విద్యార్థుల ‘పంట’ పండింది! | Students take up vegetable cultivation at Residential Schools | Sakshi
Sakshi News home page

విద్యార్థుల ‘పంట’ పండింది!

Published Sat, Sep 9 2017 2:02 AM | Last Updated on Sun, Sep 17 2017 6:36 PM

విద్యార్థుల ‘పంట’ పండింది!

విద్యార్థుల ‘పంట’ పండింది!

వీఎం హోం రెసిడెన్షియల్‌ స్కూల్‌ భూముల్లో కూరగాయల సాగు
విద్యార్థులకు వారంలో రెండు రోజులు వాటితోనే భోజనం
ఇటు ఆరోగ్యం.. అటు ఆదా..
హోం భూముల పరిరక్షణ కూడా..
సాంప్రదాయ పద్ధతుల్లో ఆరున్నర ఎకరాల్లో ఏడు రకాల పంటలు  


సాక్షి, హైదరాబాద్‌ :  అదో రెసిడెన్షియల్‌ స్కూల్‌.. 650 మందికిపైగా పిల్లలు.. వారంలో రెండు రోజులు వారికి స్పెషల్‌.. స్కూల్‌ స్థలంలోనే సాంప్రదాయ పద్ధతిలో పండించిన తాజా కూరగాయలతో వారు భోజనం చేస్తారు.. కూరగాయలే కాదు.. చింతపండు దగ్గరి నుంచి కొత్తిమీర వరకూ అన్నీ స్కూల్‌ స్థలంలో పండినవే. ఎంతో మంది అనాథలు, తల్లిదండ్రులకు దూరమైన పిల్లలను ఆదుకుంటున్న విక్టోరియా మెమెరియల్‌ (వీఎం) హోం రెసిడెన్షియల్‌ పాఠశాల మరో ప్రత్యేకత ఇది.

ప్రస్తుతం వారానికి రెండు రోజులు ...
వీఎం హోమ్‌ పాఠశాలలో ప్రస్తుతం 650 మంది పిల్లలు ఉన్నారు. ఎస్సీ అభివృద్ధి శాఖ ద్వారా ఈ పాఠశాలను నిర్వహిస్తున్నా.. ఇందులో గురుకుల విద్యా లయాల సొసైటీ నిబంధనలను అమలు చేస్తున్నారు. వారంలో రెండు రోజుల పాటు మాంసాహారాన్ని అందిస్తుండగా.. మరో రెండు రోజుల పాటు తాము పండించిన కూరగాయలు, ఆకుకూరలనే వినియోగిస్తుండటం గమనార్హం. మిగతా రోజులు బయటి నుంచి తెచ్చిన కూరగాయలను వినియోగిస్తున్నారు.

ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య పెరగడంతో తాము పండిస్తున్న కూరగాయ లు వారంలో రెండు రోజులకు మాత్రమే సరిపోతున్నాయని ప్రిన్సిపాల్‌ వెంకట్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం వీఎం హోమ్‌ ఆధ్వర్యంలోని తోటలో వంకాయ, బీరకాయ, బెండ, టమాటా, చిక్కుడు, కరివేపాకు, కొత్తమీర, పాలకూర తదితర పంటల్ని పండిస్తున్నారు. తాజాగా వర్షాకాలం నేపథ్యంలో మరిన్ని పంటలు వేయడానికి సిద్ధమవుతున్నారు. ఇక కూరగాయలు పండిస్తున్న స్థలం లోనే 42 పెద్ద చింత చెట్లు కూడా ఉన్నాయి. వాటి నుంచి వచ్చే చింతపండును కూడా హోం కోసం వినియోగిస్తున్నారు.

ఒక బోరు.. రెండు ఎడ్లతో...
‘ఆరున్నర ఎకరాల తోటలో ఒకే బోరు ఉన్నా.. పుష్కలంగా నీళ్లున్నాయి. కూరగాయల పంటలకు అవి సరిపోతున్నాయి. టమాటా, బెండ, బీర, సొర, మిరప, వంకాయ తదితర ఒక్కో పంటను పావు ఎకరం స్థలంలో పండిస్తున్నాం. పాలకూర, కొత్తమీర, కరివేపాకు సైతం పండిస్తాం. వ్యవసాయ పని కోసం రెండు ఒంగోలు ఎడ్లను వినియోగిస్తున్నాం. అనాథ పిల్లలకు తాజా కూరగాయలు ఇస్తున్నామని తృప్తిగా ఉంటుంది..’’
– ముత్యాలు, వీఎం హోం తోట నిర్వాహకుడు

సాంప్రదాయ పద్ధతిలో సాగు..
హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో ఉన్న విక్టోరియా మెమోరియల్‌ హోమ్‌ ట్రస్టు పరిధిలో 73 ఎకరాల భూమి ఉంది. అందులో ఆరున్నర ఎకరాలు ఎన్‌టీఆర్‌ నగర్‌ సమీపంలో దూరంగా ఉంది. ఆ భూమిని పరిరక్షించేందుకు ప్రహరీగోడ నిర్మించిన ట్రస్టు.. అందులో పంటలు పండించాలన్న ఆలోచన చేసింది. నెలవారీ వేతనాలపై నలుగురు కూలీలను నియమించుకుని.. వివిధ రకాల కూరగాయలను సాంప్రదాయ విధానంలో సాగుచేస్తున్నారు. ఎరువులు వంటివి తక్కువగా వాడుతూ మంచి దిగుబడిని కూడా సాధిస్తుండటం గమనార్హం.
వారిలో మా పిల్లలను చూసుకుంటున్నా..
‘మా సొంతూరు నారాయణపురం మండలం పుట్టపాక. అక్కడ ఉపాధి లేకపోవడంతో హైదరాబాద్‌కు వలస వచ్చాం. నా ఒక్క కొడుకు కొన్నేళ్ల కింద ప్రమాదంలో చనిపోయాడు. దాంతో మానసికంగా బాగా కుంగిపోయిన. పొట్టకూటి కోసం ఇక్కడ కూలి పనిలో చేరా. జీతం తక్కువ అయినా అనాథ పిల్లల కోసం చేస్తున్నా. ఆ పిల్లల్లో నా కొడుకును చూసుకుంటున్నా..’’     
– లక్ష్మమ్మ, తోటనిర్వాహకురాలు

అటు రక్షణ.. ఇటు ఆదా.
‘‘వీఎం హోమ్‌కు ఉన్న భూముల్లో ఆరున్నర ఎకరాలు విడిగా, స్కూల్‌కు దూరంగా ఉంది. ఆ భూములు ఆక్రమణకు గురవుతాయనే ఉద్దేశంతో ప్రహరీ నిర్మించి, కూరగాయల సాగు చేపట్టాం. ఈ స్థలంలో ఉన్న నిజాం కాలం నాటి బావిలో ఇప్పటికీ నీళ్లు ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. 15 ఏళ్లుగా పంటలు పండిస్తున్నాం. మధ్యలో కొంత కాలం వ్యవసాయం చేసేవారు దొరకక ఆపేసినా.. మళ్లీ ప్రారంభించాం. తాజా కూరగాయలతో పిల్లలతో కలసి మేం కూడా భోజనాలు చేస్తాం..’’
– వెంకట్‌రెడ్డి, వీఎం హోమ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement