Green crop
-
చిట్టి చేతుల కూరలు
కరోనాతో అందరూ ఇంటికి పరిమితమైపోయారు. పిల్లలకు ఇంటి దగ్గర తోచట్లేదంటున్నారు. ‘ఆకలి! ఆకలి!’ అంటూ గోల చేస్తున్నారు. వాళ్ల దృష్టి మళ్లించటంలో తల్లిదండ్రులు తలమునకలైపోతున్నారు. ఆటలు ఆడిస్తున్నారు, పాటలు పాడిస్తున్నారు, కథలు చెబుతున్నారు. అవి అయిపోగానే మళ్లీ ఆకలి అంటున్నారు. ఇప్పుడు వాళ్ల ఆకలిని తీరుస్తూనే, వాళ్ల దృష్టిని మరలించటానికి మంచి మార్గం ఉంది అంటున్నారు హఫీజ్ అనే పరిశోధకురాలు. వాళ్లు తినే అన్నం కంచంలోకి ఆకు కూరలు ఎలా వచ్చి చేరుతున్నాయో నేర్పమంటున్నారు. విద్య అంటే పాఠాలు, పుస్తకాలు మాత్రమే కాదు, సొంతంగా చూసి తెలుసుకోవటం వల్లే మంచి పరిజ్ఞానం వస్తుంది...అంటారు పరిశోధకురాలు డా.జెన్నిఫర్ క్లెమెంట్. ముఖ్యంగా కాయగూరల పేర్లు, ఆకుకూరల పేర్లు, అవి ఎలా పండుతాయి వంటివి చదవటం కంటె, స్వయంగా పండిస్తూంటే, పండించటంలోని కష్టం తెలుసుకోవటమే కాదు, స్వయంగా పండించిన పంటలను వండుకు తినటంలో ఆసక్తి చూపుతారు అంటున్నారు జెన్నిఫర్. పది సంవత్సరాల వయసు ఉన్న తన కుమార్తె ట్రినిటీకి తాను స్వయంగా ఇవన్నీ నేర్పుతున్నాను అంటున్నారు. ఈ జోన్ ద్వారా... చెన్నైకు చెందిన ఈ జోన్ వారు వాట్సాప్ ద్వారా ఆన్లైన్ గార్డెనింగ్‌ను పిల్లలకు నేర్పుతున్నారు. ఈ విషయాన్ని గమనించారు జెన్నిఫర్. ‘మా అమ్మాయికి ఇప్పుడు విత్తనాలు నాటడం, మొక్కలు పెంచటం, ఏ మొక్క ఆకు ఏ రకంగా ఉంటుంది వంటి విషయాలు చెప్పటానికి మంచి అవకాశం దొరికింది. ఈ గ్రూప్‌లో చేరి తను అన్నీ సొంతంగా నేర్చుకుంటోంది. ప్రతిరోజూ మొక్కలకు శ్రద్ధగా నీళ్లు పోస్తోంది. ఆకు తొడిగిన దగ్గర నుంచి, పంట చేతికి వచ్చేవరకు ప్రతిరోజూ మొక్కలను పరిశీలిస్తోంది’ అంటారు జెన్నిఫర్. ఈ జోన్ వ్యవస్థాపకురాలు హఫీజ్ ఖాన్ ఆలోచన ఇది. హఫీజ్ ఖాన్ మొక్కల పెంపకం గురించి పాఠశాలలకు వెళ్లి పిల్లలకు స్వయంగా ఒక పీరియడ్ తీసుకునేవారు. ఆ రోజు నుంచి తన టీమ్‌తో కలిసి, పిల్లలకు పంటల ఉత్పత్తి గురించి విపులంగా తెలియచేస్తున్నారు. వాటితో పాటు మంచి అలవాట్లు కూడా నేర్పుతున్నారు. ‘‘పిల్లలు బాల్కనీలో మైక్రో గ్రీన్స్ పండించవచ్చు. ఇంటిదగ్గర ఉన్న విత్తనాలతోనే ఈ పని చేయొచ్చు. వారు చేయవలసినదల్లా వీటిని పెంచటానికి కావలసిన మట్టి, కుండీలను సేకరించటమే. చిన్నతనం నుంచే ఇలా మొక్కలు పెంచటం వల్ల పిల్లల్లో మంచి ఆలోచనలు మొలకెత్తుతాయి’ అంటున్నారు హఫీజ్. పిల్లలే ఆకుపచ్చ రాయబారులు.. సుమారు పదిహేను సంవత్సరాలుగా హఫీజ్ ఈ జోన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రజలలో చైతన్యం కలిగిస్తున్నారు. 2015లో కమ్యూని‘ట్రీ’ని ప్రారంభించారు. పాఠశాలల్లో వీటి గురించి చెప్పడానికి కొన్ని పరిమితులు ఉండేవి. ఇప్పుడు ఆన్లైన్లో ఏ పరిమితులు లేకుండా నేర్పటానికి అవకాశం ఉంది. ‘ఇంతకాలం చేసింది వేరు. ఇప్పుడు ఈ లాక్డౌన్ వల్ల, మాలో ఒక కొత్త ఆలోచన వచ్చింది. వాట్సాప్ వీడియోల సెషన్స్ ద్వారా ప్రపంచంలోని పిల్లలందరికీ నేర్పించవచ్చు కదా అనిపించింది. ఇప్పటి వరకు 18 బ్యాచ్‌లు నిర్వహించాం. ప్రతి బ్యాచ్‌లోను 80 – 120 విద్యార్థులు ఉంటున్నారు. ప్రతిరోజూ ఒక గంటసేపు ఆన్లైన్ క్లాస్ ఉంటుంది. ఉదయం 10.30 కు ఒకసారి, సాయంత్రం 4.30కు ఒకసారి. ఏ విధంగా మొక్కలు పెంచాలి అనేదానిపై శిక్షణ ఉంటుంది. పిల్లల వీడియోలు పిల్లలు ప్రతిరోజూ వారు చేస్తున్న పచ్చదనం సేవ గురించి వీడియోలు తీసి, గ్రూప్‌లో పెడుతుంటారు. వాటి గురించి వివరిస్తుంటారు. సందేహాలు అడిగి తెలుసుకుంటారు. లాక్డౌన్ లో పిల్లలకు హఫీజ్ ఖాన్ ఇలా మొక్కల మీద అవగాహన కల్పించటం నిజంగా మంచి ఆలోచనే. -
వనమాత ఇల్లు చల్లన.. నేలతల్లి పచ్చన
ఏడు ఎకరాల పొలం. సగం చేపల చెరువు,సగం పచ్చని పంటలు. పొలం మధ్యలో చిన్న దీవి.ఆ దీవిలో అందమైన పొదరిల్లు. నిద్ర లేచేది పొలంలోనే,రోజంతా శ్రమించేది పొలంలోనే. విశ్రమించేదీ పొలంలోనే. హరిత విప్లవం, నీలివిప్లవాలను ఇరుగుపొరుగున నడిపిస్తున్న రైతు ఆమె. పేరు దంతులూరి సత్యవతి, వయసు డెబ్భై రెండేళ్లు. ఊరు గుంటూరు జిల్లా, అమర్తలూరు మండలం, పెదపూడి గ్రామం. భర్త వాసుదేవరాజు, సత్యవతి.. ఇద్దరే ఉంటారా ఇంట్లో. ఇంటి చుట్టూ ఉన్న పొలంలో ఎర్రచందనం, శ్రీగంధం చెట్లతోపాటు కొబ్బరి, అరటి, సపోటా, బత్తాయి, నిమ్మ, పైనాపిల్, మామిడి, పనస, బొప్పాయి, జామ, చెర్రీ వంటి పండ్ల చెట్లున్నాయి. వాటి మధ్యలో లవంగాలు, కలబంద, కొండపిండాకు, తిప్పతీగ, నేల ఉసిరి, వావిలాకు, తులసి, తుంగకాయలు, పిప్పళ్లు, కచోరాలు, నేలవేము, పెద్ద ఉసిరి వంటి ఔషధ మొక్కలున్నాయి. చింత, కర్రపెండలం, తమలపాకు, కందిమొక్కలు, రకరకాల కూరగాయల మొక్కలు అల్లం, పసుపు... ఇదీ అదీ అని చెప్పడానికి వీల్లేనన్ని రకాలున్నాయి. మామిడిలో ఆరు రకాలు, అరటిలో ఐదు రకాలున్నాయి. మామిడి అల్లం, నిమ్మగడ్డిని కూడా పెంచుతున్నారు. ఇంకా ఆశ్చర్యంగా కుంచె చీపుళ్ల గడ్డి చెట్లు కూడా గట్ల మీద ఉన్నాయి. కరివేపాకు, తోటకూర, పెరుగు ఆకు, పాల ఆకు, మెంతి ఆకు, పుదీన, కొత్తిమీర వంటి వంటల ఆకులతోపాటు దవనం, మరువం వంటి సువాసన భరితమైన ఆకులు కూడా ఉన్నాయి. ఇన్ని రకాల చెట్లుంటే తేనెటీగలు ఊరుకుంటాయా. తేనెపట్టు పెడతాయి. వాటి నుంచి తేనె తీయించి స్వయంగా మందులు తయారు చేస్తారు సత్యవతి. తన పొలంలో ఉన్న ఔషధ మొక్కల గింజలు, ఆకులతో (32 రకాల దినుసులు) ఔషధనూనె తయారు చేయడంలో నేర్పరి ఆమె. ఒళ్లునొప్పులు, కీళ్ల నొప్పులు తగ్గడానికి, జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి, చుండ్రు, సోరియాసిస్ పోవడానికి రకరకాల ఔషధాల కాంబినేషన్లో నూనెలు చేస్తారామె. ఔషధాల ఆకులను మూడు గంటల సేపు ఉడికించి చల్లార్చి తైలాన్ని తీస్తారు. ముఖం మీద మచ్చలు పోవడానికి కూడా ఆమె దగ్గర ఓ ఫార్ములా ఆయిల్ ఉంది. దేహారోగ్యం కోసం మాదీఫల రసాయనం చేసి రుచి చూపిస్తారు. మేధో వికాసానికి సరస్వతి లేహ్యం చేసిస్తారు. అడిగిన వారికి వీటన్నింటినీ చేసివ్వడం ఆమెకిష్టమైన