ఖమ్మంలో మిర్చిని గ్రేడింగ్ చేస్తున్న మహిళా కూలీలు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: మిర్చి అంటేనే హాట్.. కానీ ఖమ్మం మిర్చి మరింత హాట్.. ఎందుకంటే విదేశాల్లో ఈ మిర్చికి హాట్ హాట్‌గా డిమాండ్ పెరిగిపోతోంది. ఖమ్మం రైతులు పండిస్తున్న మిర్చిలో 70శాతం మేర చైనా, థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా, బంగ్లాదేశ్, శ్రీలంక తదితర దేశాలకు ఎగుమతి అవుతోంది. ఘాటు ఎక్కువగా ఉండే తేజ రకం మిర్చి ఎక్కువగా సాగు చేయడం, తెగుళ్లు వంటివి పెద్దగా లేకుండా నాణ్యమైన దిగుబడులు రావడంతో డిమాండ్ మరింత పెరిగిందని రైతులు, వ్యాపారులు చెప్తున్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ నుంచి ఏటా రూ.2 వేల కోట్లకుపైగా మిర్చి ఎగుమతి అవుతుండటం గమనార్హం.
ఖమ్మం టు చైనా.. వయా చెన్నై
తామర పురుగు బెడదతో రైతులు ఈసారి ముందుగానే మిర్చిని సాగు చేయగా జనవరి నుంచే ఎగుమతులు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లక్షకుపైగా ఎకరాల్లో మిర్చి సాగవుతోంది. సమీపంలోని సూర్యాపేట, నల్లగొండ, మహబూబాబాద్, హనుమకొండ, ఏపీలోని కృష్ణా, గుంటూరు రైతులు కూడా ఖమ్మం మార్కెట్‌లో మిర్చి విక్రయిస్తారు.
వ్యాపారులు విదేశాల నుంచి ఆర్డర్లు తీసుకుని ఇక్కడ మిర్చిని కొనుగోలు చేస్తున్నారు. ఆ మిర్చిని వాహనాల్లో చెన్నైతోపాటు తమిళనాడులోని కాట్‌పల్లి, ఆంధ్రాలోని కృష్ణపట్నం, విశాఖపట్నం, ముంబై పోర్టులకు తరలించి నౌకల్లో విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రధానంగా చైనాలో ఎక్కువ కారం ఉండే మిర్చి దొరకకపోవడంతో.. ఖమ్మం మిర్చిని దిగుమతి చేసుకుంటారని వ్యాపారులు చెప్తున్నారు.
3రూపాల్లో ఎగుమతి..
మన దేశంలో ఎక్కువగా పొడి కారం వినియోగిస్తారు. విదేశాల్లో నేరుగా ఎక్కువగా వాడుతారు. ఈ క్రమంలోనే మూడు రకాలుగా.. ఫుల్ మిర్చి (పూర్తిస్థాయి మిరప), స్టెమ్‌కట్ (తొడిమ కత్తిరించి), స్టెమ్‌లెస్ (తొడిమ పూర్తిగా తొలగించి) మిర్చిగా ఎగుమతులు జరుగుతాయి. స్టెమ్‌కట్ కోసం యంత్రాలను ఉపయోగిస్తారు. స్టెమ్‌లెస్ విధానంలో పంపే వ్యాపారులు మహారాష్ట్ర, నాగ్‌పూర్, మధ్యప్రదేశ్ నుంచి వచ్చి ఖమ్మంలో కొనుగోలు చేసి తీసుకెళ్లారు.
మిర్చి ఆయిల్ రూపంలోనూ..
చైనా వంటి దేశాల్లో మిర్చిని కాయల రూపంలో వాడితే.. ఉత్తర అమెరికా, యూరప్ దేశాల్లో మిర్చి నుంచి తీసిన ఆయిల్‌ను ఉపయోగిస్తారు. ఇందుకోసం మిర్చి నుంచి నూనె తీసే కంపెనీలు ఖమ్మం జిల్లా ముదిగొండ, మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మన్నెగూడం, మరిపెడ బంగ్లా, హైదరాబాద్‌లోని శ్రీశైలం రోడ్డులో ఉన్న కందుకూరు తదితర ప్రాంతాల్లో ఏర్పాటయ్యాయి. 100 కేజీల మిర్చిని ప్రాసెస్ చేస్తే 8.50 కేజీల పొడి, కేజీన్నర ఆయిల్, మిగతా పిప్పి వస్తుందని చెప్తున్నారు. మిర్చి ఆయిల్‌ను ఆహార పదార్థాల్లో వినియోగించడంతోపాటు సుగంధ ద్రవ్యాలు, ఔషధాలు, టియర్ గ్యాస్, కాస్మొటిక్స్, సబ్బుల తయారీలో ఉపయోగిస్తారు.
చైనా రెస్టారెంట్లలో మన మిర్చే..
చైనాలో హాట్ పాట్ రెస్టారెంట్లు ఎక్కువగా ఉన్నాయి. అంటే సిద్ధం చేసిన ఆహారం కాకుండా.. దినుసులు అందజేస్తారు. వాటితో సిద్ధం చేసుకుని తింటుంటారు. ఈ క్రమంలో వినియోగదారులకు 10 నుంచి 15 వరకు స్టెమ్‌లెస్ మిర్చి ఇస్తారు. ఇందుకోసం ఖమ్మం నుంచి దిగుమతి చేసుకునే మిర్చినే వినియోగిస్తారని వ్యాపారులు చెప్తున్నారు.
విదేశాల్లో ఖమ్మం మార్కెట్‌కు గుర్తింపు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పండే మిర్చి నాణ్యత బాగుండటంతో ఎగుమతులు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రభుత్వం కూడా వ్యాపారులను ప్రోత్సహిస్తోంది. దీంతో రైతులకు గిట్టుబాటు ధర లభిస్తోంది.
– దోరేపల్లి శ్వేత, చైర్‌పర్సన్, ఖమ్మం వ్యవసాయ మార్కెట్
ఎనిమిదేళ్లుగా ఎగుమతి చేస్తున్నా..
మా నాన్న మిర్చి రైతు. నేను ఎనిమిదేళ్లుగా విదేశాలకు ఎగు మతి చేస్తున్నాను. తేజ రకానికి విదేశాల్లో డిమాండ్ ఉంది.
– బొప్పన జగన్‌మోహన్‌రావు, మిర్చి ఎగుమతిదారు, ఖమ్మం
దిగుబడి బాగుంది
ఐదేళ్లుగా తేజ రకం సాగు చేస్తున్నా. ఈసారి మూడెకరాల్లో సాగు చేశా. మొదటితీతలో 30 క్వింటాళ్ల దిగుబడి రాగా.. మరో 30 క్వింటాళ్లు వస్తుంది. క్వింటాల్‌కు రూ.18,200 ధర వచ్చింది.
– బానోత్ శంకర్, రైతు, మహబూబాబాద్ జిల్లా
Comments
Please login to add a commentAdd a comment