావడంతో త్రీటౌన్ సీఐ రహమాన్ మార్కెట్‌కు చేరుకుని సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. అనంతరం వ్యాపారులు, ఖరీదుదారుల ప్రతినిధులు, చాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షులు గొడవర్తి శ్రీనివాసరావు, మన్నెం కృష్ణ, రమేష్ భద్రం తదితరులు సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో ఎలక్ట్రానిక్ బిడ్డింగ్‌ను అమలు చేస్తున్నారని, రాష్ట్ర మంత్రి, ప్రభుత్వం మెప్పు పొందేందుకు అధికారులు ఈ విధానాన్ని అమలు చేస్తున్నారని వ్యాపారులు ఆరోపించారు.
అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకే ఈ-బిడ్డింగ్ ఏర్పాటు చేశామని, నిబంధనల మేరకు విధానాలను అమలు చేస్తున్నామని మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి మహ్మద్ అబ్దుల్ జావీద్ చెప్పారు. ఇలా వాదోపవాదాల అనంతరం రైతులు ఇబ్బంది పడకుండా తాత్కాలికంగా పాత విధానంతో సరుకు కొనుగోలుకు అధికారులు అంగీకరించారు. దీంతో మద్యాహ్నం 2:45 గంటలకు జెండాపాట నిర్వహించారు.
ఈ-బిడ్డింగ్‌పై వ్యాపారుల ఆందోళన
Published Fri, Jul 18 2014 2:14 AM | Last Updated on Thu, Jul 11 2019 6:28 PM
Advertisement
Advertisement