వ్యాపకం. ‘‘ఉచితంగా చేసివ్వడం ఎందుకు, ముంబయిలో వీటికి మంచి మార్కెట్ ఉంది, కేరళ వాళ్లు అమ్మేది వీటినే. ముంబయికి రండి’’ అని ఆహ్వానం వచ్చిందామెకి. ‘‘నా పొలాన్ని వదిలి ఎక్కడికీ వచ్చేది లేదు. నేను వీటిని డబ్బు కోసం చేయడం లేదు. ఇష్టం కాబట్టి చేస్తున్నాను. వ్యాపారం కోసం కాదు’’ అన్నారామె. ఒంటికి రోజూ పని ఈ వయసులో ఇంత ఆరోగ్యంగా ఇన్ని పనులు చక్కబెట్టడం వెనుక ఆమె ఆరోగ్య రహస్యం రోజూ శ్రమించడమే. ఆమె ఉదయం ఐదు గంటలకు నిద్ర లేస్తారు. ఏడు గంటలకు రాగి జావ తాగుతారు. పదకొండు గంటలకు భోజనం, మధ్యాహ్నం మూడు గంటలకు రాగి లేదా జొన్న అట్టు, సాయంత్రం ఐదు గంటలు దాటితే భోజనం. ఇది ఆమె రాత్రి భోజనం. మధ్యలో పండ్లు తీసుకుంటారు. రాత్రి ఎనిమిదిన్నర తర్వాత తొమ్మిది లోపు నిద్రపోతారు. పాలిష్ పట్టని బియ్యపు వరి అన్నం, రాగి, జొన్న అన్నం తింటారా దంపతులు. ఎంత ఆశ్చర్యంగా అనిపించినా సరే. ఆమె మాంసం మానేసి యాభై ఏళ్లయింది, ఆరేళ్ల నుంచి చేపలు కూడా మానేశారు. ఏడాది కాలంగా గుడ్డునూ వదిలేశారు. ఇప్పుడామె పూర్తి శాఖాహారి. రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల పొడ కూడా సోకని పూర్తి సేంద్రియ సేద్యం ఆమెది. వ్యయసాయ ప్రస్థానం ఈ వనమాత వ్యవసాయ కుటుంబంలో పుట్టి, వ్యవసాయ కుటుంబంలో అడుగుపెట్టి, సాగుతోనే జీవితాన్ని నిలబెట్టుకున్నారు. రెండు జతల ఎడ్లు, పాతిక గేదెలు, వంద గొర్రెలు, లెక్కపెట్టలేనన్ని కోళ్లు ఆమె ప్రపంచం. రాజుగారు (ఆమె భర్త) ప్రయాణించడానికి ఓ గుర్రం ఉండేది. ఆ జ్ఞాపకాలను ఇలా గుర్తు చేసుకున్నారామె. ‘‘మాది బాపట్ల దగ్గర మంతెనవారి పాలెం. అన్ని రకాల పండ్లు తిన్న బాల్యం నాది. అత్తగారిల్లు తెనాలి దగ్గర చిన గాదెలవర్రు. నేను, నా భర్త 1967 నుంచి సొంతంగా సేద్యం చేస్తున్నాం. సత్తెనపల్లిలో పన్నెండెకరాలు కొని చెరకు, పసుపు వంటి రకరకాలు పండించాం. ఆ పొలాన్ని అమ్మేసి 1983లో పెదపూడికి వచ్చి ఏడెకరాల బంజరు భూమిని కొన్నాం. నేలను చదును చేసి, ఒక రూపానికి తెచ్చి సగం చేపల చెరువు పెట్టి, మిగిలిన పొలంలో సాగు చేస్తున్నాం. గట్ల వెంట నూట పాతిక కొబ్బరి చెట్లు పెట్టాం. రకరకాల పంటలతో నిత్యం సాగులోనే ఉంటుంది మా భూమి. సేంద్రియ వ్యవసాయం ఎలా చేయాలో సదస్సులు పెట్టినప్పుడు ఇద్దరం వెళ్తాం. ఆ పుస్తకాల్లో చెప్పిన పద్ధతుల్లో సాగు చేస్తున్నాం. అలా చేస్తున్నందుకు నాకు అవార్డు కూడా వచ్చింది. ‘సంప్రదాయ విజ్ఞానాన్ని ఆచరిస్తున్న మహిళా రైతు’ అని అవార్డు ఇచ్చారు. అంతకు ముందొకసారి మత్స్యశాఖ పరిజ్ఞాన సంస్థ (కాకినాడ) స్వర్ణోత్సవాల పుస్తకంలో (సావనీర్) ఉత్తమ మహిళారైతు అని నా గురించి రాశారు. నేను పుస్తకం చదవడానికి కంటి అద్దాలక్కర్లేదు. రోజంతా పొలంలో మరీ ఎక్కువగా తిరిగినప్పుడు మోకాళ్ల నొప్పులు వస్తాయి. నేను తయారు చేసుకున్న ఔషధ తైలంలో కర్పూరం కలిపి రాసుకుంటాను. సాగు పాఠాలు మా సాగును చూడడానికి అధికారులు వస్తుంటారు. మేము ఏయే పంటలు సాగు చేస్తున్నాం, ఎలా చేస్తున్నామని అడుగుతారు. పొలాన్ని ఫొటోలు తీసుకుని పోతారు. వ్యవసాయం చేస్తున్న కొత్త పిల్లలు పని సులువు కోసం చేయరాని పనులన్నీ చేసి నేలతల్లిని క్షోభ పెడుతున్నారు. తెగుళ్లను ఆపడానికి గుళికలు వేస్తే మట్టి విషమైపోతుంది. కలుపు మొక్కలు తీయడానికి కూలీలకు డబ్బులు లెక్క చూసుకుని తక్కువ ఖర్చులో పనిపూర్తవుతుందని కలుపు మందులు చల్లుతున్నారు. మందు చల్లితే కలుపు మొక్క ఒక్కటే పోతుందా, మట్టిలో జీవం కూడా పోతుంది. మొలకెత్తే గుణాన్ని హరించి వేశామంటే భవిష్యత్తు ఏమవుతుంది? భూమిని ఇలాగే బీభత్సంగా నాశనం చేస్తుంటే కొన్నాళ్లకు మట్టిలో బీజం వేస్తే మొలకెత్తడం మానేస్తుంది. అప్పుడు జనం ఏం తిని బతుకుతారు? అందుకే మనకున్న మొక్కలన్నింటినీ కాపాడుకోవాలి, భూమి తల్లిని రక్షించుకోవాలి? నేను ఈ భూమితోనే పెరిగాను, ఇందులోనే బతికాను, హాయిగా జీవిస్తున్నాను’’ అన్నారు సత్యవతి.ఆమె పిల్లలు బెంగళూరు, బాపట్ల, హైదరాబాదుల్లో ఉన్నారు. వాళ్లు వ్యాపారాలు, ఉద్యోగాలు చేస్తూనే వ్యవసాయం కూడా చేస్తున్నారు. మనిషి ఎంత ఎదిగినా నేల విడిచి సాము చేయకూడదు. పాదాలు నేల మీదనే ఉండాలి, నేల ఆధారంతోనే ఎదగాలి. అప్పుడే జీవితాల్లో సంక్రాంతి వెల్లివిరుస్తుంది... అని సత్యవతి నమ్ముతారు, ఆమె మాటలను ఆమె పిల్లలు విశ్వసిస్తున్నారు. ‘‘మా అమ్మలో మంచి రైతు, గొప్ప వైద్యురాలే కాదు సాగును ఆరోగ్యాన్ని కలగలిపి ఔషధాలతో ఆహారాన్ని తయారు చేసే ఎక్స్పర్ట్ కూడా ఉంది’’ అంటారు. – వాకా మంజులారెడ్డి పిల్లల ఆరోగ్యం తల్లి చేతిలో ప్రతి ఒక్కరూ కాలంతోపాటు మారాల్సిందే. అయితే ఆ మార్పు మనకు మంచి చేసేదై ఉండాలి. మా చిన్నప్పుడు పండ్లతో చేసే జామ్‌ల గురించి తెలియదు. ఇరవై ఏళ్ల నుంచి నేను మా పొలంలో పండిన పండ్లతో జామ్‌లు చేస్తున్నాను. ఉసిరి, బొప్పాయి జామ్‌లు ఎప్పుడూ ఉంటాయి. కలబంద గుజ్జు, పటిక బెల్లం, గోధుమపిండి, నెయ్యి కలిపి హల్వా చేసి ఆడపిల్లలకు పెడతాను. అది తింటే గర్భాశయ సమస్యలు ఇట్టేపోతాయి. నా దగ్గర లేని మొక్క ఎక్కడ కనిపించినా తెచ్చుకుంటాను. బళ్లారి నుంచి గాయం ఆకు, శ్రీశైలం అడవుల నుంచి సరస్వతి ఆకు తీగలు తెచ్చుకున్నాను. నా దగ్గర నల్లమందు ఆకు కూడా ఉంది. ప్రకృతి మనకు నల్లమందు ఆకునిచ్చింది మత్తు కోసం కాదు, వైద్యం కోసం. ఆ ఆకుని పూత మందుల్లో వాడితే గాయం ఇట్టే మాడిపోతుంది. నేలతల్లి మనకు అన్నీ ఇచ్చింది. ఆ నేలతల్లిని కాపాడుకోవాలి. మంచి పంటల్ని పండించుకుని, చక్కగా వండుకుని తిని హాయిగా బతకాలి. రోజంతా ఒంటిని కష్టపెట్టాలి. ఆరోగ్యంగా ఉండాలి. అంతే తప్ప... తల్లులు టీవీల ముందు కూర్చుని పిల్లలకు అడిగినంత డబ్బిచ్చి బేకరీలకు పంపిస్తే వాళ్లు మంచి తిండి తింటారా? పిల్లల ఆయుష్షు పెంచడం, తుంచడం తల్లి చేతిలోనే ఉంది. సిటీల్లో నేల లేకపోతే కుండీలోనే చిన్న వేపమొక్కను పెట్టి, రోజూ నాలుగు ఆకులు తింటుంటే పిల్లలకు పళ్లు పాడవుతాయా? -
పడావు భూముల్లో పచ్చని పంటలు!
సాగునీటికి వసతి లేని ప్రాంతం.. నీరు లేక భూములు బంజరుగా మారడం నల్లగొండ జిల్లా చండూర్ మండలం బంగారిగడ్డ గ్రామానికి చెందిన పాల్వాయి సత్యనారాయణ రెడ్డిని కలవరపరచింది. ఎలాగైనా తమ భూములను పంటలకు ఆలవాలంగా మార్చాలని, పచ్చదనాన్ని నింపుకోవాలన్న తపనతో అన్వేషించగా.. వర్షాకాలంలో కురిసే ప్రతి చినుకునూ ఒడిసిపట్టుకోవడం తప్ప వేరే మార్గం లేదని తోచింది. అయితే, అందుబాటులో ఉన్న అనేక పద్ధతుల్లో దేన్ని అనుసరించాలో అంతుపట్టలేదు. తన కుటుంబానికి చెందిన 50 ఎకరాలకు నీటి భద్రత సాధించుకోవడానికి తక్కువ ఖర్చులో చక్కని ఫలితాన్నిచ్చే నీటి సంరక్షణ పద్ధతి ఏమిటో తేల్చుకోవడం కష్టంగా తోచింది. ఆ దశలో ‘సాక్షి’తో కలసి తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మేరెడ్డి శ్యాంప్రసాద్ రెడ్డి(99638 19074 ), సంగెం చంద్రమౌళి(98495 66009) ఆధ్వర్యంలో సాగుతున్న ‘చేను కిందే చెరువు’ ప్రచారోద్యమం గురించి తెలిసింది. వారి తోడ్పాటుతో 2016 జూన్‌లో ఎకరానికి కేవలం రూ. రెండు వేల ఖర్చుతో వాలుకు అడ్డంగా ప్రతి 50 మీటర్లకు ఒక చోట 3 అడుగుల వెడల్పు, 3 అడుగుల లోతున సత్యనారాయణ రెడ్డి తమ కుటుంబానికి చెందిన 50 ఎకరాల్లో కందకాలు తీయించారు. కందకాలు తవ్వి మట్టి కట్టలు పోయించారు. వాలును బట్టి 3–4, 5–6 ఎకరాల భూమిని ఒక యూనిట్‌గా విభజించి వాలుకు అడ్డంగా 3 అడుగుల, 3 అడుగుల వెడల్పున.. ప్రతి 50 మీటర్లకు ఒక వరుసలో.. కందకాలు తవ్వించి, మట్టికట్టలు పోయించారు. కందకాలు తవ్వించిన తర్వాత రెండేళ్లలో సాధారణ వర్షాలతోపాటు అకాల వర్షాలకు భారీగా వర్షపాతం నమోదైంది. ఆకాశం నుండి పడే ప్రతి చినుకు కందకాలలోకి చేరి ఇంకిపోవడంతో భూగర్భ నీటి మట్టం పెరిగింది. ప్రస్తుతం ఈ భూముల్లోని పత్తి పంట, ఇతర తోటలు ఆకుపచ్చగా కళకళలాడుతున్నాయి. వర్షాకాలంలో రెండు, మూడు వారాలు వర్షం పడకపోయినా పంటలకు ఢోకా లేదన్న భరోసాతో సత్యనారాయణ రెడ్డి ముందుకు సాగుతుండడం తోటి రైతులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. వర్షాలకు పడిన నీరు ఎక్కడికక్కడ ఆ కందకాల ద్వారా ఇంకి భూమి పొరల్లో నిల్వ ఉంటుంది. ఆ విధంగా భూమి పొరల్లోకి చేరిన నీరే.. వర్షాలు మొహం చాటేసిన సమయంలో పత్తి పంటకు, యూకలిప్టస్, టేకు తదితర తోటల్లో భూమికి నిమ్మునిస్తుంది. ఇటీవల వర్షాలు లేకపోయినా ఈ భూముల్లో వేసిన పత్తి ఏపుగా పెరిగింది. ఇదే భూమికి దగ్గర్లోని రైతు భూమిలో పత్తి పంట కళతప్పింది. కందకాలు తవ్వుకొని పత్తి సాగు చేస్తున్నందున ఎకరాకు 20 క్వింటాళ్ళకు పైగానే పత్తి దిగుబడి వస్తున్నదని సత్యనారాయణ రెడ్డి చెప్తున్నారు. తేమ శాతం ఎక్కువగా ఉండడంతో పత్తి దిగుబడి బాగుందన్నారు.తనకున్న 50 ఎకరాలలో ఏడెకరాల్లో టేకు మొక్కలు , ఇతరత్రా మొక్కలు పెంచుతున్నారు. అడవులను పెంచే భూమి చుట్టూ కందకాలు తీయడం మూలంగా మొక్కలు పచ్చగా, ఏపుగా పెరుగుతూ ఆహ్లాదాన్నిస్తున్నాయి. సాగులోకి తేవాలనే.. మూడున్నర ఏళ్ళ క్రితం మా భూములన్నీ పడావు పడి ఉండేవి. అసలు ఎందుకు సాగులోకి తేలేకపోతున్నామన్న బాధ ఉండేది. అప్పట్లోనే విశ్రాంత ఇంజనీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి శ్యాం ప్రసాద్ రెడ్డి పరిచయమయ్యారు. మెట్ట భూముల్లో కూడా కందకాలతో నీటి భద్రత పొందవచ్చని, కందకాలు తవ్వించమని సలహా ఇచ్చారు. వారు చెప్పినట్లు కందకాలు, ఇంకుడు గుంతలు తవ్వించా. అంతకుముందు వర్షం పడినా భూమిలోకి అంతగా ఇంకకుండా వరద వెళ్లిపోయేది. ఇప్పుడు ఎక్కడిదక్కడే ఇంకుతోంది. దీని వల్ల బోర్లలో, బావుల్లో నీటి మట్టం పెరుగుతోంది. ఆనాడు పడావుగా ఉన్న భూములు నేడు పచ్చగా కనిపిస్తుంటే ఆనందంగా ఉంది. దిగుబడి పెరగడంతో మా భూములకు కౌలుదారుల నుంచి డిమాండ్ కూడా పెరిగింది. ప్రతి రైతు తమ భూమిలో కందకాలు తీయించుకోవాలి. – పాల్వాయి సత్యనారాయణ రెడ్డి(98666 13645), బంగారి గడ్డ, చండూర్ మండలం, నల్లగొండ జిల్లా – మునుకుంట్ల గాలయ్య, సాక్షి, చండూర్, నల్లగొండ జిల్లా -
పచ్చని బతుకుల్లో చిచ్చు పెడతారా?
ప్రభుత్వ అధీనంలో ఉన్న 1500 ఎకరాలు పోను 28,500 ఎకరాల పచ్చని పంట పొలాల్ని సేకరించాల్సిందే! అయినా, ఇంత భూమి అవసరమా? అనే ప్రశ్న తలెత్తుతోంది. శాస్త్ర సాంకేతికత పెరిగి, మంత్రివర్గ సమావేశపు ఎజెండాను ఐపాడ్లో చూడ్డం, విశాఖ బాధితులతో హైదరాబాద్‌నుంచి ఇ-పద్దతిన ముఖాముఖి మాట్లాడ్డం చేసే రోజుల్లో రాజధానిని ఎందుకు వికేంద్రీకరించకూడదు అని కొందరు ప్రశ్నిస్తున్నారు. బహుళ అంతస్తు భవనాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేస్తూ రాజధానిని ఏ నాలుగైదు వేల ఎకరాలకో పరిమితం చేయొచ్చని జయప్రకాశ్ నారాయణ వంటి నాయకులూ సూచిస్తున్నారు. సమకాలీనం భూమి. అనేక అస్థిత్వాలకు నెలవు. మానవనాగరికత ఆవిర్భావం నుంచి మనిషికి భూమితో విడదీయరాని బంధం. ఉనికికి, ఉపాధికి, ఉత్పత్తికి, ఉన్నతికి.. ఒక్కటేమిటి అన్నిటికి ఆదెరువు భూమే! ఆ భూమిని లాక్కుంటే, తుపానులో తీగనుంచి విడిపడ్డ ఆకులా అల్లాడి పోతాడు సగటు మనిషి. అందుకే, గుంటూరు జిల్లా, తుళ్లూరు మండలం, మందడం గ్రామానికి చెందిన నీరుకొండ చిట్టిబాబు కలవరపాటుతో ఇప్పుడు నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు. తొంబై సెంట్ల భూమికి యజమాని. మూడు పంటలు పండిస్తూ ఏడాదికి సగటున లక్ష రూపాయలకు పైగా సంపా దిస్తున్నాడు. దీని ఆధారంగానే ఇద్దరు పిల్లల్ని ఇంజనీరింగ్ చదివిస్తున్నాడు. ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే పిల్లల్నెలా చదివించాలి? కుటుం బాన్ని ఎలా పోషించాలి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం భూ సమీకరణ జరుపుతామంటున్న 17 గ్రామాల్లో చిట్టిబాబు లాంటి కుటుంబాలు వేల సంఖ్యలో ఉన్నాయి. భూ సమీకరణ, భూసేకరణ, భూస్వాధీనం... పేరేదైతేనేం, జరిగే దాష్టీకం ఒక్కటే! రైతుల భూముల్ని స్వాధీనపరచుకుంటారు. నష్టపరిహారంగా తృణ మో, పణమో చెల్లించి వారిని నిర్వాసితుల్ని చేస్తారు. రేపెప్పుడో, ఎక్కడో ఎక రాకు వెయ్యిగజాల చొప్పున అభివృద్ధి చేసిన స్థలం ఇస్తామంటారు. వారి కళ్ల ముందే, రాజధాని నిర్మాణం కోసం ప్రకటించిన ప్రాంతానికి చుటు ్టపక్కల భూ ముల విలువ కోట్లరూపాయలు పలుకుతుంది. ఒక పథకం ప్రకారం ఇప్పటికే అక్కడ పెద్దమొత్తం భూములు సేకరించిపెట్టుకున్న బడా బాబులు, పలుకుబడి కలిగిన పెద్దలు, కార్పొరేట్ లాబీయిస్టులు సెంటు భూమి కోల్పోకుండా కోట్లకు పడగలెత్తుతారు. ఆ 17 గ్రామాల్లో భూమి ఉన్నవాళ్ల సంగతి సరే! మరి భూమి లేని నిరుపేదల గతి? ఆ గ్రామాల్లో నివాస ప్రాంతాల జోలికి రాకుండా నివాసే తర ప్రాంతాలతోనే రాజధాని అభివృద్ధి సాధ్యమా? అదే జరిగితే రాజధాని అడ్డ దిడ్డంగా ఉండదా? ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలే! పైగా, భూసమీకరణకు సహకరిస్తారా సరే సరి! లేదంటే భూస్వాధీన చట్టాన్ని వర్తింపజేసి వశపరచుకుం టామని ప్రభుత్వం బెదిరిస్తోంది. నిజంగా అలా చేయగలదా? చట్టప్రకారం వల్లకాదు కనుకే! ఈ ఏడాది మొదట్లో అమల్లోకొచ్చిన భూసేకరణ కొత్త చట్టం ప్రకారమైతే విజ యవాడ పరిసరాల్లో రాజధానికి భూసేకరణ చేయడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. 1894 భూసేకరణ చట్టం గత ఏడాదే మారింది. పలు ప్రతిపాదనలు, సవరణల తర్వాత రూపుదిద్దుకున్న ‘భూసేకరణ, పునరావాస-పరిష్కారంలో న్యాయబద్ధ పరిహారం, పారదర్శకత హక్కు చట్టం-2013’ ప్రకారం ప్రజావస రాలకు ప్రభుత్వం భూసేకరణ జరపాలంటే ఎన్నో నిబంధనల్ని విధిగా పాటిం చాలి. ప్రైవేటు ప్రాజెక్టు అయితే 80 శాతం, పీపీపీ (ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య) పద్ధతిలో ప్రాజెక్టు అయితే కనీసం 70 శాతం ప్రభావిత కుటుం బాల వారి సమ్మతితోనే భూసేకరణ జరపాలి. ప్రభావిత కుటుంబాల్లో... భూమినో, ఇతర స్థిరాస్తినో కోల్పోయేవాళ్లుంటారు. భూమిలేకున్నా కూలీగానో, కౌలు రైతుగానో, చేతి వృత్తుల వారిగానో సదరు భూమితో ముడివడి జీవనో పాధి కోల్పోయేవాళ్లు, భూసేకరణకు మూడేళ్ల ముందు నుంచి ఏదో విధంగా అక్కడ ఉపాధి పొందుతున్న వాళ్లు... ఇలా పలువురిని ప్రభావిత కుటుంబాల జాబితాలో చేర్చారు. భూసేకరణ వల్ల జరిగే సామాజిక ప్రభావాన్ని, పర్యావ రణ ప్రభావాన్ని నిర్దిష్ట పద్ధతిలో అధ్యయనం జరిపి అందుకనుకూలంగా నిర్ణయం తీసుకోవాలి. పర్యావరణానికి, మౌలికవసతులకు తక్కువ నష్టం కలిగే ప్రాంతాలే కాకుండా తక్కువమంది నిర్వాసితులయ్యే ప్రాంతాల్నే ఎంపిక చేసు కోవాలి. సాగునీరుండి ఏడాదికి బహుళ పంటలు పండే భూముల్ని మౌలికంగా సేకరించకూడదు. తప్పని పరిస్థితుల్లో సేకరించాల్సి వస్తే నష్టపరిహారం చెల్లిం పునకు మరిన్ని ప్రత్యేక చర్యలు చేపట్టాలి. మార్కెట్ రేటుకు నాలుగింతలు ఎక్కువ ధర చెల్లించాలని చట్ట నిబంధన. భూమి కోల్పోయే వారికే కాకుండా ప్రభావితులయ్యే అందరికీ నష్టపరిహారం వివిధ రూపాల్లో చెల్లించాల్సి ఉంటుం ది. దీనికి తోడు మౌలిక వసతుల కల్పన, తాగునీరు, రోడ్లు, పోస్టాఫీసులు, డ్రైనేజీ, శ్మశానాలు.. ఇలా అన్నీ నిర్మించి ఇవ్వాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవన్నీ జరిగేవి కావని ప్రభుత్వ పెద్దలకూ తెలుసు. అందుకే భూసేకరణ కాకుం డా, భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్) రాగం పట్టింది సర్కారు. ఈ పద్ధతిలో అయితే, భూమికోల్పోయే వారికి నామమాత్రంగా ఏదో ఇచ్చి, ఇతరుల్ని పట్టిం చుకోకుండానే చేతులు దులుపుకోవచ్చన్నది యోచన కావచ్చు. పెద్ద మొత్తంలో భూమి సమీకరించి కొంత మొత్తాన్ని వాణిజ్యపరంగా వాడి డబ్బు గడించ వచ్చన్నది మరో దూరాలోచన. జరుగుతున్నదేంటి? తుళ్లూరు, మంగళగిరి మండలాల పరిధిలోని 17 గ్రామాల్లో రాజధాని నిర్మాణా నికి 30 వేల ఎకరాలు, అదీ తొలివిడత కింద సేకరించాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. దానికి ప్రాతిపదిక ఏంటో, ఏయే అంశాల ఆధారంగా ఆ నిర్ణయానికి వచ్చారో, వీటినే ఎందుకు ఎంచుకొని ఇతర ప్రాంతాల్ని ఎందుకు కాదన్నారో... ఎవరికీ తెలియదు. ఈ విషయంలో పారదర్శకత లేనే లేదు. శాసనసభలో చర్చించలేదు, అఖిలపక్షం నిర్వహించలేదు, ప్రజాభిప్రాయ సేకరణా చేయ లేదు, రాజధాని ఎక్కడో ప్రతిపాదించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీ తుదినివేదిక వచ్చే వరకైనా కనీసం నిరీక్షించలేదు. ప్రభుత్వ నిర్ణయానికి రోజు రోజుకూ వ్యతిరేకత, ముఖ్యంగా రైతులు, గ్రామీణ ప్రజల్లో వ్యక్తమౌ తోంది. తమ శవాలపైనే రాజధాని నిర్మాణం జరగాలంటున్నారు. ఏడాదికి మూడు, కొన్ని చోట్ల నాలుగు పంటలు పండే ఈ భూముల్నే ఎందుకు ఎంపిక చేశారు? అన్న ప్రశ్నకు విస్పష్టంగా సమాధానం లేదు. ప్రభుత్వ అధీనంలో ఉన్న 1,500 ఎకరాలు పోను 28,500 ఎకరాల పచ్చని పంట పొలాల్ని సేకరించా ల్సిందే! అయినా, ఇంత భూమి అవసరమా? అనే ప్రశ్న తలెత్తుతోంది. శాస్త్ర సాంకేతికత పెరిగి, మంత్రివర్గ సమావేశపు ఎజెండాను ఐపాడ్లో చూడ్డం, విశాఖ బాధితులతో హైదరాబాద్ నుంచి ఇ-పద్ధతిన ముఖాముఖి మాట్లాడ్డం చేసే రోజుల్లో రాజధానిని ఎందుకు వికేంద్రీకరించకూడదు అని కొందరు ప్రశ్ని స్తున్నారు. బహుళ అంతస్తు భవనాల్లో కార్యాలయాలు ఏర్పాటుచేస్తూ రాజధా నిని ఏ నాలుగైదు వేల ఎకరాలకో పరిమితం చేయొచ్చని జయప్రకాశ్ నారా యణ వంటి నాయకులూ సూచిస్తున్నారు. విస్తీర్ణం అడ్డగోలుగా పెంచి, కార్యా లయాలకు కొంత, భూయజమానులకు కొంత, కమర్షియల్‌కు మరి కొంత అని వాటాలు నిర్ణయించడాన్ని అందరూ తప్పుబడుతున్నారు. జీవకళ లేని ప్రకాశం మెట్ట భూములు, వర్షపాతం లేక ఎడారవుతున్న అనంతపురం భూములు... ఇలా తొండలు గుడ్లు పెట్టని భూముల్ని లక్షల రూపాయలు ప్రైవేటు వారితో కట్టించి పరిశ్రమల కోసం సేకరిస్తే రాజకీయంగా విమర్శలు చేసిన వారు పంట పొలాల్లో మంటలెలా పెడుతున్నారనే ప్రశ్నకు జవాబు లేదు. జరగబోయేదేంటి? ఎంపిక చేసిన 17 గ్రామాల్లో 21 వేల రైతు కుటుంబాలున్నాయి. రెండెకరాల లోపు భూములున్న రైతు కుటుంబాలు 15 వేల పైమాటే! ఇక రైతులంతా భూములు కోల్పోయి వెయ్యి, రెండు వేల గజాల స్థలాలకు మాత్రం ఎప్పుడో హక్కుదారులవుతారు. ఈలోపు ఎకరాకు ఏడాదికి పాతికవేల చొప్పున పదేళ్లు నష్టపరిహారం లభిస్తుంది. నమ్ముకున్న భూమికి ఒక్కసారి దూరమరయ్యాక పరిహారం ఫలహారమౌతుంది, ప్రాజెక్టుల కింద ఊళ్లకు ఊళ్లు భూములు కోల్పోయి నిర్వాసితులైన వారిలో, ఎంత నష్టపరిహారం లభించినా 80 శాతం పైగా కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. తరాల తరబడి అనుబంధం ఉన్న భూమిని కోల్పోవాల్సి వస్తోందని తెలిసిన నుంచే మానసిక పతనం మొదలవుతుంది. నక్సల్బరీ ఉద్యమం నుంచి ఈ దేశంలో భూమి కోసం మహోజ్వల పోరాటాలే సాగాయి. పాలకుల్ని నేలకు దించిన నందిగ్రామ్, సింగూర్ మన కళ్లముందరి భూపోరాటాలు. రాజధాని రగడలో భూమిగల వారి భుక్తికే ఇన్ని కష్టాలొచ్చాయి, ఇక భూముల్లేని చిన్న వ్యాపారులు, నిరుపేద బడుగుజీవులు, చేతి వృత్తులవాళ్లు, దినకూలీల బతుకు అగమ్యగోచరమే! రాజ్యమెప్పుడూ బలమైందే! శీర్షాన ఉండే వారి కీర్తికాంక్షకు వాణిజ్య వైఖరి తోడైనప్పుడు సామాన్యజనం కంటికానరు. వారి జీవితాల్ని పునాదిరాళ్లు చేసి ‘అభివృద్ధి’సౌధాలు కట్టే కార్పొరేట్ శక్తులు ఆవహించినపుడు ఇక అడ్డూ, అదుపూ ఉండదు. కడకది ఎక్కడికి దారితీస్తుందంటే, ప్రజా ఉద్యమాలకు పురిటినొప్పులు పుట్టిస్తుంది.