Polaram village
-
పోలారం వరమయ్యేనా?
వైరా: గోదావరి జలాలను మెట్ట భూములకు మళ్లిస్తామని చెప్పిన నేతల మాటలు నీటి మీద రాతలయ్యాయి. ఏళ్లు గడుస్తున్నా సాగునీటి సమస్య తీరడం లేదు. అరకొర దిగుబడులు అన్నదాత గుండెలపై భారాన్ని దించలేకపోతున్నాయి. ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికలకు ఊళ్లు పట్టుకు తిరిగే నేతలు హామీలు కురిపించి ఆ తర్వాత కనుమరుగై పోవడం తప్ప రైతుల గోడు పట్టడం లేదు. వైరా నియోజకవర్గంలోని జూలూరుపాడు మండలంలో 80 శాతం పైగా వ్యవసాయమే జీవనాధారంగా బతుకులీడుస్తున్నారు. ప్రధానంగా మం డలంలోని కాకతీయుల కాలం నాటి పురాతన పోలారం చెరువు పునర్నిర్మాణం గురించి ఎవరూ పట్టించుకోవడంలేదు. ఏళ్లుగా తీరని కన్నీటి కష్టాలు జూలూరుపాడు మండలంలో సుమారు 24వేల ఎకరాలు సాగులో ఉంది. పత్తి, మిర్చి పంటలను అధికంగా సాగు చేస్తున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిస్తే పంటలు చేతికివస్తాయి. లేకపోతే ఎండిపోతాయి. ఆహార పంటలకు కూడా సాగునీరు అందే పరిస్థితి లేదు. చెరువులు, కుంటలు నిండితేనే, వాటి కింద ఉన్న మూడు వేల ఎకరాల్లో వరి పం డుతుంది. ఈ క్రమంలో రైతులు గోదావరి జలాల కోసం కళ్లు కాయలుకాసేలా ఎదురు చూస్తున్నారు. కానీ కనుచూపు మేర ఆ జలాలు ఇక్కడి మెట్ట భూములను తడిపే సూచనలు కనిపించడం లేదు. గోదావరి జలాలతో సాగునీటి సౌకర్యం కల్పిస్తే మండలంలోని సుమారు ఇరవై వేల ఎకరాలకు పైగా సస్యశ్యామలం కానుంది. కాని పడకేసిన ప్రాజెక్టు పనులు ఎప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. పోలారం.. పరిశీలనకే పరిమితం కాకతీయుల కాలం నాటి పోలారం ప్రాజెక్టు పునర్నిర్మాణం ఇన్నాళ్లు పరిశీలనకే పరిమితమైంది. అటు అధికార పక్షం , ఇటు ప్రతి పక్ష పార్టీల నేతలు ఎన్నోసార్లు సందర్శించారు. అదిగో చేస్తాం.. ఇదిగో చేస్తాం.. అన్నారే తప్ప ఆచరణలో అడుగు ముందుకు పడలేదు. వివిధ రాజకీయ పార్టీలు కూడా ఈ ప్రాజెక్టును పునర్మించాలని కోరుతూ ఆందోళనలు నిర్వహించారు. అయినా పాలకుల్లో చలనం లేదు. ఈ ప్రాజెక్టు గుట్టల్లో నుంచి వచ్చే వరదతో నిండుతుంది. ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న ఈ ప్రాజెక్టు ప్రాంతంలో తెగిన చెరువు కట్ట, లోతు వాగుకు ఇరువైపులా పడిన గండ్లు కనిపిస్తాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా సుమారు పదివేల ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశం ఉందని నీటిపారుదలశాఖ అధికారులే అప్పట్లో అంచనా వేశారు. పంటలు ఎండిపోతున్నాయి.. పోలారం చెరువు నిర్మాణం కోసం ఏళ్లతరబడి ఎదురుచూస్తున్నాం. ఎంతో మంది రాజకీయ ప్రముఖులు చెరువులను సందర్శించారు. నిర్మాణం చేపడతామని హామీనిచ్చారు. కానీ అభివృద్ధి చేయలే దు. ఏటా మా పంటలు ఎండిపోతున్నాయి. –చీకటి రామారావు, గుండ్లరేవు, జూలూరుపాడు మండలం సమస్యలను పరిష్కరించాపలి ఈ ఎన్నికల్లోనైనా నేతలు కచ్చితమైన హామిని ఇచ్చి పోలారం చేరువు నిర్మాణాన్ని పూర్తి చేయాలి. 10వేల ఎకరాల్లో సాగులో ఉన్న పంటలను కాపాడి ఆదుకోవాలి. ప్రభుత్వాలు మారుతున్నాయి. సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచు కోవటం లేదు. –లావూడ్య రూప్లా, గుండ్లరేవు, జూలూరుపాడు మండలం -
పొలాల పోలారం!
షాబాద్:ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ కూరగాయల సాగుకు పెట్టింది పేరుగా నిలుస్తోంది పోలారం గ్రామం. ఇక్కడ ఉన్న 15 కుటుంబాలూ వ్యవసాయమే ఆధారంగా జీవిస్తున్నాయి. టమాటా, వంకాయ, క్యారెట్, బీట్రూట్, క్యాబేజీ, పచ్చిమిర్చి, బెండ, గోకెర కాయ, చామగడ్డ, చిక్కుడుతో పాటు తదితర పంటలను రైతులు సాగు చేస్తున్నారు. డ్రిప్, స్ప్రింక్లర్ల సహాయంతో వ్యవసాయం చేస్తూ ఔరా అనిపించుకుంటున్నారు. గుడ్డిమల్కాపూర్ మార్కెట్‌కు కూరగాయలను తీసుకువెళితే.. అక్కడి వ్యాపారులు ముందుగా పోలారం కూరగాయలనే కొనుగోలు చేస్తున్నారంటే ఇక్కడి పంట దిగుబడులకు ఎంత డిమాండ్ ఉందో అర్థమవుతుంది. పదేళ్ల నుంచి కూరగాయలు, ఆకుకూరలు పంటలతో జీవనం గడుపుతున్నామని, తమ పిల్లలను చదివిస్తున్నామని రైతులు గర్వంగా చెబుతున్నారు. ఒకసారి పాలకూర పంటను వేస్తే నెలరోజుల వరకు నిత్యం 200 రూపాయలు సంపాదించుకుంటామని అంటున్నారు. మండలంలోని మాచన్‌పల్లి అనుబంధ గ్రామం పోలారంలోని ప్రతి రైతుకూ కచ్చితంగా 2 ఎకరాల భూమి ఉంది. బోర్లు వేసుకోవడంతో సాగునీటికి పెద్దగా ఇబ్బందులు తలెత్తడంలేదు. నివాస గృహాలకు పొలాలు సమీపంలోనే ఉండడం రైతులకు కలిసి వచ్చే అంశం. దీంతో కుటుంబ సభ్యులంతా పొలంలో పని చేస్తారు. చదువుకునే చిన్నారులు సెలవు రోజుల్లో పొలం పనుల్లో తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. సంప్రదాయ పంటలను సాగు చేసి నష్టపోవడం కన్నా కూరగాయల సాగుతోనే లాభాలు గడించవచ్చని ఒకరిని చూసి మరొకరు ఆయా పంటలను సాగు చేస్తున్నారు. పండించిన ఉత్పత్తులను శంషాబాద్, హైదరాబాద్, షాద్‌నగర్, చేవెళ్ల మార్కెట్లకు తరలిస్తున్నారు.