మిర్చి మంటలు
ధర పతనంతో పెల్లుబిక్కిన రైతన్న ఆగ్రహం
- రణరంగంగా మారిన ఖమ్మం మార్కెట్
- చైర్మన్, కార్యదర్శుల కార్యాలయాలు ధ్వంసం
- ‘ఈ–నామ్’లో కంప్యూటర్లు, ఫర్నిచర్‌కు నిప్పు
- మార్కెట్లోని సుమారు 1,000 కాంటాలు ధ్వంసం
- పరుగులు తీసిన ఉద్యోగులు, కార్యదర్శి
- రూ. 8 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా
- క్వింటాల్‌కు 2 వేలకు పైగా పడిపోయిన ధర
సాక్షి, ఖమ్మం: మిర్చి ధర ఒక్కసారిగా పతనం కావడంతో రైతన్న కడుపు రగిలింది. కొద్దిరోజుల కింద ఐదారు వేల వరకు పలికిన మిర్చి ధరను శుక్రవారం మూడు నాలుగు వేలకు తగ్గించడంతో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ధర తగ్గించడాన్ని నిరసిస్తూ రైతులు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో ఆందోళనకు దిగారు. మార్కెట్ కమిటీ కార్యాలయంపై దాడి చేశారు. రాళ్లు రువ్వడంతోపాటు కార్యాలయంలోకి ప్రవేశించి కంప్యూటర్లు, ఫర్నిచర్‌ను తగలబెట్టారు. మార్కెట్లోని తూకం కాంటాలనూ ధ్వంసం చేశారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చివరికి పోలీసులు వచ్చి రైతులను చెదరగొట్టారు.
ఆందోళన మొదలైందిలా..
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు శుక్రవారం సుమారు 1.5 లక్షల మిర్చి బస్తాలు వచ్చాయి. ఫిబ్రవరి, మార్చి నుంచి క్రమంగా తగ్గుతున్న మిర్చి ధర ఈ నెలలో అమాంతం పడిపోయింది. గత వారం వరకు సగటున రూ.4,500 నుంచి రూ.5వేల వరకు పలికినా.. శుక్రవారం వ్యాపారులు ఏకంగా రూ.2 వేల నుంచి రూ.4వేల వరకు తగ్గించారు. తొలుత ఉదయం 7 గంటల సమయంలో మార్కెట్ యార్డుల వెలుపల రహదారులపై వేసిన మిర్చి బస్తాల ధరలు నిర్ణయించారు. సరుకు తూకం వేసేందుకు కాంటాలను కూడా సిద్ధం చేసుకున్నారు. అయితే ధర బాగా తగ్గించడంపై మిర్చి రైతులు ఆందోళనకు దిగారు. ఆగ్రహంతో అక్కడి కాంటాలను ధ్వంసం చేసి.. మూకుమ్మడిగా మార్కెట్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు.
మార్కెట్ అధికారులు, చైర్మన్ వచ్చి దీనిపై సమాధానం చెప్పాలని, మిర్చికి తగిన ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్న మార్కెట్ కార్యదర్శి ప్రసాదరావు రైతుల వద్దకు వచ్చి.. ధర నిర్ణయం తమ చేతుల్లో లేదని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో మరింతగా ఆగ్రహించిన రైతులు మార్కెట్ కార్యాలయం ఎదుట కొంత మిర్చి దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. కొద్దిసేపటికి మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్‌జేసీ కృష్ణ మార్కెట్ కార్యాలయానికి వచ్చి రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మార్కెట్‌కు చేరుకుని.. రైతులకు మద్దతుగా ఆందోళన చేపట్టారు.
ఒక్కసారిగా ఉద్రిక్తత..
రైతులకు మద్దతుగా వచ్చిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య చైర్మన్ చాంబర్‌లోకి వెళ్లి మిర్చి ధరపై చైర్మన్‌తో మాట్లాడుతున్నారు. ఇదే సమయంలో మార్కెట్ యార్డుల నుంచి రైతులంతా ఒక్కసారిగా మార్కెట్ కార్యాలయం వద్దకు వచ్చారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్యాలయంపైకి రాళ్లు రువ్వారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య బయటకు వెళ్లిపోయారు. చైర్మన్ ఆర్‌జేసీ కృష్ణ, కార్యదర్శి పాలకుర్తి ప్రసాదరావు, ఉద్యోగులు చాంబర్‌ను వీడి పక్కకు వెళ్లిపోయారు.
