సాయిశ్రీ
జీవిత బీమా సంస్థ ఉద్యోగులైన మేడేపల్లి సాయిశ్రీ, అనంత్ దంపతులు తమ ఇంటిపైన రెండేళ్లుగా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతోపాటు పూలమొక్కలను పెంచుకుంటున్నారు. హైదరాబాద్ గుడిమల్కా పూర్‌లోని జయనగర్ ఎల్.ఐ.సి. కాలనీలో రెండంతస్తుల సొంతిల్లు నిర్మించుకున్న తర్వాత టెర్రస్ కిచెన్ గార్డెనింగ్‌పై దృష్టిసారించారు. ఇంటిపంటల సాగుపై ముందస్తు ప్రణాళికతో టెర్రస్‌పైన లీక్ ప్రూఫింగ్ చేయించారు. ఐరన్ బెంచ్‌లు చేయించి, వాటిపై ఎత్తుల వారీగా కుండీలను అందంగా అమర్చారు. చిన్నసైజు సిల్పాలిన్ బ్యాగ్‌లలో టమాటా, కొత్తిమీర, పాలకూర సాగు చేస్తున్నారు. ఎర్రమట్టి, పశువుల ఎరువు కలిపి మొక్కలు పెట్టుకున్న తర్వాత అడపాదడపా కోకోపిట్, వర్మీకంపోస్టు వేస్తూ.. జీవామృతం కొనుగోలు చేసి, పది రెట్లు నీరు కలిపి మొక్కల పోషణకు ఉపయోగిస్తున్నారు.
గతంలో ఇబ్బడిముబ్బడిగా పండిన తెల్ల వంకాయలు, పచ్చి మిరపకాయలను తమ సహోద్యోగులకు, తెలిసినవారికి కూడా పంచిపెట్టడం చాలా సంతోషాన్నిచ్చిందని వారు తెలిపారు. ఇంటి కూరగాయలు, ఆకుకూరలు ఆరోగ్యకరమైనవి కావడంతో పాటు.. వీటితో వండిన కూరలకు.. బయట కొన్న కూరగాయలతో వండిన కూరలకు రుచిలో స్పష్టమైన తేడా ఉందన్నారు. పిల్లలు సైతం ఈ తేడాను స్పష్టంగా గుర్తించగలరని వారన్నారు. ఎండలు ముదురుతున్నందున షేడ్‌నెట్ ఏర్పాటు చేసి.. మరింతగా ఆకుకూరల సాగుపై దృష్టిపెట్టనున్నామని సాయిశ్రీ(93480 28228) అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment