ఇంటిపంటలను చూపుతున్న హరిప్రియ
కూరగాయలు, ఆకుకూరల సాగులో వాడే రసాయనిక ఎరువులు, పురుగుమందుల దుష్ప్రభావం ఆరోగ్యంపై ఎంత ఎక్కువగా ఉంటున్నదీ తెలిసివస్తున్నకొద్దీ ఆర్గానిక్ ఆహారంపై ఆకర్షితులవుతున్న నగరవాసుల సంఖ్య పెరుగుతోంది. తమ ఇళ్లపైన ఖాళీల్లో కుండీలు, మడులు పెట్టుకొని, తమ తీరిక సమయాన్ని ఆరోగ్యదాయకమైన సేంద్రియ ఇంటిపంటలు పండించుకోవడానికి గృహిణులు మొగ్గు చూపుతూ ఆనందంగా, ఆరోగ్యంగా జీవిస్తున్నారు. గుంటూరు జెకేసీ కాలేజీరోడ్డులోని విజయపురి కాలనీకి చెందిన గృహిణి మున్నంగి హరిప్రియ ఈ కోవకు చెందిన వారే. శిక్షణ పొంది మరీ ఇంటిపంటలను విజయవంతంగా సాగు చేస్తూ మంచి దిగుబడులు పొందుతున్నారు. తాము తినటంతోపాటు ఇద్దరు కుమారు ల కుటుంబాలకూ సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలను అందిస్తుండటం విశేషం.
మూడు మడులు, మూడు వరలతోపాటు అనేక ప్లాస్టిక్ తొట్లలో రకరకాల మొక్కలు నాటారు. సేంద్రియ కూరగాయల సాగు సంతృప్తినివ్వడంతో పాటు, ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతున్నాయని ఆమె అనందం వ్యక్తం చేస్తున్నారు.
నల్లమట్టిలో ఘనజీవామృతం, వర్మీ కంపోస్టు, ఇసుక, వేపపిండి, కొబ్బరి పొట్టు కలిపి మడులు, వరలు, ప్లాస్టిక్ తొట్లలో నింపి మొక్కలు విత్తినట్లు చెప్పారు. ఆవు పంచకం, పుల్ల మజ్జిగ, అల్లంవెల్లుల్లి ద్రావణం, బూడిద, పసుపు చల్లటం ద్వారా చీడపీడలను నివారిస్తున్నట్లు ఆమె వివరించారు.
సొర, బీర, కాకర, అలసంద, పొట్ల వంటి పాదులతోపాటు.. టమోట, వంగ, బెండ, మిర్చి, తోటకూర, మెంతికూర, పాలకూర, బచ్చలి కూర పండించుకుంటున్నారు. కిచెన్ గార్డెన్‌లో సీతాకోకచిలుకలు, తేనెటీగలు తిరుగాడుతూ పరపరాగ సంపర్కం బాగా జరిగి మంచి దిగుబడులు రావాలంటే పూల మొక్కలను కూడా పెంచుకోవాలి. ఈ దృష్టితోనే హరిప్రియ గులాబి, మందార, పారిజాతం, సెంటుమల్లి, బోగన్‌విలా, గన్నేరు, నందివర్థనం, మల్లెలు, వంటి పూల మొక్కలను కూడా నాటారు.
కూరగాయలు కొనే అవసరం లేకుండానే హాయిగా ఆరోగ్యదాయకమైన కూరలు తినగలుగుతున్నామన్నారు. తమ ఇద్దరు కుమారుల కుటుంబాలకు కూడా కూరగాయలు పంపుతున్నామని, పూలు కూడా కొనకుండా సరిపోతున్నాయన్నారు సంబరంగా.
రోజుకు 2 గంటల పనితో సంతోషం!
నాకు వ్యవసాయం అంటే మొదటి నుంచి మక్కువ. ప్రస్తుతంమార్కెట్‌లో అమ్ముతున్న కూరగాయల సాగులో రసాయనిక ఎరువులు, పురుగు మందులు ఎక్కువగా వాడుతున్నారు. దీని ప్రభావం ఆరోగ్యంపై కనిపిస్తున్నది. సేంద్రియ ఇంటిపంటల సాగులో శిక్షణ పొందిన తరువాత రూఫ్‌పైనే రూ. 50 వేల ఖర్చుతో మడులు, వరలతో తోట తయారు చేసుకున్నాను. విత్తనాలు తెచ్చుకొని నారు పోసి మొక్కలు నాటుతున్నాను. పూర్తి ఆర్గానిక్ పద్ధతిలో వీటిని పండిస్తున్నాను. వంటింటి వ్యర్థాలు, రాలిన ఆకులు, రెమ్మలతో నేనే వర్మీ కంపోస్టు తయారు చేసుకుంటున్నాను. గో పంచకం మా తమ్ముని దగ్గర నుంచి తెచ్చుకొంటున్నాను. తోటపనిలో రోజూ రెండు గంటలు పాదులు సరిచేసుకుంటూ, నీరు పెట్టుకుంటూ సంతోషంగా ఉన్నాను. తోట నాకు ఆరోగ్యంతోపాటు అనందాన్ని కూడా అందిస్తున్నది. నాకు తెలిసినంతలో ఇతరులకూ సలహాలు ఇస్తూ ఇంటిపంటల సాగును ప్రోత్సహిస్తున్నాను.
– మున్నంగి హరిప్రియ (98493 46517), జెకేసీ కాలేజీ రోడ్డు, విజయపురి కాలనీ, గుంటూరు
– ఓబులరెడ్డి వెంకట్రామిరెడ్డి, సాక్షి, అమరావతి బ్యూరో, గుంటూరు
ఫొటోలు: గజ్జల రామగోపాలరెడ్డి, స్టాఫ్ ఫొటోగ్రాఫర్
Comments
Please login to add a commentAdd a comment