సాక్షి, అమలాపురం: వయసు మళ్లిన కొబ్బరి చెట్ల స్థానంలో కొత్తవి పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవతో ఉద్యాన శాఖ ప్రోత్సాహం అందిస్తోంది. కోకోనట్ డెవలప్‌మెంట్ బోర్డు (సీడీబీ) పాత చెట్లను తొలగించి కొత్త చెట్లు పాతుకునేందుకు ఆర్ అండ్ ఆర్ (రీ ప్లాంటింగ్ అండ్ రెజువెనేషన్) పథకంలో భాగంగా హెక్టారుకు రూ.53,500 చొప్పున అందించనుంది.
ఈ సొమ్ముతో తోటల్లో దిగుబడి తక్కువగా వస్తున్న.. తెగుళ్లు అధికంగా సోకి దెబ్బతిన్న కొబ్బరి చెట్ల స్థానంలో కొత్తవి పాతుకునే వీలుంటుంది. కోనసీమలో 1.10 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతోంది. ఇప్పుడున్న తోటల్లో మూడో వంతు తోటల వయసు 60 ఏళ్లకు పైబడింది. దేశవాళీ కొబ్బరి చెట్ల వయసు 60నుంచి వందేళ్లు ఉంటోంది. కానీ.. 60 ఏళ్లు దాటిన తరువాత వీటిలో దిగుబడి 40 శాతానికి పడిపోతోంది.
అలాగే కొబ్బరి తోటలు సహజ సిద్ధమైన శక్తిని కోల్పోయి తెగుళ్లు, పురుగుల్ని తట్టుకోలేకపోతున్నాయి. వీటి స్థానంలో కొత్తవి వేసుకోవాల్సి ఉంది. అధిక దిగుబడి ఇచ్చే కొత్త వంగడాలు, హైబ్రీడ్, పొట్టి రకాల చెట్లు వేసేందుకు ఇదే మంచి సమయం. దీనివల్ల దిగుబడి, కొబ్బరి కాయ సైజు పెరిగి ఉత్తరాది మార్కెట్‌లో తమిళనాడు, కేరళ, కర్ణాటక నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునే అవకాశం ఉంటుంది.
ప్రోత్సాహం ఇలా..
కొత్త చెట్లను పాతుకునే విషయంలో కోనసీమ రైతులు పూర్తిగా వెనుకబడ్డారు. పాత చెట్లను యథాతథంగా ఉంచి.. పక్కనే కొత్త చెట్లు పాతుతుంటారు. ఇలా చేయడం వల్ల కొబ్బరి తోటలో చెట్ల సంఖ్య పెరిగి అంతర పంటలు వేసుకునే అవకాశం ఉండటం లేదు. మరోవైపు దిగుబడి సైతం తగ్గిపోతోంది. ఈ పరిస్థితుల్ని గుర్తించిన కోకోనట్ డెవలప్‌మెంట్ బోర్డు, ఆర్ అండ్ ఆర్ పథకాన్ని అమల్లోకి తెచ్చింది.
ఈ పథకం కింద హెక్టారుకు 32 చెట్లను తొలగించి కొత్త చెట్లు పాతుకోవాల్సి ఉంటుంది. చెట్టు తొలగింపు, ఆ ప్రాంతంలో మందులు వేసి భూమిని బాగు చేయడంతోపాటు కొత్త చెట్టు పాతుకోవాల్సి ఉంటుంది. హెక్టారుకు 32 చెట్లు తొలగింపునకు చెట్టుకు రూ.వెయ్యి చొప్పున రూ.32 వేలు, ఎరువులు, ఇతర వాటికి రూ.17,500 వినియోగిస్తారు. రూ.4 వేలను మొక్కలు నాటుకునేందుకు ఇస్తారు. చెట్టు పాతిన తరువాత రెండేళ్ల పాటు ఎరువులకు సైతం ఈ నిధులనే వినియోగించాల్సి ఉంటుంది.
దిగుబడే కాదు.. కాయ సైజు తగ్గింది
గతంలో ఎకరాకు సగటు దిగుబడి ప్రతి దింపులో 1,200 కాయలు వచ్చేవి. ఇప్పుడు 800 మించడం లేదు. ఏడాదికి ఆరు దింపులకు గాను సగటు 4,800 కాయలకు రూ.40,800 వరకూ వస్తుంటే.. దింపు కూలీకే రూ.9,600 వరకూ ఖర్చవుతోంది.
తోటలకు పెట్టుబడులు సైతం పెరిగిపోయాయి. మరోవైపు పెద్ద వయసు చెట్లను తెగుళ్లు, పురుగులు ఆశించి నిలువునా గాయం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల వల్ల కొబ్బరి దిగుబడితోపాటు కాయ సైజు గణనీయంగా తగ్గిపోతోంది. దీంతో రైతులకు కనీస ఆదాయం కూడా రావడం లేదు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే.. రైతులు కొత్త చెట్లను నాటాల్సిన అవసరం ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment