అంతంతమాత్రంగానే 11 రకాల పంటల సాగు
చింతపండు, అల్లం, వెల్లుల్లి, ధనియాలకూ కొరతే
ఇంకా 1.78 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అవశ్యం
అందుకోసం లక్ష ఎకరాల్లో వీటి సాగు అవసరం
సాక్షి, హైదరాబాద్: ఎండు మిర్చి, పసుపు సాగులో దేశంలోనే అగ్రగామిగా ఉన్న తెలంగాణ రాష్ట్రం.. ఇతర సుగంధ ద్రవ్యాల సాగులో తీవ్రంగా వెనుకబడిపోయింది. చింతపండు, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర మొదలైన నిత్యం వంటింట్లో వినియోగించే 11 రకాల మసాలా దినుసులకు రాష్ట్రంలో కొరత ఏర్పడింది. చివరికి చింతపండును కూడా దిగుమతి చేసుకునే పరిస్థితి నెలకొంది.
పసుపు, మిర్చి సాగులో మెరుగు
రాష్ట్రంలో నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, వరంగల్ రూరల్, మహబూబాబాద్ జిల్లాల్లో పసుపు ఎక్కువగా సాగవుతోంది. 56 వేల ఎకరాల్లో 1.74 లక్షల మెట్రిక్ టన్నుల పసుపు ఉత్పత్తి అవుతోందని ఉద్యానవన శాఖ లెక్కలను బట్టి తెలుస్తోంది. రాష్ట్రంలో రోజువారీగా పసుపు వినియోగం 56.25 మెట్రిక్ టన్నులు. ఏటా రాష్ట్ర అవసరాలకు 23 వేల మెట్రిక్ టన్నులు సరిపోతుంది.
మిగతాది ఎగుమతి అవుతోంది. అలాగే రాష్ట్రంలో సుమారు 2.78 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు చేస్తున్నారు. ఏటా 5.73 మెట్రిక్ టన్నుల ఎండు మిరప ఉత్పత్తి అవుతోంది. మిరప ఉత్పత్తిలో ఏపీ తర్వాత తెలంగాణ రెండో స్థానంలో ఉంది. రాష్ట్రంలో రోజువారీగా కారం వినియోగం 93 మెట్రిక్ టన్నులు. ఏటా రాష్ట్ర అవసరాలకు వాడేది 39 వేల మెట్రిక్ టన్నులు కాగా, మిగతా 5.34 లక్షల మెట్రిక్ టన్నులు ఎగుమతి చేస్తున్నారు.
చింతపండు, అల్లం, వెల్లుల్లి కూడా దిగుమతే!
లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, జాపత్రి, జీలకర్ర వంటి విలువైన సుగంధ ద్రవ్యాలను ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి దిగుమతి చేసుకోక తప్పని పరిస్థితి. కానీ చింతపండు, అల్లం, వెల్లుల్లి, ధనియాల వంటివాటిని కూడా ప్రస్తుతం దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది.
ఏటా 61,564 మెట్రిక్ టన్నుల చింతపండును దిగుమతి చేసుకొంటున్నారు. రాష్ట్రంలో అల్లం 2,103 ఎకరాల్లో 20,489 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అవుతుండగా, వినియోగం మాత్రం 68,419 మెట్రిక్ టన్నులు ఉంటున్నది. 47,930 మెట్రిక్ టన్నుల మేర ఇతర రాష్ట్రాల నుంచి వస్తోంది.
వెల్లుల్లి 27 ఎకరాల్లో మాత్రమే సాగవుతోంది. 148 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి వస్తోంది. కానీ, వినియోగం మాత్రం 39,417 మెట్రిక్ టన్నుల మేర ఉంటోంది. అలాగే ధనియాలు కూడా రాష్ట్రంలో 13,532 మెట్రిక్ టన్నుల వినియోగం ఉండగా, పండుతున్న పంట 4,971 ఎకరాల్లో 2,431 మెట్రిక్ టన్నులే.
లక్ష ఎకరాల్లో సుగంధ ద్రవ్యాల సాగు అవశ్యం
రాష్ట్రంలో ప్రతిరోజు సగటున ఒక్కొక్కరు 21.21 గ్రాముల సుగంధ ద్రవ్యాలను వినియోగిస్తారు. ఇలా రోజుకు 731 మె ట్రిక్ టన్నుల డిమాండ్ ఉండగా, ఏటా 2.63 లక్షల మెట్రిక్ టన్నులు అవసరం.
చింతపండు, అల్లం, వెల్లుల్లి, ధని యాలు, జీలకర్ర, ఆవాలు, మిరియాలు వంటి 11 సుగంధ ద్రవ్యాలు 1.78 లక్షల మెట్రిక్ టన్నులు అవసరం ఉన్నది. ఈ డిమాండ్‌కు సరిపడా పంట రావాలంటే రాష్ట్రంలో ఇంకా 1.09 లక్షల ఎకరాల్లో ఈ పంటలు సాగుచే యాల్సి ఉంటుందని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment