అపార్ట్‌మెంట్లలో నివసించే కుటుంబం వంటింటి తడి చెత్తను బయట పారేయకుండా చేయగలగడం ఎలా? ఈ సమస్యకు సరైన పరిష్కారం వెదకగలిగితే నగరాలు, పట్టణాల్లో మున్సిపాలిటీ వాళ్లకు చెత్తకు సంబంధించి సగం యాతన/ఖర్చు తగ్గుతుంది. ఈ దిశగా ఓ యువకుడి అన్వేషణ చక్కని పరిష్కారాన్ని ఆవిష్కరించింది. బాల్కనీలో ఐదు కుండీలు పెట్టుకొని ఆకుకూరలు పెంచుతూ, ఆ కుండీల్లోని మట్టిలోనే ఒక మూలన చెత్త డబ్బాను ఏర్పాటు చేసుకొని వంటింటి వ్యర్థాలతో కంపోస్టు తయారు చేసే(వార్మ్‌బిన్) పద్ధతిని అనుసరిస్తున్నారు.
టేకూరు రవిశంకర్ స్వస్థలం నెల్లూరు రూరల్ మండలంలోని వెంకన్నపాలెం. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. రాజేంద్రనగర్ ఉప్పరపల్లిలో అపార్ట్‌మెంట్‌లో నివాసం. బాల్కనీలో 5 కుండీలను ఏర్పాటు చేసుకొని పాలకూర, తోటకూర, మెంతికూర, కొత్తిమీరను సాగు చేసుకుంటూ సేంద్రియ ఆహారాన్ని తింటున్నారు. వంటింటి నుంచి వెలువడే తడి చెత్తను బాల్కనీలో వాసన ఇతరత్రా ఇబ్బందులూ లేకుండా కంపోస్టుగా మార్చడానికి రవిశంకర్ చేయని ప్రయత్నాల్లేవు.. చివరకు మొక్కలు పెరుగుతున్న కుండీల్లోనే.. వంటింటి వ్యర్థాలను కంపోస్టుగా మార్చే ఉపాయాన్ని ఆలోచించి, విజయవంతంగా ఆచరణలో పెట్టారు. నిశ్చింతగా కంపోస్టు తయారు చేసుకోవడం, ఆకుకూరలు పండించుకోవడం సజావుగానే సాగుతోంది.
బాల్కనీలో 3 అడుగుల పిట్టగోడపైన గ్రిల్స్ బిగించి అక్కడ కుండీలను ఏర్పాటు చేశారు. 3 అడుగుల ఎత్తయిన కుండీలను తీసుకొని.. అందులో అర అడుగు ఎత్తు ఉండే ఖాళీ ప్లాస్టిక్ సీసా/డబ్బాను పెట్టారు. డబ్బా అడుగును పూర్తిగా కత్తిరించి తీసేశారు. దానికి చుట్టూతా చిన్నపాటి బెజ్జాలు చేశారు. దాన్ని కుండీలోని మట్టిలో ఒక అంగుళం పైకి కనపడే విధంగా పెట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఆకుకూరలు పెరిగే కుండీలోనే వానపాములు కంపోస్టు తయారు చేసే డబ్బానొకదాన్ని(దీనికి ‘వార్మ్ బిన్’ అని పేరు పెట్టారు) ఏర్పాటు చేశారన్నమాట.
రెండు రోజులకోసారి...
ప్లాస్టిక్ డబ్బాలో అడుగున (బొమ్మలో చూపిన విధంగా) అడుగున ఒకటి, కొంచెం కంపోస్టు వేసి.. ఆపైన పండ్లు, కూరగాయల తొక్కలు వేసి, గుడ్డను కప్పుతారు. డబ్బాకు పైన మూతపెడతారు.
కొద్ది రోజుల్లోనే వానపాముల సంఖ్య పెరిగి ఈ తడి చెత్తను తింటూ కంపోస్టుగా మారుస్తూ ఉంటాయి. రెండు రోజులకోసారి వంటింట్లో కూరగాయలు, పండ్లు వేసి, మూత పెడుతూ ఉంటే చాలు.. వానపాములు ఈ డబ్బా అడుగు నుంచి, పక్కన బెజ్జాలలో నుంచి కిందికీ పైకి తిరుగుతూ తడి చెత్తను తింటూ కంపోస్టుగా మారుస్తూ ఉంటాయి. ఈ క్రమంలో వెలువడే పోషక ద్రవం మొక్కల వేళ్లకు ఎప్పటికప్పుడు అందుతూ చక్కని పోషకాలను అందిస్తూ ఉంటుందంటున్నారు రవిశంకర్(97030 16820).
వంటింటి తడి చెత్తతో కుండీల్లోనే కంపోస్టు!
Published Tue, Feb 13 2018 12:14 AM | Last Updated on Tue, Feb 13 2018 12:14 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment