విదేశీ వంగడాల సందడి
- అమెరికా కూరగాయల సాగుకు మన్యం అనుకూలం
- ప్రయోగాత్మకంగా ఎనిమిది రకాల పెంపకం
- దిగుబడి బాగుందన్న పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు
కొండకోనలు పచ్చదనానికి నెలవులు.. హరిత సౌందర్యానికి నిలయాలు.. మన్యంలో ఏ మొక్కయినా ఏపుగా ఎదుగుతుంది. ఇక్కడి నేల, వాతావరణం అన్ని రకాల పంటలకు అనువుగా ఉంటాయని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా విదేశీ కూరగాయలకు ఏజెన్సీ ప్రాంతం అనుకూలమని స్పష్టమైంది. అందుకే ఇప్పుడిప్పుడే వీటి సాగు ఇక్కడ పెరుగుతోంది. ఇది విస్తారంగా జరిగితే గిరిజన రైతులకు మంచి ఆదాయం లభించే వీలుంది.
చింతపల్లి, న్యూస్‌లైన్: విశాఖ మన్యంలో విదేశీ జాతుల కూరగాయలు ఏపుగా పెరగడానికి అనువైన వాతావరణం ఉన్నట్టు శాస్త్రవేత్తల పరిశోధనల్లో మరోసారి రు జువైంది. ఇటీవల ప్రయోగాత్మకంగా చేపట్టిన సాగులో ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నట్టు డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు తెలిపారు.
అమెరికాలో సాగవుతున్న వివిధ రకాల కూరగాయలను గత ఏడాది నవంబర్‌లో ఇక్కడ ప్రయోగాత్మకంగా పెంచగా, మంచి దిగుబడులు వచ్చాయని పరిశోధన స్థానం శాస్త్రవేత్త కె.చంద్రశేఖర రావు ఆదివారం విలేకరులకు తె లిపారు. ఎంతో ఆరోగ్యకరమైన విదేశీ కూరగాయలకు మార్కెట్‌లో మంచి గిరాకీ ఉందని, వీటి ద్వారా గిరిజనులకు ఇబ్బడిముబ్బడిగా రాబడి వచ్చే వీలుందని చెప్పారు. కొద్ది పాటి సస్యరక్షణ చర్యలు చేపడితే అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. విశాఖ మన్యంలో గిరిజనులు చాలాకాలంగా దేశవాళీ కూరగాయలు సాగు చేస్తున్నారు.
దిగుబడులు నానాటికీ తగ్గుతూ ఉండడంతో రసాయన ఎరువులను విపరీతంగా వాడుతున్నారు. కానీ వీటికి ఆదరణ తగ్గుతోంది. ఈ నేపథ్యంలో కొత్త రకాల పంటలపై ఇక్కడి శాస్త్రవేత్తలు విస్తృత పరిశోధనలు జరుపుతున్నారు. శీతల వాతావరణం ఉన్న ఏజన్సీలో విదేశీ రకాలు బాగా పెరుగుతాయని గుర్తించారు. ఇక్కడి ప్రాంతాలకు అనువైన రకాలను హిమచల్ ప్రదేశ్‌లోని భారత వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి తెచ్చారు. అమెరికాలో అధికంగా సాగవుతున్న 8 రకాల వంగడాలను గత ఏడాది నవంబర్‌లో ఇక్కడ ప్రయోగాత్మకంగా పెంచడం మొదలెట్టారు. ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని గుర్తించినట్టు చంద్రశేఖరరావు తెలిపారు.
కొత్త రకాలు ఇవే
అమెరికాలో ఎక్కువగా వినియోగించే అమెరికన్ క్యాబేజి, గ్రీన్ బేబీ లెట్యూస్, సెలరీ, స్పినాచ్, టర్నిప్, బ్రాకోలీ, గ్రీన్ మాజిక్, బ్రసెల్స్ స్ప్రౌట్స్, నూల్‌కోల్, రిజీ అనే ఆకుకూరలను పెంచేందుకు ఇక్కడి వాతావరణం అనుకూలంగా ఉంది. ఉత్తర భారతదేశంలో ఈ రకాలు అధికంగా సాగవుతున్నాయి.
సాగుపై అవగాహన కల్పిస్తాం
గిరిజన రైతులకు విదేశీ కూరగాయల సాగుపై అవగాహన కల్పిస్తాం. రైతులు ముందుకు వస్తే వీటిని సాగు చేసేందుకు ప్రోత్సహిస్తాం. శాస్త్రీయ పద్ధతిపై అవగాహన కల్పిస్తాం
- కె.చంద్రశేఖరరావు, ఉద్యాన శాస్త్రవేత్త, చింతపల్లి