నౌకాయాన పరిశ్రమ సొంత ఆహార అవసరాల కోసం అధునాతన సేద్య సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నది. కృత్రిమ మేధతో నడిచే కూరగాయలు, ఆకుకూరలు, ఔషధ మొక్కలను నౌకల్లోనే సాగు చేయటం ప్రారంభమైంది. సిబ్బందికి మెరుగైన ఆహారాన్ని అందించటంతోపాటు వారి మనోబలాన్ని పెంపొందించేందుకు కొన్ని షిప్పింగ్ కంపెనీలు డిజిటల్ సేద్య పద్ధతులను అనుసరిస్తున్నాయి. ఈ సంస్థల జాబితాలో సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న సినర్జీ మెరైన్ గ్రూప్ ముందంజలో ఉంది.
‘అగ్వా’ సంస్థ రూపొందించిన అటానమస్ వెజిటబుల్ గ్రోయింగ్ టెక్నాలజీ నావికులకు అనుదినం పోషకాలతో నిండిన తాజా శాకాహారం అందించడానికి ఉపయోగపడుతోంది. గతంలో తీర్రప్రాంతాలకు చేరినప్పుడు మాత్రమే తాజా కూరగాయలు, ఆకుకూరలు వీరికి అందుబాటులో ఉండేవి. ఇప్పుడు రోజూ అందుబాటులోకి రావటం వల్ల నౌకా సంస్థల సిబ్బంది సంతృప్తిగా, ఆరోగ్యంగా ఉంటూ మెరుగైన సేవలందించగలుగుతున్నారట.
సినర్జీ మెరైన్ గ్రూప్ బాటలో ఈస్ట్రన్ పసిఫిక్ షిప్పింగ్, సీస్పాన్ కార్ప్, కాపిటల్ షిప్పింగ్, కూల్‌కొ నడుస్తూ సముద్ర యానంలో తాజా ఆహారాన్ని పండిస్తూ, వండి వార్చుతున్నాయి. సినర్జీ మెరైన్ గ్రూప్‌నకు చెందిన సూయెజ్‌మాక్స్ ఎఫ్ఫీ మెర్స్క్ ఓడలో సిబ్బంది సెప్టెంబర్ నుండి మూడు ప్రత్యేక అగ్వా యూనిట్లను ఉపయోగించి ఆకుకూరలు, ఔషధ మొక్కలు, దుంప కూరలు, టొమాటోలు, స్ట్రాబెర్రీలను నడి సముద్రంలో ప్రయాణం చేస్తూనే సాగు చేసుకుంటూ ఆనందంగా ఆరగిస్తున్నారు.
స్వయంచాలిత సేద్యం
ఆకర్షణీయమైన వేతనాలకు మించి సముద్రయాన సంస్థ సిబ్బంది సమగ్ర సంక్షేమం, జీవనశైలి ప్రయోజనాలను అందించడంలో అగ్వా సంస్థ రూపొందించిన అత్యాధునిక ఇన్‌డోర్ సాగు పరికరాలు ఉపయోగపడుతున్నాయి. సిబ్బంది శ్రేయస్సును మెరుగుపరుస్తుంది. తాజా కూరగాయలను స్థిరంగా సరఫరా చేయడం ఒక కీలకమైన ఆవిష్కరణ.
పూర్తి స్వయంప్రతిపత్తి కలిగిన అగ్వా ఆన్ బోర్డ్ కూరగాయల పెంపక యూనిట్లు అత్యాధునిక సాంకేతికతతో వినియోగదారుల అవసరాలకు, ఆసక్తులకు తగిన రీతిలో తాజా ఉత్పత్తులను అందిస్తున్నాయి. అధునాతన కృత్రిమ మేధ, ఇమేజ్ ఎనలైజర్, సెన్సరీ డేటా ద్వారా వినియోగదారు ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా అగ్వా యూనిట్లు పనిచేస్తాయి.
ఇవి చూడటానికి ఒక ఫ్రిజ్ మాదిరిగా ఉంటాయి. ఇవి పూర్తిస్థాయిలో ‘వర్చువల్ అగ్రానామిస్ట్’ (వర్చువల్ వ్యవసాయ శాస్త్రవేత్త) పాత్రను పోషిస్తాయి. వెల్తురు, తేమ, మొక్కలకు పోషకాల సరఫరా.. వంటి పనులన్నిటినీ వాతావరణాన్ని బట్టి ఇవే మార్పులు చేసేసుకుంటాయి. అగ్వా యాప్ సాగులో ఉన్న కూరగాయల స్థితిగతులు, పెరుగుదల తీరుతెన్నులపై ఎప్పటికప్పుడు మెసేజ్‌లు పంపుతూ ఉంటుంది.
ప్రపంచవ్యాప్తంగా నౌకా సిబ్బంది శ్రేయస్సు కోసం మెరుగైన ప్రయోజనాలు కల్పించటం, ప్రతికూల పరిస్థితుల్లోనూ నావికా సిబ్బందికి మెరుగైన ఆహారాన్ని అందించడానికి ఈ అధునాతన హైడ్రో΄ోనిక్ సాంకేతికత ఉపయోగపడుతోంది. వాతావరణంలో మార్పులకు తగిన రీతిలో పంట మొక్కల అవసరాలను అగ్వా 2.0 యూనిట్లు స్వయంచాలకంగా, రిమోట్‌గా సర్దుబాటు చేసుకుంటాయి. ఇది ఏకకాలంలో వివిధ కూరగాయలను పండించగలదు. ‘వర్చువల్ వ్యవసాయ శాస్త్రవేత్త’ అగ్వా యూనిట్‌లో పెరిగే ప్రతి మొక్కను నిరంతరం పర్యవేక్షిస్తుంది. సరైన నాణ్యత, మెరుగైన దిగుబడి సాధనకు అనుగుణంగా సర్దుబాటు చేస్తుంది.
(చదవండి: ఒరిజినల్ దస్తావేజులు పోతే ప్రాపర్టీని అమ్మడం కష్టమా..?)
Comments
Please login to add a commentAdd a comment