బుధవారం హైదరాబాద్‌లో ఇంటిపంటలను పరిశీలిస్తున్న సీఎస్ ఎస్‌కే జోషి తదితరులు
సాక్షి, హైదరాబాద్: ఇంటిపంటలతో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ఉద్యాన– పట్టు పరిశ్రమశాఖ డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి అన్నారు. హైదరాబాద్ జీడిమెట్లలోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో తెలంగాణ ఉద్యానశాఖ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన అర్బన్‌ఫార్మింగ్ అండ్ వర్టికల్ గార్డెనింగ్ మొదటి రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌లో ప్రభుత్వ సీఎస్ ఎస్‌కేజోషి, వ్యవసాయ ముఖ్యకార్యదర్శి పార్థసారథి, వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో కూరగాయల డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి లేదన్నారు. దీన్ని చేరుకోవాలంటే పట్టణ ప్రాంతాల్లో కిచెన్‌గార్డెన్, వర్టికల్‌గార్డెన్ అర్బన్‌ఫార్మింగ్, ఇంటితోటల పెంపకాన్ని చేపట్టాలని పిలుపునిచ్చారు. రసాయనాలతో పండించిన కూరగాయల్ని కొని తినే బదులు, ఇంట్లో పండించిన కూరగాయలు మేలన్నారు. ఆహార సమస్యల కారణంగా తలెత్తే వ్యాధులను ఇంటిపంటలతో అరికట్టవచ్చని సూచించారు. సీఎస్ ఎస్‌కే.జోషి మాట్లాడుతూ..గతంలో తాను వ్యవసాయశాఖలో పనిచేసినపు డు అనేక సదస్సులు నిర్వహించామని, కానీ రైతుల నుంచి ఇంతటి ఆదరణ ఎప్పుడూ చూడలేదన్నారు.
సీఎస్ ఘెరావ్..ఉద్రిక్తత: సమావేశం ముగిసిన అనంతరం ఎస్‌కే జోషిని పాలీహౌస్ రైతులు చుట్టుముట్టి తమ బకాయిలు చెల్లించాలంటూ నినాదాలు చేయడంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం పాలిహౌస్‌ల్లో వ్యవసాయం చేయాలని ఆశచూపి ఇప్పుడు రూ.80 లక్షల వరకు బకాయిలు ఎగ్గొట్టిందని ఆరోపించారు. నాలుగేళ్లుగా సచివాలయం, ఉద్యాన శాఖ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా..ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ఉద్యానశాఖ డైరెక్టర్‌తోనూ రైతులు వాగ్వాదానికి దిగారు. దీంతో కోపోద్రిక్తుడైన వెంకట్రామ్‌రెడ్డి అసలు పాలీహౌస్ సాగును ఎవడు చేపట్టమన్నాడు? అంటూ మండిపడ్డారు.
రైతులపై సీఎస్ అసహనం..
సీఎస్ కారుకి రైతులంతా అడ్డంగా వచ్చి కదలకపోవడంతో చాలాసేపు జోషి కారులోనే ఉండిపోయారు. దీంతో ఆయన అసహనానికి గురై వారిని మందలించారు. బిల్లులు చెల్లించేందుకు కృషిచేస్తానని సీఎస్ హామీనివ్వటంతో రైతులు ఆందోళన విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment