ఆరోజు మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు కొని ఇంటికి తీసుకువచ్చింది కేరళలోని కొట్టాయంకు చెందిన రెమాదేవి. కూరగాయలను కడుగుతున్నప్పుడు ఒకరకమైన రసాయనాల వాసన వచ్చింది. ఆ సమయంలో పిల్లలు, వారి భవిష్యత్ గుర్తుకు వచ్చింది. అదే సమయంలో తాను ఒక నిర్ణయం తీసుకుంది...
‘ఇంటికి అవసరమైన కూరగాయలు ఇంటిదగ్గరే పండించుకుంటాను’ అలా మిద్దెతోటకు శ్రీకారం చుట్టింది రెమాదేవి. అమ్మమ్మ రంగంలోకి దిగింది. సేంద్రియ వ్యవసాయంలో అమ్మమ్మది అందెవేసిన చేయి. ఆమె సలహాలు, సూచనలతో మిద్దెతోట పచ్చగా ఊపిరిపోసుకుంది. కొంత కాలానికి...ఇంటి అవసరాలకు పోగా మిగిలిన కూరగాయలను అమ్మడం మొదలుపెట్టారు. తమకు ఉన్న మరో రెండు ఇండ్లలోనూ మిద్దెతోట మొదలుపెట్టింది రెమాదేవి. అలా ఆదాయం పెరుగుతూ పోయింది.
మిద్దెతోటపై ఆసక్తి ఉన్న వాళ్లు రెమాను రకరకాల సలహాలు అడిగేవారు. ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని ‘రెమాస్ టెర్రస్ గార్డెన్’ పేరుతో యూట్యూబ్ చానల్ మొదలుపెట్టింది. ‘మిద్దెతోటకు పెద్దగా ఖర్చు అక్కర్లేదు’ అని చెబుతూ ఆ తోటపెంపకానికి సంబంధించిన ఎన్నో విషయాలను అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు చెబుతుంది. వంటగది వ్యర్థాలతో మనకు కావల్సిన ఎరువులు ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోల ద్వారా చూపుతుంది.
దీంతో పాటు సోషల్ మీడియా ఫార్మింగ్ గ్రూప్స్ ద్వారా విత్తనాలు అమ్ముతుంది రెమాదేవి. కేవలం విత్తనాల అమ్మకం ద్వారానే నెలకు 60,000 రూపాయల ఆదాయం ఆర్జిస్తుంది. రెమాదేవిని అనుసరించి ఎంతోమంది మిద్దెతోటలను మొదలుపెట్టి రసాయన–రహిత కూరగాయలను పండించడమే కాదు, తగిన ఆదాయాన్ని కూడా గడిస్తున్నారు. మంచి విషయమే కదా!
Comments
Please login to add a commentAdd a comment