దిలీప్ రెడ్డి
ప్రభుత్వ అధీనంలో ఉన్న 1500 ఎకరాలు పోను 28,500 ఎకరాల పచ్చని పంట పొలాల్ని సేకరించాల్సిందే! అయినా, ఇంత భూమి అవసరమా? అనే ప్రశ్న తలెత్తుతోంది. శాస్త్ర సాంకేతికత పెరిగి, మంత్రివర్గ సమావేశపు ఎజెండాను ఐపాడ్‌లో చూడ్డం, విశాఖ బాధితులతో హైదరాబాద్‌నుంచి ఇ-పద్దతిన ముఖాముఖి మాట్లాడ్డం చేసే రోజుల్లో రాజధానిని ఎందుకు వికేంద్రీకరించకూడదు అని కొందరు ప్రశ్నిస్తున్నారు. బహుళ అంతస్తు భవనాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేస్తూ రాజధానిని ఏ నాలుగైదు వేల ఎకరాలకో పరిమితం చేయొచ్చని జయప్రకాశ్ నారాయణ వంటి నాయకులూ సూచిస్తున్నారు.
సమకాలీనం
భూమి. అనేక అస్థిత్వాలకు నెలవు.
మానవనాగరికత ఆవిర్భావం నుంచి మనిషికి భూమితో విడదీయరాని బంధం.
ఉనికికి, ఉపాధికి, ఉత్పత్తికి, ఉన్నతికి.. ఒక్కటేమిటి అన్నిటికి ఆదెరువు భూమే! ఆ భూమిని లాక్కుంటే, తుపానులో తీగనుంచి విడిపడ్డ ఆకులా అల్లాడి పోతాడు సగటు మనిషి. అందుకే, గుంటూరు జిల్లా, తుళ్లూరు మండలం, మందడం గ్రామానికి చెందిన నీరుకొండ చిట్టిబాబు కలవరపాటుతో ఇప్పుడు నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు. తొంబై సెంట్ల భూమికి యజమాని. మూడు పంటలు పండిస్తూ ఏడాదికి సగటున లక్ష రూపాయలకు పైగా సంపా దిస్తున్నాడు. దీని ఆధారంగానే ఇద్దరు పిల్లల్ని ఇంజనీరింగ్ చదివిస్తున్నాడు. ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే పిల్లల్నెలా చదివించాలి? కుటుం బాన్ని ఎలా పోషించాలి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం భూ సమీకరణ జరుపుతామంటున్న 17 గ్రామాల్లో చిట్టిబాబు లాంటి కుటుంబాలు వేల సంఖ్యలో ఉన్నాయి.
భూ సమీకరణ, భూసేకరణ, భూస్వాధీనం... పేరేదైతేనేం, జరిగే దాష్టీకం ఒక్కటే! రైతుల భూముల్ని స్వాధీనపరచుకుంటారు. నష్టపరిహారంగా తృణ మో, పణమో చెల్లించి వారిని నిర్వాసితుల్ని చేస్తారు. రేపెప్పుడో, ఎక్కడో ఎక రాకు వెయ్యిగజాల చొప్పున అభివృద్ధి చేసిన స్థలం ఇస్తామంటారు. వారి కళ్ల ముందే, రాజధాని నిర్మాణం కోసం ప్రకటించిన ప్రాంతానికి చుటు ్టపక్కల భూ ముల విలువ కోట్లరూపాయలు పలుకుతుంది. ఒక పథకం ప్రకారం ఇప్పటికే అక్కడ పెద్దమొత్తం భూములు సేకరించిపెట్టుకున్న బడా బాబులు, పలుకుబడి కలిగిన పెద్దలు, కార్పొరేట్ లాబీయిస్టులు సెంటు భూమి కోల్పోకుండా కోట్లకు పడగలెత్తుతారు. ఆ 17 గ్రామాల్లో భూమి ఉన్నవాళ్ల సంగతి సరే! మరి భూమి లేని నిరుపేదల గతి? ఆ గ్రామాల్లో నివాస ప్రాంతాల జోలికి రాకుండా నివాసే తర ప్రాంతాలతోనే రాజధాని అభివృద్ధి సాధ్యమా? అదే జరిగితే రాజధాని అడ్డ దిడ్డంగా ఉండదా? ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలే! పైగా, భూసమీకరణకు సహకరిస్తారా సరే సరి! లేదంటే భూస్వాధీన చట్టాన్ని వర్తింపజేసి వశపరచుకుం టామని ప్రభుత్వం బెదిరిస్తోంది. నిజంగా అలా చేయగలదా?
చట్టప్రకారం వల్లకాదు కనుకే!
ఈ ఏడాది మొదట్లో అమల్లోకొచ్చిన భూసేకరణ కొత్త చట్టం ప్రకారమైతే విజ యవాడ పరిసరాల్లో రాజధానికి భూసేకరణ చేయడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. 1894 భూసేకరణ చట్టం గత ఏడాదే మారింది. పలు ప్రతిపాదనలు, సవరణల తర్వాత రూపుదిద్దుకున్న ‘భూసేకరణ, పునరావాస-పరిష్కారంలో న్యాయబద్ధ పరిహారం, పారదర్శకత హక్కు చట్టం-2013’ ప్రకారం ప్రజావస రాలకు ప్రభుత్వం భూసేకరణ జరపాలంటే ఎన్నో నిబంధనల్ని విధిగా పాటిం చాలి. ప్రైవేటు ప్రాజెక్టు అయితే 80 శాతం, పీపీపీ (ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య) పద్ధతిలో ప్రాజెక్టు అయితే కనీసం 70 శాతం ప్రభావిత కుటుం బాల వారి సమ్మతితోనే భూసేకరణ జరపాలి. ప్రభావిత కుటుంబాల్లో... భూమినో, ఇతర స్థిరాస్తినో కోల్పోయేవాళ్లుంటారు. భూమిలేకున్నా కూలీగానో, కౌలు రైతుగానో, చేతి వృత్తుల వారిగానో సదరు భూమితో ముడివడి జీవనో పాధి కోల్పోయేవాళ్లు, భూసేకరణకు మూడేళ్ల ముందు నుంచి ఏదో విధంగా అక్కడ ఉపాధి పొందుతున్న వాళ్లు... ఇలా పలువురిని ప్రభావిత కుటుంబాల జాబితాలో చేర్చారు. భూసేకరణ వల్ల జరిగే సామాజిక ప్రభావాన్ని, పర్యావ రణ ప్రభావాన్ని నిర్దిష్ట పద్ధతిలో అధ్యయనం జరిపి అందుకనుకూలంగా నిర్ణయం తీసుకోవాలి. పర్యావరణానికి, మౌలికవసతులకు తక్కువ నష్టం కలిగే ప్రాంతాలే కాకుండా తక్కువమంది నిర్వాసితులయ్యే ప్రాంతాల్నే ఎంపిక చేసు కోవాలి. సాగునీరుండి ఏడాదికి బహుళ పంటలు పండే భూముల్ని మౌలికంగా సేకరించకూడదు. తప్పని పరిస్థితుల్లో సేకరించాల్సి వస్తే నష్టపరిహారం చెల్లిం పునకు మరిన్ని ప్రత్యేక చర్యలు చేపట్టాలి. మార్కెట్ రేటుకు నాలుగింతలు ఎక్కువ ధర చెల్లించాలని చట్ట నిబంధన. భూమి కోల్పోయే వారికే కాకుండా ప్రభావితులయ్యే అందరికీ నష్టపరిహారం వివిధ రూపాల్లో చెల్లించాల్సి ఉంటుం ది. దీనికి తోడు మౌలిక వసతుల కల్పన, తాగునీరు, రోడ్లు, పోస్టాఫీసులు, డ్రైనేజీ, శ్మశానాలు.. ఇలా అన్నీ నిర్మించి ఇవ్వాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవన్నీ జరిగేవి కావని ప్రభుత్వ పెద్దలకూ తెలుసు. అందుకే భూసేకరణ కాకుం డా, భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్) రాగం పట్టింది సర్కారు. ఈ పద్ధతిలో అయితే, భూమికోల్పోయే వారికి నామమాత్రంగా ఏదో ఇచ్చి, ఇతరుల్ని పట్టిం చుకోకుండానే చేతులు దులుపుకోవచ్చన్నది యోచన కావచ్చు. పెద్ద మొత్తంలో భూమి సమీకరించి కొంత మొత్తాన్ని వాణిజ్యపరంగా వాడి డబ్బు గడించ వచ్చన్నది మరో దూరాలోచన.
జరుగుతున్నదేంటి?
తుళ్లూరు, మంగళగిరి మండలాల పరిధిలోని 17 గ్రామాల్లో రాజధాని నిర్మాణా నికి 30 వేల ఎకరాలు, అదీ తొలివిడత కింద సేకరించాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. దానికి ప్రాతిపదిక ఏంటో, ఏయే అంశాల ఆధారంగా ఆ నిర్ణయానికి వచ్చారో, వీటినే ఎందుకు ఎంచుకొని ఇతర ప్రాంతాల్ని ఎందుకు కాదన్నారో... ఎవరికీ తెలియదు. ఈ విషయంలో పారదర్శకత లేనే లేదు. శాసనసభలో చర్చించలేదు, అఖిలపక్షం నిర్వహించలేదు, ప్రజాభిప్రాయ సేకరణా చేయ లేదు, రాజధాని ఎక్కడో ప్రతిపాదించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీ తుదినివేదిక వచ్చే వరకైనా కనీసం నిరీక్షించలేదు. ప్రభుత్వ నిర్ణయానికి రోజు రోజుకూ వ్యతిరేకత, ముఖ్యంగా రైతులు, గ్రామీణ ప్రజల్లో వ్యక్తమౌ తోంది. తమ శవాలపైనే రాజధాని నిర్మాణం జరగాలంటున్నారు. ఏడాదికి మూడు, కొన్ని చోట్ల నాలుగు పంటలు పండే ఈ భూముల్నే ఎందుకు ఎంపిక చేశారు? అన్న ప్రశ్నకు విస్పష్టంగా సమాధానం లేదు. ప్రభుత్వ అధీనంలో ఉన్న 1,500 ఎకరాలు పోను 28,500 ఎకరాల పచ్చని పంట పొలాల్ని సేకరించా ల్సిందే! అయినా, ఇంత భూమి అవసరమా? అనే ప్రశ్న తలెత్తుతోంది. శాస్త్ర సాంకేతికత పెరిగి, మంత్రివర్గ సమావేశపు ఎజెండాను ఐపాడ్‌లో చూడ్డం, విశాఖ బాధితులతో హైదరాబాద్ నుంచి ఇ-పద్ధతిన ముఖాముఖి మాట్లాడ్డం చేసే రోజుల్లో రాజధానిని ఎందుకు వికేంద్రీకరించకూడదు అని కొందరు ప్రశ్ని స్తున్నారు. బహుళ అంతస్తు భవనాల్లో కార్యాలయాలు ఏర్పాటుచేస్తూ రాజధా నిని ఏ నాలుగైదు వేల ఎకరాలకో పరిమితం చేయొచ్చని జయప్రకాశ్ నారా యణ వంటి నాయకులూ సూచిస్తున్నారు. విస్తీర్ణం అడ్డగోలుగా పెంచి, కార్యా లయాలకు కొంత, భూయజమానులకు కొంత, కమర్షియల్‌కు మరి కొంత అని వాటాలు నిర్ణయించడాన్ని అందరూ తప్పుబడుతున్నారు. జీవకళ లేని ప్రకాశం మెట్ట భూములు, వర్షపాతం లేక ఎడారవుతున్న అనంతపురం భూములు... ఇలా తొండలు గుడ్లు పెట్టని భూముల్ని లక్షల రూపాయలు ప్రైవేటు వారితో కట్టించి పరిశ్రమల కోసం సేకరిస్తే రాజకీయంగా విమర్శలు చేసిన వారు పంట పొలాల్లో మంటలెలా పెడుతున్నారనే ప్రశ్నకు జవాబు లేదు.
జరగబోయేదేంటి?
ఎంపిక చేసిన 17 గ్రామాల్లో 21 వేల రైతు కుటుంబాలున్నాయి. రెండెకరాల లోపు భూములున్న రైతు కుటుంబాలు 15 వేల పైమాటే! ఇక రైతులంతా భూములు కోల్పోయి వెయ్యి, రెండు వేల గజాల స్థలాలకు మాత్రం ఎప్పుడో హక్కుదారులవుతారు. ఈలోపు ఎకరాకు ఏడాదికి పాతికవేల చొప్పున పదేళ్లు నష్టపరిహారం లభిస్తుంది. నమ్ముకున్న భూమికి ఒక్కసారి దూరమరయ్యాక పరిహారం ఫలహారమౌతుంది, ప్రాజెక్టుల కింద ఊళ్లకు ఊళ్లు భూములు కోల్పోయి నిర్వాసితులైన వారిలో, ఎంత నష్టపరిహారం లభించినా 80 శాతం పైగా కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. తరాల తరబడి అనుబంధం ఉన్న భూమిని కోల్పోవాల్సి వస్తోందని తెలిసిన నుంచే మానసిక పతనం మొదలవుతుంది. నక్సల్బరీ ఉద్యమం నుంచి ఈ దేశంలో భూమి కోసం మహోజ్వల పోరాటాలే సాగాయి. పాలకుల్ని నేలకు దించిన నందిగ్రామ్, సింగూర్ మన కళ్లముందరి భూపోరాటాలు. రాజధాని రగడలో భూమిగల వారి భుక్తికే ఇన్ని కష్టాలొచ్చాయి, ఇక భూముల్లేని చిన్న వ్యాపారులు, నిరుపేద బడుగుజీవులు, చేతి వృత్తులవాళ్లు, దినకూలీల బతుకు అగమ్యగోచరమే!
రాజ్యమెప్పుడూ బలమైందే! శీర్షాన ఉండే వారి కీర్తికాంక్షకు వాణిజ్య వైఖరి తోడైనప్పుడు సామాన్యజనం కంటికానరు. వారి జీవితాల్ని పునాదిరాళ్లు చేసి ‘అభివృద్ధి’సౌధాలు కట్టే కార్పొరేట్ శక్తులు ఆవహించినపుడు ఇక అడ్డూ, అదుపూ ఉండదు. కడకది ఎక్కడికి దారితీస్తుందంటే, ప్రజా ఉద్యమాలకు పురిటినొప్పులు పుట్టిస్తుంది.