రైతులు చైర్మన్ చాంబర్‌లోకి ప్రవేశించి.. అక్కడి కంప్యూటర్, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. తర్వాత కార్యదర్శి కార్యాలయంలో ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలు, ఏసీ, ఫ్యాన్‌లను, పక్కనే ఉన్న ఉద్యోగుల కార్యాలయానికి వెళ్లి రణరంగం సృష్టించారు. కంప్యూటర్లు, ఫర్నీచర్, బీరువాలు, ద్విచక్ర వాహనాలను కూడా ధ్వంసం చేశారు. అడ్డుకోబోయిన కొందరు ఉద్యోగులపైనా దాడి చేయడంతో వారు పరుగులు తీశారు. కొందరు ఉద్యోగులకు రాళ్ల దెబ్బలు తగిలాయి.
పోలీసు బలగాలు వచ్చినా ఆగని ఆందోళన
మార్కెట్ కమిటీలో పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసు బలగాలు వచ్చినా.. రైతులు తమ ఆందోళన విరమించలేదు. మిర్చి ధరను రోజు రోజుకు ఎందుకిలా తగ్గిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన కొనసాగించారు. ధరను బాగా తగ్గించేడంతో తీవ్రంగా నష్టపోతున్నామని, అప్పుల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతసేపు సంయమనం పాటించిన పోలీసులు.. రైతులు తిరిగి మార్కెట్ కార్యాలయం వైపు వస్తుండటంతో రంగంలోకి దిగి వారిని చెదరగొట్టారు.
దీంతో మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత రైతుల ఆందోళన తగ్గింది. ఫర్నీచర్, ఇతర సామగ్రి దహనమవుతుండగా.. ఫైరింజన్‌లను తెప్పించి మంటలు ఆర్పించారు. రైతుల ఆగ్రహానికి మార్కెట్ ధ్వంసం కావడంతో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ మార్కెట్లో ధ్వంసమైన కార్యాలయాలను పరిశీలించి, మార్కెట్ కమిటీ చైర్మన్, సిబ్బందితో మాట్లాడారు. రైతుల ఆందోళన, మార్కెట్‌లో పరిస్థితిపై పోలీసు, మార్కెటింగ్ శాఖల ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు.
రూ.8 కోట్ల ఆస్తి నష్టం
రైతుల ఆగ్రహానికి మార్కెట్‌లోని కార్యాలయాల్లో ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ ధ్వంసమయ్యాయి. సుమారు 40 కంప్యూటర్లు, నాలుగు ల్యాప్‌టాప్‌లు, ఎనిమిది ఏసీలు, ఐదు జీపీఆర్‌ఎస్ కాంటాలు, 20 హ్యాండ్‌పాస్‌లు, 35 టేబుళ్లతోపాటు ప్రింటర్లు, జిరాక్స్ యంత్రాలు, సీసీ కెమెరాలు, స్మార్ట్‌టీవీలు, ఫ్యాన్లు, కూలర్లు, బీరువాలు, ఆఫీస్ ఫైళ్లు, రికార్డులు, వేబ్రిడ్జి యంత్రం ధ్వంసమయ్యాయి. వీటితోపాటు వ్యాపారులకు చెందిన సుమారు వెయ్యి ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలను ధ్వంసం చేశారు. మొత్తంగా రూ.8 కోట్ల మేరకు ఆస్తి నష్టం జరిగినట్లు భావిస్తున్నారు. మరోవైపు వ్యాపారుల ఎలక్ట్రానిక్ కాంటాలు ధ్వంసం కావడంతో.. మార్కెట్లో పంటలను కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నారు.
తప్పిన పెను ప్రమాదం!
రైతులు ఈ–నామ్ కేంద్రంలోని ఫర్నీచర్‌ను, ఎలక్ట్రానిక్ వస్తువులను దహనం చేసిన సమయంలో పక్కనే మిర్చి బస్తాలున్నాయి. ఆ యార్డుతోపాటు పక్క యార్డులలో, రహదారులపై, సమీప ప్రాంతాల నిండా మిర్చి బస్తాలున్నాయి. అసలే మండుతున్న ఎండ.. ఇటు ఫర్నీచర్ దహనంతో మంటలు చెలరేగుతాయేమోననే ఆందోళన వ్యక్తమైంది. అంతేకాదు మార్కెట్‌యార్డులోగానీ, సమీపంలోగానీ ఫైరింజన్ అందుబాటులో లేదు. ఒకవేళ యార్డులో మిర్చి బస్తాలకు మంటలు అంటుకుని ఉంటే.. పెద్ద ప్రమాదమే తలెత్తేది. పరిస్థితి చేయి దాటిపోయేది. ఖమ్మం నగరమంతా అతలాకుతలమయ్యేది. పోలీసులు అప్రమత్తమై రైతులను చెల్లాచెదురు చేయడం, మంటలను ఆర్పడంతో ప్రమాదం తప్పింది.
ఈ–నామ్ కార్యాలయం అగ్నికి ఆహుతి
మార్కెట్‌లో ఓ పక్కగా ఉన్న పత్తియార్డులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘జాతీయ వ్యవసాయ మార్కెట్ కార్యాలయం (ఈ–నామ్)’పైనా రైతులు దాడిచేశారు. అందులోని కంప్యూటర్లు, ఫర్నీచర్, ల్యాప్‌టాప్‌లు, ఏసీలను బయటపడేసి నిప్పంటించారు. కంప్యూటర్ క్యాబిన్ అద్దాలన్నీ ధ్వంసం చేశారు. అయితే ఈ–నామ్ కేంద్రాన్ని ప్రస్తుతం పత్తి లావాదేవీల కోసం మాత్రమే ఏర్పాటు చేశారు. ఇటీవలే అధునాతన హంగులతో ప్రారంభించారు. అది మిర్చికి సంబంధించినది కాకున్నా రైతులు దానిని ధ్వంసం చేయడంపై సందేహాలు తలెత్తుతున్నాయి.
దాడి చేసింది రాజకీయ పార్టీల కార్యకర్తలు
‘‘మిర్చికి గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రానికి విన్నవించాం. స్పందన రాలేదు. కానీ దీనిపై కొన్ని పార్టీలు రాజకీయ డ్రామాలు చేస్తున్నాయి. ఖమ్మంలో మార్కెట్ యార్డుపై దాడి అలాంటిదే. రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు రైతుల ముసుగులో వచ్చి దాడికి పాల్పడ్డారు. మార్కెట్‌లోని సీసీ కెమెరాల వీడియోలు చూస్తే.. దాడిలో ముసుగేసుకుని వచ్చినవారున్నారు. వారెవరూ రైతులు కాదు. రైతులెవరూ అలా దాడులు చేయరు. మిర్చి ధరపై రైతులకు సరైన న్యాయం చేస్తాం..’’ – టి.హరీశ్‌రావు, మార్కెటింగ్‌శాఖ మంత్రి
ధర లేదని మిర్చి పంటను తగలబెట్టాడు
మిర్చి ధర పడిపోవడంతో పెట్టుబడి కూడా రాదని మనస్తాపం చెందిన రైతు.. తాను పండించిన పంటకు తనే నిప్పుపెట్టాడు. వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం కౌకొండకు చెందిన చుక్క రాజయ్య తన రెండెకరాల పొలంలో మిర్చి పంట సాగు చేశాడు. ఇప్పుడు పంట దిగుబడికి వచ్చి, అమ్ముదామనుకునే సరికి ధర బాగా పడిపోయింది. దీంతో ఆందోళనకు లోనైన రాజయ్య.. దిక్కుతోచని పరిస్థితిలో శుక్రవారం మిర్చి పంటకు నిప్పు పెట్టుకున్నాడు. తగిన మద్దతు ధరకు కొంటామంటూ ఒప్పందం చేసుకున్న ఐటీసీ కంపెనీ వారు చెప్పినట్లుగానే పంట పండిచానని.. కానీ వారు పంటను కొనకుండా మొండిచేయి చూపారని తెలిపారు.