పొలాల పోలారం! | polaram vegetable cultivation with modern agricultural methods | Sakshi
Sakshi News home page

పొలాల పోలారం!

Published Wed, Aug 20 2014 3:39 AM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM

polaram vegetable cultivation with modern agricultural methods

షాబాద్:ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ కూరగాయల సాగుకు పెట్టింది పేరుగా నిలుస్తోంది పోలారం గ్రామం. ఇక్కడ ఉన్న 15 కుటుంబాలూ వ్యవసాయమే ఆధారంగా జీవిస్తున్నాయి. టమాటా, వంకాయ, క్యారెట్, బీట్‌రూట్, క్యాబేజీ, పచ్చిమిర్చి, బెండ, గోకెర కాయ, చామగడ్డ, చిక్కుడుతో పాటు తదితర పంటలను రైతులు సాగు చేస్తున్నారు. డ్రిప్, స్ప్రింక్లర్‌ల సహాయంతో వ్యవసాయం చేస్తూ ఔరా అనిపించుకుంటున్నారు.

గుడ్డిమల్కాపూర్ మార్కెట్‌కు కూరగాయలను తీసుకువెళితే.. అక్కడి వ్యాపారులు ముందుగా పోలారం కూరగాయలనే కొనుగోలు చేస్తున్నారంటే ఇక్కడి పంట దిగుబడులకు ఎంత డిమాండ్ ఉందో అర్థమవుతుంది. పదేళ్ల నుంచి కూరగాయలు, ఆకుకూరలు పంటలతో జీవనం గడుపుతున్నామని, తమ పిల్లలను చదివిస్తున్నామని రైతులు గర్వంగా చెబుతున్నారు. ఒకసారి పాలకూర పంటను వేస్తే నెలరోజుల వరకు నిత్యం 200 రూపాయలు సంపాదించుకుంటామని అంటున్నారు.

మండలంలోని మాచన్‌పల్లి అనుబంధ గ్రామం పోలారంలోని ప్రతి రైతుకూ కచ్చితంగా 2 ఎకరాల భూమి ఉంది. బోర్లు వేసుకోవడంతో సాగునీటికి పెద్దగా ఇబ్బందులు తలెత్తడంలేదు. నివాస గృహాలకు పొలాలు సమీపంలోనే ఉండడం రైతులకు కలిసి వచ్చే అంశం. దీంతో కుటుంబ సభ్యులంతా పొలంలో పని చేస్తారు. చదువుకునే చిన్నారులు సెలవు రోజుల్లో పొలం పనుల్లో తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. సంప్రదాయ పంటలను సాగు చేసి నష్టపోవడం కన్నా కూరగాయల సాగుతోనే లాభాలు గడించవచ్చని ఒకరిని చూసి మరొకరు ఆయా పంటలను సాగు చేస్తున్నారు. పండించిన ఉత్పత్తులను శంషాబాద్, హైదరాబాద్, షాద్‌నగర్, చేవెళ్ల మార్కెట్లకు తరలిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement