కరోనాతో అందరూ ఇంటికి పరిమితమైపోయారు. పిల్లలకు ఇంటి దగ్గర తోచట్లేదంటున్నారు. ‘ఆకలి! ఆకలి!’ అంటూ గోల చేస్తున్నారు. వాళ్ల దృష్టి మళ్లించటంలో తల్లిదండ్రులు తలమునకలైపోతున్నారు. ఆటలు ఆడిస్తున్నారు, పాటలు పాడిస్తున్నారు, కథలు చెబుతున్నారు. అవి అయిపోగానే మళ్లీ ఆకలి అంటున్నారు. ఇప్పుడు వాళ్ల ఆకలిని తీరుస్తూనే, వాళ్ల దృష్టిని మరలించటానికి మంచి మార్గం ఉంది అంటున్నారు హఫీజ్ అనే పరిశోధకురాలు. వాళ్లు తినే అన్నం కంచంలోకి ఆకు కూరలు ఎలా వచ్చి చేరుతున్నాయో నేర్పమంటున్నారు.
విద్య అంటే పాఠాలు, పుస్తకాలు మాత్రమే కాదు, సొంతంగా చూసి తెలుసుకోవటం వల్లే మంచి పరిజ్ఞానం వస్తుంది...అంటారు పరిశోధకురాలు డా.జెన్నిఫర్ క్లెమెంట్. ముఖ్యంగా కాయగూరల పేర్లు, ఆకుకూరల పేర్లు, అవి ఎలా పండుతాయి వంటివి చదవటం కంటె, స్వయంగా పండిస్తూంటే, పండించటంలోని కష్టం తెలుసుకోవటమే కాదు, స్వయంగా పండించిన పంటలను వండుకు తినటంలో ఆసక్తి చూపుతారు అంటున్నారు జెన్నిఫర్. పది సంవత్సరాల వయసు ఉన్న తన కుమార్తె ట్రినిటీకి తాను స్వయంగా ఇవన్నీ నేర్పుతున్నాను అంటున్నారు.
ఈ జోన్ ద్వారా...
చెన్నైకు చెందిన ఈ జోన్ వారు వాట్సాప్ ద్వారా ఆన్‌లైన్ గార్డెనింగ్‌ను పిల్లలకు నేర్పుతున్నారు. ఈ విషయాన్ని గమనించారు జెన్నిఫర్. ‘మా అమ్మాయికి ఇప్పుడు విత్తనాలు నాటడం, మొక్కలు పెంచటం, ఏ మొక్క ఆకు ఏ రకంగా ఉంటుంది వంటి విషయాలు చెప్పటానికి మంచి అవకాశం దొరికింది. ఈ గ్రూప్‌లో చేరి తను అన్నీ సొంతంగా నేర్చుకుంటోంది. ప్రతిరోజూ మొక్కలకు శ్రద్ధగా నీళ్లు పోస్తోంది. ఆకు తొడిగిన దగ్గర నుంచి, పంట చేతికి వచ్చేవరకు ప్రతిరోజూ మొక్కలను పరిశీలిస్తోంది’ అంటారు జెన్నిఫర్.
ఈ జోన్ వ్యవస్థాపకురాలు హఫీజ్ ఖాన్ ఆలోచన ఇది. హఫీజ్ ఖాన్ మొక్కల పెంపకం గురించి పాఠశాలలకు వెళ్లి పిల్లలకు స్వయంగా ఒక పీరియడ్ తీసుకునేవారు. ఆ రోజు నుంచి తన టీమ్‌తో కలిసి, పిల్లలకు పంటల ఉత్పత్తి గురించి విపులంగా తెలియచేస్తున్నారు. వాటితో పాటు మంచి అలవాట్లు కూడా నేర్పుతున్నారు. ‘‘పిల్లలు బాల్కనీలో మైక్రో గ్రీన్స్ పండించవచ్చు. ఇంటిదగ్గర ఉన్న విత్తనాలతోనే ఈ పని చేయొచ్చు. వారు చేయవలసినదల్లా వీటిని పెంచటానికి కావలసిన మట్టి, కుండీలను సేకరించటమే. చిన్నతనం నుంచే ఇలా మొక్కలు పెంచటం వల్ల పిల్లల్లో మంచి ఆలోచనలు మొలకెత్తుతాయి’ అంటున్నారు హఫీజ్.
పిల్లలే ఆకుపచ్చ రాయబారులు..
సుమారు పదిహేను సంవత్సరాలుగా హఫీజ్ ఈ జోన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రజలలో చైతన్యం కలిగిస్తున్నారు. 2015లో కమ్యూని‘ట్రీ’ని ప్రారంభించారు. పాఠశాలల్లో వీటి గురించి చెప్పడానికి కొన్ని పరిమితులు ఉండేవి. ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఏ పరిమితులు లేకుండా నేర్పటానికి అవకాశం ఉంది. ‘ఇంతకాలం చేసింది వేరు. ఇప్పుడు ఈ లాక్‌డౌన్ వల్ల, మాలో ఒక కొత్త ఆలోచన వచ్చింది. వాట్సాప్ వీడియోల సెషన్స్ ద్వారా ప్రపంచంలోని పిల్లలందరికీ నేర్పించవచ్చు కదా అనిపించింది. ఇప్పటి వరకు 18 బ్యాచ్‌లు నిర్వహించాం. ప్రతి బ్యాచ్‌లోను 80 – 120 విద్యార్థులు ఉంటున్నారు. ప్రతిరోజూ ఒక గంటసేపు ఆన్‌లైన్ క్లాస్ ఉంటుంది. ఉదయం 10.30 కు ఒకసారి, సాయంత్రం 4.30కు ఒకసారి. ఏ విధంగా మొక్కలు పెంచాలి అనేదానిపై శిక్షణ ఉంటుంది.
పిల్లల వీడియోలు
పిల్లలు ప్రతిరోజూ వారు చేస్తున్న పచ్చదనం సేవ గురించి వీడియోలు తీసి, గ్రూప్‌లో పెడుతుంటారు. వాటి గురించి వివరిస్తుంటారు. సందేహాలు అడిగి తెలుసుకుంటారు. లాక్‌డౌన్ లో పిల్లలకు హఫీజ్ ఖాన్ ఇలా మొక్కల మీద అవగాహన కల్పించటం నిజంగా మంచి ఆలోచనే.
Comments
Please login to add a commentAdd a comment